లేడి డిటెక్టివ్ మంగతాయారు
లేడి డిటెక్టివ్ మంగతాయారు


ఆరునెలల క్రితం వరకు నెలకు మూడు పేరంటాలు , ఆరు కిట్టి పార్టీలతో అలరారిన ఆ అందమైన
సుందర వనం కాలనీ ఒక్కసారిగా “ఖామోష్” అయిపోయింది.
మధ్యాహ్నం రెండు కొట్టిందంటే ఆ కాలని నిండా కర్ఫ్యు వాతావరణం కమ్మేస్తుంది.
కొన్ని ఫ్యామిలీలు చూసిన సినిమాలకే, మళ్ళీ మళ్ళీ మ్యాట్నీ లకు దౌడు తీస్తుంటే ...మరికొంతమంది సాయంత్రమెప్పుడో బయటికి వచ్చే బడిపిల్లల కోసం పారొచ్చి బడుల ముందున్న చెట్ల కిందో, పుట్ల కిందో తలదాచుకోవడం నిత్య కృత్యమైపోయింది అంటే తీవ్రతను అర్ధం చేసుకోవాలి. ఇక రిటైర్డు కుటుంబాలయితే తలుపులన్నీ మూసేసుకుని ...బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు ఉగ్గ బట్టుకుని వూపిరి తీస్తుంటాయి.
కారణం యే స్వైన్ ఫ్లూనో, డెంగీ దోమలో, మద్రాస్ కన్నో, యెబోలా వైరెస్సో అనుకుంటే చిప్స్ మీద కాలేసినట్లే.
అయ్యా ,మరియు అమ్మా!తమరా చిప్సును అలా చితక తోక్కేయకండి. చిన్నారి చిప్స్ చితికిపోతాయి.
ఆదేవతా రహస్యాన్ని నేనే విప్పి చెపుతాను. వినేయండి.
ఇంతటి సెన్సేషన్ కు కారణ మయిన తల్లి పేరు మంగ తాయారు .. కిట్టని వాళ్ళు వంట తయారు .. చొంగ తాయారు ..
అంటారు రు. అసలలా యెందుకు అంటారో తెలియని ఆ రహస్యాన్ని రహస్యం గానే వుంచేశారు. మరి మాకు చెప్పకుండా దాస్తే తల వేయి చెక్కలు ,లక్ష ముక్కలు అవుతుందని శాపాలు పెట్టకండి. నేను తెలుసుకున్న ఆ రహస్యం గురించి చెప్పాలంటే ఒకటా రెండా? వందలు వేలు . పోనీ అందులో ముఖ్యాతి ముఖ్యాలు ... కధ,కవితా,వంటా,తంటా. ఇందులో మొదటి మూడు తాయారు ప్రత్యేకతలైతే ..తంటా మాత్రం కాలని వాసులదే అని నొక్కి వక్కాణించ వలసిన అవసరం లేదనుకుంటాను .
అసలు విషయంలోకి వస్తాను.
తాయారు లేదా మంగతాయారు అన్న అసలు పేరు అటకెక్కించి మాలతి వుండూరుగా చెప్పుకుంటూ ..యెప్పటికైనా ...యెలాగైనా స్వర్గీయ మాలతి చందూర్ లా మహా రచయిత్రినై వెలిగి పోవాలనే దురదతో తెలుగు భాషా ప్రక్రియల్లో వేలు పెట్టని దేదీ లేదు .
అయితే తన రచనలని తిరిగు టపాలో పోస్ట్ చేసిన ఎడిటర్లని { ఆమె దృష్టిలో కత్తిరింపు గాళ్లనీ } తిట్టని రోజు లేదు... రాదుకూడా.
అయినా శవాన్ని వదలని విక్రమార్కుడిలా తన రాత ప్రతులను,వండిన వoటలను భుజాన వేసుకుని రోజుకో గడప తోక్కెస్తూ
కవితా గానమో,కధా దానమో చేస్తూ మరియు తన పాకాన్ని పంపిణీ చేస్తూ కాలనీ వాసుల గుండెల్లో బండ రాయై నిండిపోయింది.
ఇదీ తాయార్ వుండూరు గారి పరమ రహస్యం.
హమ్మయ్య చెపుతున్న నాకు ,వింటున్న మీకు టన్ను బరువు దింపుకున్న ఫీలింగ్?
ఇక మనం వుండూరు గారి లీలలు అనబడు గోలల్లోకో ,బాధల్లోకే తొంగి చూద్దాము. తట్టుకో లేకపోతే మరీ వంగిపోకుండా పరార్ మంత్రాన్ని పాటిద్దాము. సిద్ధమా ?మీరు ఓకే అంటే నేనుకూడా రెడీ .
మొదటి ముచ్చట. మొన్నీమధ్య చుట్టం చూపుగా వచ్చిన అత్తా మామల్ని యెట్టా యేపుకు తిందో చూద్దాము.
పొరపాటున తన కధల్ని “కధలాకాకరకాయలా” అనినోరుజారారని ..వున్న నాలుగు రోజులు కాకరకాయ కూర, కాకరకాయ వేపుడు,కాకరకాయ చారు,కాకరకాయ పచ్చళ్లతో కన్నీరు పెట్టించి కాలనీ నుండి పారిపోయేలా చేసి టాకాఫ్ ద కాలని గా పేరు గడించేసింది.
మర్నాడే తాను గీకిన పారేసిన పారడీ కవితను పటం కట్టించి భోజన సాలలో గోడకు వురి తీసేసింది.
పారడీ అన్నానని ఫక్కున నవ్వేయకండి. కవీసం ఓ లుక్కేయండి. మీకు అవసరం అవుతుందేమో చెప్పలేము కదా?
“నా కూరలు బాలేదన్న వాడిని కత్తితో పొడుస్తా.
నా వంటకు వంకలు పెట్టిన కుంకలకు వాతలు పెట్టేస్తా .”
ఆరోజు మొదలు వుండూరు ధర్మ పతి ఉమాపతి ఫలహారాలు మొదలు ఆహారాలను కూడా బయటే లాగించేస్తు బ్రత్కి బట్ట కట్టేశాడు .
ఫ్లాష్ బ్యాక్ నుండి ప్రస్తుతానికి వస్తున్నాను.
వుండూరు తల్లి మన హీరోయిన్ జండూబామ్ లా కమలా చుండూరు యింట్లో తన సరంజామాతో వాలిపోయింది.
“ఆంటీ ఆంటీ లిటిల్ స్టార్ .. అంకుల్ కేమో బ్యూటీ స్టార్ .. వంటలకైతే సూపర్ స్టార్..
పిండి వంటలకేమో మెగా స్టార్.”
పాటలకందని రాగంతో .. మాటలకందనిరోగంతో అడుగు పెట్టేసింది. “వచ్చేసా నాంటీ .. వచ్చేశా .. గీకేసా నాంటీ గీకేసా .
మొన్న పత్రికలో రాయమని యిచ్చిన జోడు తోడు మీద కవిత రాసేశా . వినండి ఆంటీ వినండి.
“కళ్ళకు కావాలి జోడు... వయసుకు కావాలి తోడు..నాకు ప్రైజు యివ్వకుంటే చూడు
ముక్కలు చెక్కలే నీ మాడు.
వా వా వహ్వా.. జోడు తోడు చూడు మాడు.”
తన కవితా గానానికి ..వాగుడు బాణానికి యెటువంటి స్పందనా రాకపోవడంతో చీదేసిన సాహో ప్రొడ్యూసర్ ముఖం పెట్టేసి ..కన్ఫ్యూజై పోయింది ..ఫ్యూజై పోయిన బల్బులా.
“ఏమయ్యిందాంటీ ?కొంపలు కూల్చే కూతురు సీరియల్లో చిన్నకూతురు కూడా లేచిపోయిందా?
అత్తకివ్వాలనుకున్న పాయిజన్ పాయసం కోడలు పిల్లే కతికేసిందా?
మీరలా అశోక వనంలో ద్రౌపతిలా, ఛీదేసిన సినిమా హీరోయిన్లా ఫేసు పెడితే అస్సలు బాలేదు.
అంకుల్ గారితో అదా?
పనమ్మాయితో ఇదా ?”
పేట్రేగి పోయింది తాయారు.
“అదీలేదు ,ఇదీలేదు .”
దీర్ఘంగా నిట్టూర్చింది కమలాoటీ.
“అయితే అంకుల్ గారి సెకండ్ సెటప్పై వుంటుంది . ష్యూరాంటీ!”
“ముందు నువ్వు షటప్పైపోతే పటాస్ పేలుస్తా”
ఆంటీ యిచ్చిన వార్నింగును లైటుగా తీసేసుకుని
“అయితే అగ్గిపెట్టి తెమ్మంటారా?”
చమత్కారం చూపించా ననుకుంది.
“జోకులు మేకుల్లా గుచ్చుకుంటున్నాయి.
చెత్త జోకులు ఆపి నా అవస్థను చూడు. అయిపోయింది అంతా అయిపోయింది. అమెరికా నుండి వచ్చిన అంకుల్ కి నా వంటలు చేదైపోయాయి. అన్నిటికి వంకలే. చివరాఖరుకు అన్నం కూడా వండలేవా ?అంటూ చిరాకు పడిపోతున్నారు చికాకు పెట్టేస్తున్నారమ్మాయ్ !”
“అదేమిటాంటీ ? కధలు వండాలంటే వుండూరు. వంట వండాలంటే చుండూరు కదా?కాలని ఫేమస్ ?అయినా అంకుల్ మీ వంటకు ఫిదా కదాంటీ?”
తెగ ఆశ్చర్య పోయింది వుండూరు తల్లి.
“అదంతా గతచరిత్ర. అది అమెరికా వెళ్ళక ముందు తల్లి. ఇప్పుడు కాదు .”
వాపోయింది కమలా ఆంటీ కొంగుతో కన్నీరు తుడుచుకుంటూ.
ఆలోచనలో పడిపోయింది వుండూరు తల్లి.
ఆమెలోని డిటెక్టివ్ ఒళ్ళు విరుచుకుంటూ ఒక్కసారిగా నిద్ర లేచాడు.
“ఆంటీ !అమెరికా అక్కను అడగలేకపోయారా?
అక్కడ అక్క అంకుల్ కి యేమి వండి పెట్టిందో?”
అదే ఏదో పెద్దక్లూ అన్నట్లు పోజుపెట్టింది..
“అదీ అయ్యింది. అన్నీ నీఫార్ములాలే మమ్మీ అనేసింది.”
“అలాగైతే స్వగృహ ఫుడ్స్ స్వరాజ్యం ఆంటీ మీ వంటలకు వస్తున్న పాప్యులారిటీ కి తట్టుకోలేక మీమీద కశీతో అంకుల్ నోటికి యే చేతబడో,పూతబడో చేయించి వుంటుంది. నాదీ గ్యారంటీ ఆంటీ.”
“అమ్మాయ్ వుండూరు !. ఇది విశ్వనాధుల వారి కాలం కాదు. నువ్వు రచయిత్రివికదా? రకరకాలుగా ఆలోచించు. నీ బుర్రకు పదును పెట్టు. పదును పెట్టమన్నానని ఆకురాయితో గీకేసుకోకు.”
అంటూ అంకుల్ అమెరికా నుండి వచ్చినప్పటి నుండి జరిగిపోయిన సంఘటనలని పూస గుచ్చేసింది కమలాoటీ.
వుండూరు తల్లి పూనకమొచ్చినట్లు వూగిపోయింది.
“ఆంటీ !యిక చూడండి మరి. గూగులమ్మని
గోకుతా .. మండే నక్కను తొక్కుతా .. మీ సమస్యను నేను పరిష్కరిస్తా. ముందు నా డిటెక్షను అంకుల్ తో ఆరంభిస్తా.”
ఆవేశమ్ అదుపు తప్పింది.
“ఆపనిమాత్రం చేయకు తల్లి !అంకుల్ అలిగి అమరావతి వెళ్ళిపోయి చైనా భాష నేర్చుకుని వస్తే .. నేను కొల్లేరో ?బుడమేరో పోయి కప్పల్ని,పాముల్ని పట్టుకురావాలి. అదినావల్ల కాదు గాని నువ్వు మల్లాది నడుగుతావో?మధుబాబు నడుగుతావో నీ యిస్టo. అంకుల్ వంకర తీయాలి.”
ఓకే ఆంటీ !ఆరుద్రనడుగుతా. కొమ్మూరిని కోరుతా. కొవ్వలిని చదువుతా . డిటెక్టివ్ బాలి నీ బాదుతా .. అసలు నేనే లేడీ డిటెక్టివ్ నవుతా.”
“నువ్వు యేమైనా అయిపో . అంకుల్ మిస్టరీకి
ఒక క్లూ యిచ్చావనుకో నీ కధల్ని, కవితల్ని,వంటా తంటల్ని నేనే పబ్లిష్ చేయించి కాలనీలో సన్మానం చేయిస్తా.”
ఆంటీ చెప్పిన మాటల్ని వింటూనే ధోనీ కొట్టిన హెలికాఫ్టర్ షాట్లా అంతెత్తుకు యెగిరిపోయింది. వుహాల్లో తేలిపోయింది.
నేలమీదకు వచ్చీన వుండూరును చూస్తూ
“ఇది మనయిద్దరి మధ్య జరిగిన ప్రత్యేక హోదా వంటి సీక్రెట్ విషయం. వెంకయ్య నాయుడిలా యెక్కడపడితే అక్కడ చెత్త స్టేట్మెంట్లు యివ్వకూ.”
హెచ్చరించింది కమలాoటీ.
“ముఝే మాలుం హై ఆంటీ !ఫికర్ మత్తాంటీ!”
“అదిసరే !మొన్న రామ్మూర్తి వాళ్ళ అబ్బాయితో యేమన్నావు?వాళ్ళావిడ వసంత వచ్చి నా బుర్ర తినేసింది.” “ఓఆ అంకులా?క్లాత్ హెడ్ అంకుల్. ఆరోజు సాయంత్రం మన కాలనీ పిల్లలు తమ అనుమానాల్నిఅడిగారు. సుకేశుడు అంటే అర్ధం యేమిటని. మంచి జుట్టు కలవాడు అనిచెప్పాను. హిప్పీ కటింగును యేమంటారు అనడిగితే దీర్ఘ కేశుడని చెప్పాను. మరి డిప్ప కటింగును అడిగితే కుంచిత కేశుడని చెప్పాను. చివరాఖరుకు జుట్టు లేకపోతేనో ?అడిగితే శూన్య కేసుడు అని చెప్పాను. అంతే.”
“అంతే అయితే బాగుండేది . అదే ఆయన కొంపతీసింది. పిల్లలకు నోరు తిరక్క శునకేసుడని పేరు పెట్టారట .”
మంచిగయ్యింది ఆంటీ . లేకపోతే నన్ను తిటిరత్రి {తిరుగు టపా రచయిత్రి } అంటాడా?టిట్ ఫర్ టేట్ .”
గంతులేసింది వుండూరు తల్లి.
******
ఈ సమావేశం తర్వాత నాలుగైదు రోజులు చాలా భారంగా గడిచిపోయాయి కమ్లాంటీకి.
ఉండూరు తల్లి జాడ కానరాక కాలనీ వాసులంతా కహానీలు చెప్పేసుకున్నారు.
ఉమాపతి మాత్రం పెళ్ళాం వూరెళితే సినిమా లా డిస్కో డేన్సులు చేసేశాడు. కాలనీ వాసులు కాస్తంత కర్ఫ్యు వాసల్ని కడిగేసుకుంటుంటే గాలిలేని వానలా, యెంతో హైపుకు వెళ్లి నేలను తాకిన సాహోలా హఠాత్తుగా ప్రత్యక్షమైపోయింది అల్లావుద్దీన్ జీనీలా.
తాయారు తల్లి ముఖంలో కనిపించిన వెలుగు చూసి కళ్ళల్లో కాకరపువ్వొత్తులు వెలిగించేసుకుంది కమలాoటీ. వదిల్తే దొరకదన్న లెవెల్లో మెయిన్ డోరు బందు చేసేసి బ్రూ కలిపేషింది కమలా ఆంటీ.
“సాధించాను ఆంటీ సాధించాను . థియరీ అయిపోయింది. మిగిలింది ప్రాక్టికల్. అదికూడా రేపు సాయంత్రం చూపిస్తా.”
పొంగిపోతు ఆంటీకి అభయహస్తం యిచ్చేసింది. రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు బీరాలు బీరుల్లా పంచిన బార్ గర్ల్ లా.
“ఆంటీ !యింటికెళ్ళి ప్రెషప్పై వస్తాను .”
అంటూ సస్పెన్సుతో చంపేస్తు సర్రు మంటూ దూసుకుపోయింది లేడి డిటెక్టివ్ మoగ తాయారు .
అర్ధ గంటలో అలంకరించుకొని అచ్చం డెటెక్టివ్ వేషంలో తలమీద టోపీ ,కళ్ళకు నల్ల కళ్ళజోడు ,మెడకింద వ్రేలాడే బైనాక్యులర్స్, చేతులకు గ్లోవ్స్ ,ఒక చేతిలో పెద్ద భూతద్దం,రెండో చేతిలో మూడు సెల్ల టార్చ్ తో వచ్చేసింది అచ్చం ఆడ పత్తేదారు లెవెల్లో.
ఆశ్చర్యంతో నోరు తెరిచేసిన ఆంటీకి ఖామోష్ అంటూ సైగ చేసి వరుసగా వున్న రూములన్నీ కలియ తిరిగేసింది క్లూల కోసం వెదికే డిటెక్టివ్లా వీర పోజుతో.
బాత్ రూములో షేవింగ్ చేసుకుంటున్న ధార్మారావు అంకుల్తో
“అంకుల్!ఈ రోజు మాయింట్లో చిన్న పేరంటం వుంది. ఆంటీ సాయంత్రం వరకు మాయింట్లోనే వుంటారు. మీకు లంచ్ తయారు చేసి ఆంటీ ఫ్రిజ్ లో పెట్టారు. ఈ ఒక్కరోజు మీరే మ్యానేజ్ చేసుకోవాలి. బై అంకుల్” అంటూ జoపై పోయింది మంగతాయారు.
అసలు విషయం యేమిటో అర్ధoగాక కమలా ఆంటీ బుర్రగోకేసుకుంటుంటే చిన్నగా కన్నుకొడుతూ ఆంటీని అయోమయంలో పడేస్తూ బరబరా లాక్కు పోతున్నoత ఎఫెక్ట్ క్రియేట్ చేసింది లేడి పత్తేదారు మంగ తాయారు.
*******
కమలా ఆంటీకి అతిభారంగాను ,డిటెక్టివ్ తల్లికి అతి తేలికగాను రోజు గడిచి చీకటి పడిపోయింది.
మసక మసక చీకట్లో మహిళా ద్వయం ఆ యింటి ముందు పిల్లుల్లా అడుగుపెట్టారు.
డూప్లికేటు కీ తో మెయిన్ డోరు ఓపెన్ చేసింది కమలా ఆంటీ.
రెడీగా వున్న ఓ నల్ల పిల్లి అమాంతం దూకేయడానికి యిది సినిమా కాదు కాబట్టి చాలా నిశ్శబ్దంగా చీకటిగా వుంది. ఆంటీ వణికే చేతులతో లైటు ఆన్ చేయ బోతుంటే ఆపేసి తన చేతిలో తయారుగా వున్న మూడు బ్యాటరీల టార్చి లైటు వెలిగించింది డిటెక్టివ్ తాయారు. .
ఇల్లంతా నిర్మానుష్యంగా దర్శన మిచ్చింది.
ఒక్కసారిగా బెడ్ రుములోనుండి యేసి శబ్దంతో బాటు వినిపించిన గురక శబ్దం వింటూ ఆంటీ పజిలై పోతే ,డిటెక్టివ్ మంగ ఆనందంతో అరిచేయబోతు అరచేయి అడ్డం
పెట్టుకుంటూ ఆపేసుకుంది.
మీకు దృశ్యం అర్ధం అయిపోయిందనే భావనతో ప్రసారాన్ని ఆపేయడంలేదు. పాపం పుణ్యం అంటూ నమ్మకాలు నాకు లేకపోయినా కధ మొదలుపెట్టి కంప్లీట్ చేయకపోవడం నాకు నచ్చే విషయం కాదు.
ఆ మూడు బేటరీల టార్చ్ వెలుగులో దర్శన మిచ్చిన దృశ్యాన్ని చూస్తూనే కదల లేని స్థితిలో ఫ్రీజైపోయిన చుండూరు కమలా ఆంటీ వుండూరు తల్లిని అదోలా అపనమ్మకంగా చూస్తే.. వుండూరు తల్లి మాత్రం తనను నిర్ధోషిగా ప్రకటించిన కోర్టు ఆర్డరు విని ... నాన్ దా పురచ్చి తలైవి అన్న లెవెల్లో ఫోజు పెట్టిన జయలలిత మాదిరి చూసింది శ్రీమతి వుండూరు టెర్రర్ ఆఫ్ నందనవనం కాలనీ.
అంకుల్ తినకుండా వదిలేసిన పాచిపోయినఅన్నం కూరలతో , చల్లబడిపోయి క్రిక్కిరిసిపోయి ఫ్రిజ్ లో వుండవలసిన బౌల్సన్ని ఆరుబయట ఖైదీల్లా డైనింగ్ టేబుల్ మీద దర్శనమిస్తే ఫ్రీజైపోవలసిన కమలా ఆంటీ షాకై పోయింది.
ఖాళీ గిన్నేల్ని క్లూకోసం పరీక్ష చేసే డిటెక్టివ్లా భూతద్దంలో పరీక్షగా చూస్తూ
“ఆంటీ మన ప్లాన్ థౌజెండ్ పర్సెంట్ సక్సెస్స్.”
అంటూ వెలిగిపోతున్న ముఖంతో ఐటెమ్ సాంగ్ అమ్మాయి పోజూపెట్టబోతున్న తాయార్ వుండూరును రెప్పవేయడం మర్చిపోయి చూస్తున్న కమలా చుండూరుకు దృశ్యం అర్ధమైపోయి
“అమ్మాయ్!నువ్విప్పుడు నాకళ్ళకు మాలతి సర్కార్ లా భాసిస్తున్నావు. అదేదో ప్లాన్ దేవరహస్యాన్ని నాకు కూడా చెప్పి పుణ్యం కట్టుకుంటే రేపటినుండి నీ కధలను కవితలను వంటా వార్పులను పబ్లిష్ చేయించే పనిలో పడిపోతాను. ప్లీజ్ ప్లీజ్!” అంటూ గడ్డం ,బుగ్గలు పట్టేసింది కమలా ఆంటీ.
“ఇదేమి దేవరహస్యం కాదాoటీ.
పోయినవారం మా ఆంటీ అంకుల్ అమెరికా నుండి వచ్చారు అoటే చిన్నక్లూ అయినా దొరుకుతుందని వెళ్ళాను. చాలా పెద్ద క్లూనే దొరికింది. మా ప్రమీలాంటీతో మాట్లాడుతుంటే
“ఏమి అమెరికానోరా ?మన దొడ్లు మనమే కడుక్కోవాలి. వారానికి సరిపడా వండేసుకుని ఫ్రిజ్ లో పెట్టేసుకుని ..ప్రతిరోజూ ఆవెన్లో వేడిచేసుకుని తినాలి. అమెరికాలో కెంటకీ చికెన్ KFC అనే వర్డుతోబాటు KFT వర్డ్ కూడా వీర ఫేమస్.” అనేసింది.
ఆంటీని బ్రతిమాలి KFT కి ఫుల్ ఫామ్ తెలుసుకున్నాను. అంతే లైట్లు వెలిగిపోయాయి.”
డెటెక్టివ్ మంగతాయారు అంటీని సస్పెన్స్ లోకి నెట్టేస్తూ సెలవాoటీ అనేయబోయింది.
మీకు కూడా వెలిగిపోయాయనే భావిస్తూ సెలవు తీసుకోవడం లేదు. కారణం రచయిత కర్తవ్యం మర్చిపోలేదు.
కె అంటే కిచన్.
ఎఫ్ అంటే ఫ్రీడ్జ్
టి అంటే టేబుల్
అని చెప్పింది . అంతే లైట్లు వెలిగిపోయాయి. అమెరికాలో చద్ది అన్నానికి, చద్ది కూరలకు అలవాటుపడిపోయిన అంకుల్ తాజాదనానికి తలక్రిందు లైపోయారు ఆంటీ. అంకుల్ గారికి జెట్ లాగ్ లాగా .. ఫుడ్ లాగ్ వచ్చేసింది. రేపటినుండి మీకు వేడన్నం,అంకుల్ గారికి చద్దన్నం . మీకు జీవితంలో అన్నం కూరలు మిగిలే సమస్యే రాదాంటీ.నాదీ గ్యారంటీ .”
ఠీవిగా చెప్పింది మాలతి చందూర్ .. తప్పు తప్పు మాలతీ సర్కార్.
తను అత్తమామలకోసం వండిన అన్నం కూరలు మిగిలిపోయి కంపు కొట్టే స్టేజిలో వుంటే అవి తీసుకొచ్చి మార్నిoగే అంకుల్ కోసం ఫ్రిజ్ లో పెట్టానన్న నగ్నసత్యాన్ని ఆంటీ యెప్పటికి గ్రహించే పరిస్థితి రాకూడదు అని కోరుకుంటు ...
అయ్యో అమెరికా !అయ్యయ్యో పాపం NRIలూ
అనుకుంటూ సెలవు తీసేసుకుంది లేడి డిటెక్టివ్ మంగ తాయారు. ******సమాప్తం ***.
{ఇది కామెడీ కోసం రాసిన కధ. మీకు నవ్వు వస్తే దాచుకో వద్దు ప్లీజ్ !}