kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన న్యాయం - 20 వ భాగం

మనసు చేసిన న్యాయం - 20 వ భాగం

3 mins
11


మనసు చేసిన న్యాయం - 20 వ భాగం


కాలచక్రం గిర్రున నాలుగేళ్లు తిరిగిపోయింది.నేను డిగ్రీ తరువాత బి.ఈ.డి. చేసి వెంటనే జిల్లాపరిషత్ లో బి.ఈ.డి.టీచర్ గా ఉద్యోగం సంపాదించాను .

రికమెండేషన్ తో మాఊరిలోనే ఉన్నత పాఠశాలలో పాఠశాల సహాయకునిగా (సోషల్ )పోస్టింగ్ వేయించేసారు నాన్నగారు.

ఈ నాలుగేళ్లలో అమ్మ పెంపకంలో ముద్దబంతిలా ఎదిగింది మా బంగారు తల్లి సాత్విక.ఇంట్లో ఆమె తనకి తెలుగు, ఆంగ్లం అన్ని అక్షరమాలలు నేర్పేసింది అమ్మ. నేను మా పాఠశాల వెనుక ఉన్న కాన్వెంట్లో మంచి రోజు చూసి ఎల్.కె.జీ.లో చేర్పించేసాను.నాతో రోజు సైకిల్ మీద కూర్చోపెట్టుకుని,కాన్వెంట్ కు తీసుకెళ్లేవాడిని. ఇంటర్వెల్ లో వెళ్లి అన్నం తినిపించేవాడిని.సాయంత్రం తీసుకువచ్చేవాడిని.సరిగ్గా అప్పుడే తననుంచి ప్రపోజల్ వచ్చింది.తన పేరు చంద్రిక .పాపకి ప్రస్తుతం ఎల్కేజీ టీచర్ తానే.తన తరగతిలో ఉన్న అందరి పిల్లలకన్నా చంద్రిక పాపని చాలా శ్రద్ధగా చూసుకునేది.

దానికి కారణం లేకపోలేదు. కొన్ని కారణాల వల్ల ఆ పాప మా వద్ద పెరుగుతోంది. మా అన్నయ్య కూతురు అని ఆ అమ్మాయికి చెప్పాను.

" అంటే మీకు ఇంకా పెళ్ళి కాలేదా సార్?తాను మీ పాపే అనుకుంటున్నాను." అని ఎదురు ప్రశ్న వేసింది

" లేదు.సంబంధాలు చూస్తున్నారు"అన్నాను.

మరుసటి రోజు ఆమె నన్ను ఇష్ట పడుతున్నానని, నాకు అభ్యంతరం లేకపోతే తమ పెద్ద వాళ్ళతో మా పెద్దవాళ్లను వచ్చి మాట్లాడమని ఫోన్ నెంబర్ ఇచ్చింది.

చంద్రికను నేను కాదనవలసిన అవసరం ఏమాత్రం నాకు కనపడలేదు. చటుక్కున చూడాలనిపించే అందం, కళ అయిన ముఖం, చిన్నపిల్లలకి చదువు చెప్పే ఓర్పు, సహనం ఉన్నదీ అంటే అంతకుమించి ఏముండాలి?

అందుకే అమ్మతో చెప్పాను. నాన్నగారికి నెంబర్ ఇచ్చాను. నాన్నగారు చంద్రిక వాళ్ళ నాన్నగారితో మాట్లాడారు .చంద్రికకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. వాళ్ళ నాన్నగారు ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్.

మేము ఇద్దరు ఎంత ఇష్టపడ్డామో, పెద్దవాళ్ళు అంతగా మనసుపడి ఆ వేసవిలో పెళ్లి చేశారు.

ఈ నాలుగు సంవత్సరాలలో అన్నయ్య ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు. ఉద్యోగం చేసుకుంటూ ప్రతి ఆదివారం ఇంటికి వచ్చి సాత్వికతో ఆడుకుని వెళుతున్నాడు.

అన్నయ్య నా పెళ్లి పని ప్రతీది నెత్తిమీద వేసుకుని, అవసరమైన నాన్నగారు, అమ్మల సలహాలు తీసుకుంటూ ఎంతో సమర్ధవంతంగా నా పెళ్లి జరిపించాడు.

అన్నయ్య సంసారం విషయాలు అన్నీ తెలిసిన చంద్రిక ఆశ్చర్యంతో ముక్కుమీద వేసుకుంది. ఆడవాళ్ళలో కన్నబిడ్డ కాపురం నాశనం చేసే ఇలాంటి తల్లులు , అలాగే పాలుతాగే కన్న బిడ్డను వదిలేసి పుట్టింటికి చేరుకునే తల్లులు కూడా ఉంటారా ?అని సాత్విక పరిస్థితి చూసి ఎంతో జాలి పడింది చంద్రిక.

"ఏమండీ?బావ గారికి మళ్లీ పెళ్లి చేసే ప్రయత్నం చేయలేదా మరి ?"అడిగింది నన్ను

"అన్నయ్య వదిన విడాకులు ఇవ్వలేదు" అన్నాను నేను.  

చంద్రిక కాపురానికి వచ్చాక అన్నయ్య సాత్వికని చంద్రికకి అప్పగిస్తూ అన్నయ్య అన్నాడు.

"అమ్మ చంద్రిక! నాలుగు సంవత్సరాలుగా అమ్మ సాత్వికని ఎంతో కష్టపడి పెంచుతోంది. అమ్మకు సాయంగా నువ్వు కూడా సాత్వికని నీ శాయశక్తులా ప్రయత్నించి బాగా చదువుకునేలా దానిలో అభిరుచి కలిగించు. అలా చేస్తే మళ్ళీ జన్మలో నీ కడుపున బిడ్డగా పుట్టి మీ రుణం తీర్చుకుంటాను తల్లి" అన్నాడు అన్నయ్య. వద్దనుకున్నా అన్నయ్య కంఠం చివరిలో వణికింది.

"ఎంతమాట బావగారు! సాత్వికని అత్తయ్య గారు ఎంతో శ్రద్ధగా పెంచుతున్నారో,అంత శ్రద్ధగాను తనని విద్యావంతురాలిని చేయడానికి నా శక్తి కొద్ది ప్రయత్నం చేస్తానని మీకు మాటిస్తున్నాను. ఈ మీరు విషయంలో నిశ్చింతగా ఉండండి బావగారు!" అని మాట ఇచ్చింది . అన్నయ్య సంతృప్తిగా ఉద్యోగానికి వెళ్ళిపోయాడు.

ఇక సాత్విక చంద్రికకు బాగా మాలిమి అయింది. చంద్రిక ఇస్తున్న శిక్షణలో తరగతిలో మొదటి స్థానంలో ఉండేలా చదువుకుంటోంది.

**********

నాన్నగారు సొంత ఇల్లు కట్టారు. అందులోకి మారిపోయాం.నాకు పాప, బాబు పుట్టారు.

రెండు వాటాలుగా కట్టిన డాబాలో ఒక వాటాలో అమ్మ, నాన్నగారు, సాత్విక, రెండవ వాటాలో నేను, చంద్రిక పిల్లలు ఉంటున్నాం.

ఆరోజు నాగుల చవితి అని లోకల్ హాలిడే ఇచ్చారు.నాన్నగారు బాంక్ కి వెళ్లిపోయారు.

ఆరోజు మా ఇంటికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు.వాళ్ళని చూసి మేము నిర్ఘాంతపోయాము.

అన్నయ్య అత్తగారు నాగమణి, వదిన, ఆమె తమ్ముడు. ఆనాటి ఆవిడే ఈ నాగమణి అంటే పొరపాటున కూడా ఎవరూ నమ్మరు.అలాగే వదిన కూడా...వెలిసిపోయిన నేత చీరలో అశోక వనంలో సీతలా ఉంది.ఆమెలో కనిపిస్తున్నది నుదుట పావలాకాసంత ఎర్రని కుంకుమ మాత్రమే.కొడుకు అచ్చంగా మామయ్యగారి నోట్లోంచి ఊడిపడ్డట్టు ఉన్నాడు.ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కుర్రడూప్ లా.

చాలా కాలమైంది కాబట్టి నేను "నమస్కారం అత్తయ్యగారు"అన్నాను.

ఆవిడ నన్ను చూసి నమస్కారం చేసింది.

చంద్రిక మంచినీళ్లు పట్టుకువచ్చి ఇచ్చింది.

"మా ఆవిడ చంద్రిక" పరిచయం చేశాను.

ఆవిడ మంచినీళ్లు తాగుతూ నిశితంగా చంద్రికను పరిశీలించింది.ఇంతలో అమ్మ వంటగదిలోంచి వచ్చింది.

అత్తయ్యగారు వస్తూనే అమ్మ చేతులు పట్టుకుంది.

"వదినా.మీ అన్నయ్యగారిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. చీమకైనా ఆయన సర్వీసులో కీడుచేసి ఎరుగరు. ఒకపక్క ఎదిగిన పిల్లలు...వాళ్ళ చదువులు... ఆయన పోయిన నాటికి పిల్లవాడి చదువు పూర్తి కాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాను.ఒక పక్క పోలీస్ కేసులు... ఆ రైల్వే అధికారుల బెదిరింపులు, ఆఫీస్ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాను. చివరికి ఎంతో డబ్బు ఖర్చు పెడితే ఆయన కేసు మాఫీ అయింది. ఆ తర్వాత బంగారం, పొలం అంతా అమ్మేసి పై అధికారుల ఎందరో కాళ్ళు పట్టుకొని పిల్లవాడికి ఆయన ఉద్యోగం ఇప్పించుకోగలిగాను. వాడికి పెళ్లి చేసాను. ఈ హడావుడిలో మిమ్మల్ని ఏడిపించిన పాపానికి నా కూతుళ్ళిద్దరు వాళ్ళ లవర్స్ ని పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. నన్ను నా కూతుర్ని క్షమించండి వదినా.నువు క్షమించానంటే కాని నీ కాళ్ళు వదలను."అంది అత్తయ్యగారు.

"లే వదినా లే.ఈవేళ నాగుల చవితి అని ఉపవాసం ఉన్నాను. నీకు జరిగిన కష్టం ఆనాడు విన్నాను. కానీ మాకు ఎవరూ ఏ కబురూ చెప్పలేదు. అందుకే నిన్ను చూడటానికి రాలేకపోయాను"అంది అమ్మ.

(మిగతా 21వ భాగంలో)



Rate this content
Log in

Similar telugu story from Drama