ఈపాపం యెవ్వరిది ?
ఈపాపం యెవ్వరిది ?


ఈపాపం యెవ్వరిది?
డాడీ!అక్కహాస్పిటల్లో వుoది. మమ్మీ కూడా అక్కతోనే వుంది. నేను ఒక్కదాన్నే యింట్లో వున్నాను.
త్వరగా రండి. ప్లీజ్ ! తల్లి !నేను పనిలో వున్నాను. వచ్చేస్తాను . భయపడకు. అసలు అక్క హాస్పిటల్లో యెందుకు వుంది?యింతకు యేమయ్యింది?
ఆతృతగా అడిగాడు అశోక్ రావు కూతుర్ని .డాడీ !అక్క ఆత్మహత్య చేసుకోబోయింది. మమ్మీ గమనించి అపోలోలో జాయిన్ చేసింది.
అక్క ఆత్మహత్య చేసుకో బోయిందా ?నాకెందుకు కాల్ చేయలేదు?
మీ ఫోను స్వీచ్చ్ద్ ఆఫ్ వచ్చిoది . మమ్మీ భయపడిపోయి ఆటోలో వెళ్లిపోయింది.
మమ్మీకి ఫోన్ చేసి అక్కకు యేలావుందో తెలుసుకో?అంటే మీరు రారా? ఇక్కడ గందర గోళం లావుంది. బయటకు రావాలంటే స్టూడెంట్స్ పేరెంట్స్ చుట్టుముట్టి ధర్నాలు చేస్తున్నారు. నన్ను బయట చూశారంటే చంపేసేలా వున్నారు. ఎలాగో దారి చేసుకొని వచ్చేస్తాను.
నేను టీవీలో చూశాను. పదిహేడు మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెపుతున్నారు.
అక్కకూడా చనిపోతుందేమో డాడీ!
ఏడ్చేసింది అనన్య అశోక్ రావు రెండో కూతురు.
తల్లి !యేడవకురా .. నేను వస్తున్నాను. ఇద్దరం హాస్పిటల్ కు వెళ్దాము.
త్వరగా రండి డాడీ ! మమ్మీ ఫోను యoగేజ్ వస్తోంది.
తల్లి !నువ్వు తయారుగా వుండు . నేను టేక్సీలో వచ్చేస్తాను.
తన సెల్ ఫోన్ లో వస్తున్న నెంబర్ చూసుకుంటూ లెండ్ ఫోన్ రిసీవర్ క్రెడిల్ చేసింది అనన్య .
*******
ఫిల్మునగర్ అపోలో హాస్పిటల్ .
అలజడిగా వచ్చిన అశోక్ రావు ,యేడుపు ముఖంతో వచ్చిన అనన్య రిసెప్షన్ ముందు ఆగి
వివరాలు తెలుసుకొని ఇంటెన్సివ్ కేర్ వార్డ్ లోకి వచ్చారు. అప్పటికే రూముముందు యేడుస్తూ కూర్చున్న
భార్య విశాలను చూస్తూ
విశాలా !మన శ్రీవిద్యకు యేమయ్యింది?యెలావుంది?
భార్య చేతులుపట్టుకుని గద్గద స్వరంతో అడిగాడు అశోక్ రావు.
ఎవరూ యేమీ చెప్పడం లేదు. శ్రీ ఆత్మహత్యకు ప్రయత్నించింది. బాత్ రూంలోని టాయిలేట్ క్లీనర్
లిక్విడ్ తాగేసింది. ఎంతకూ బయటికి రాకపోతే తలుపులు విరగకొట్టించి చూశాను. అప్పటికే
స్పృహ తప్పి వుంది. భయపడి ఆటోలో వచ్చి యిక్కడ జాయిన్ చేశాను. మీకోసం యెంత ట్రై చేసినా మీ ఫోను
దొరకలేదు.
ఏడ్చేసింది విశాల.
మన శ్రీకి యేమికాదు వూరుకో . నేను డాక్టర్ తో మాట్లాడుతాను.
అప్పుడే బయటకు వస్తున్న డాక్టర్ ను విష్ చేసి
డాక్టర్ గారు నాపేరు అశోక్ రావు . ఇంటర్ బోర్డ్ ...
ఐసీ !మీపేరు టీవీల్లో మారుమోగిపోతోంది . శ్రీవిద్య మీ అమ్మాయా?
డాక్టర్ అదోలా చూస్తూ అడిగాడు.
అవును డాక్టర్ గారు !తనకీ యెలావుంది?ప్రమాదం లేదుగా?
బేలగా అడిగాడు.
ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. బాత్ రూంలో క్లీనింగ్ లిక్విడ్ సగమే వుండడం మీ అదృష్టం. మీరు ఒక అరగంట
తర్వాత చూడవచ్చు. అమ్మాయి దగ్గర ఈ సూయిసైడ్ నోటు దొరికింది. నిజానికి మేము పోలీసులకి హేండ్ ఓవర్
చెయ్యాలి. అమ్మాయికి పెద్ద ప్రమాదం సంభవించలేదు కాబట్టి మీకు యిస్తున్నాను.
లెటర్ చేతిలో పెట్టి అశోక్ వంక అసహ్యంగా చూస్తూ తన ఛేంబర్లోకి వెళ్లిపోయాడు డాక్టర్ .
********
వణుకుతున్న చేతులతో లెటర్ ఓపెన్ చేశాడు అశోక్ రావు.
నాన్న !యిలా అనడానేకే అసహ్యంగా వుంది. అయినా తప్పదు. కారణం ఈపాపిస్టీ
జన్మకు కారకులు మీరే కాబట్టి.
సాయంత్రంన టీవీ చూసి నాక్లోజ్ ఫ్రెండ్ మాకాలేజీ టాపర్ సువర్చల ఆత్మహత్య గురించి విని
తనను ఆకరిసారిగా చూసి వద్దామని తన యింటికి వెళ్ళాను. ఫేనుకు చున్నితో వురేసుకుంది.
తనని ఆస్థితిలో చూడాలంటేనే భయం వేసింది. ఏడుపును కంట్రోల్ చేసుకోలేక పోయాను. అప్పటికే
సువర్చల తల్లి స్పృహకోల్పోయి దీనంగా పడివుంది. తండ్రి ఆమెకు సపర్యలు చేస్తూ కుమిలిపోతున్నారు .
వాళ్ళది చాలా పేద కుటుంబము.వారికి టీవీ లేదు . కనీసము ఒక సెల్ ఫోను కూడా లేదు. తన ధ్యాస ,ధ్యానం
చదువు మాత్రమే. ఫస్ట్ యియర్లో కాలేజీ టాపర్. ఈయియర్లో స్టేట్ ఫస్ట్ వస్తుందని లెక్చరర్లు కూడా భావించారు.
అటువంటి సువర్చల సెకండ్ యియర్లో తప్పింది? కాదు తప్పించారు . చంపేశారు.
సువర్చలను చూడడానికి వచ్చిన నా క్లాస్ మేట్స్ నన్ను యెలా ట్రీట్ చేశారో చెపితే మీరు చచ్చిపోతారు.
ఏయ్!రాక్షసి !మీ నాన్న మనిషా పసువా?పదిహేడు మంది ప్రాణాలను తీసిన హంతకుడు వాడు.
వాడు మాకు కనిపిస్తే కొరికి చంపేస్తాము. అటువంటి పంది కి నువ్వు యెలా పుట్టావే?
మానాన్న ఐయేయెస్ అని చెప్పేదానివి. అప్పుడు తప్పుగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనుకునే వాళ్ళo.
అది ఇండియన్ అసమర్ధుల సర్వీస్ అని యిప్పుడు అర్ధం అయ్యింది. వాడే గనుక మా ఫాదర్ అయ్యుంటే
పీకపిసికో ,కత్తిపీటతో నరికో చంపేసే వాళ్ళం. నీకు సిగ్గు లజ్జ చీము నెత్తురు వుంటే కనీసం నీ యెడమకాలి
చెప్పుతో కొట్టి శ్రీవిద్యా అనిపించుకో. అసలు నిన్ను పుట్టించింది ఆపశువో కాదో మీ అమ్మని అడిగి తెలుసుకో.
వాడు దొరికితే గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టి గాడిద మీద సారి పందిమీద యెక్కించి మునిసిపాలిటీ మురుగు
కాల్వలో సన్మానం చేస్తాము.
ఇoకా యెన్నెన్ని మాటలు అన్నారో ?నేను ఆక్కడే చచ్చిపోక ఇంటికి వచ్చి ఆత్మహత్యకు యెందుకు
పాల్పడుతున్నానో నాకే అర్ధం కావడం లేదు.
నిజమే వాళ్ళు అన్నమాటల్లో యేదీ అబద్దం కాదు.
మీరు చదివింది ?I.A.S. దాని అర్ధం కూడా తెలియని వెధవల దగ్గర మీరు పనిచేస్తున్నారు.
మొన్నటి శ్రీలక్ష్మి I.A.S పరిస్థితి మీకేకాదు రెండు రాస్ట్రాల ప్రజలకు తెలుసు. తెలిసి కూడా తిరిగి అదే
తప్పు చేస్తున్నారు. రాజకీయనాయకుల జీవితం ఐదేళ్లు వుంటే గగనం. అటువంటి అల్పాయుష్కుల దగ్గర ముప్పై సంవత్సరాల
సర్వీసులున్న మీరు యెందుకు బానిసలుగా బ్రతుకు తున్నారు? కక్కిన కూడు వంటి లంచాలకోసమా?
లేబర్కి లేబర్ రూముకి తేడా తెలియని వాడు ముఖ్యమంత్రి.
వందేమాతరం ,జనగనమన తెలియని వాడు విద్యా శాఖ మంత్రి. కనీసం ఒక్క మంత్రిని పాఠశాలల్లో మేము
రోజూ చెప్పే ప్రతిజ్ఞ చెప్పమనండి. ఇటువంటి నిరక్షరాశ్యుల దగ్గర జీహుజూర్ అనే బానిస బ్రతుకులు.
అవసరమా?చెప్పండి. ?
ఇక పాఠశాలల్లో చదువులు చెప్పే యెంతోమంది టీచర్లు... విద్యార్ధి ,స్వాతంత్రo, బాధ , భర్త,వంటి పదాలు కూడా సరిగా పలకలేని
పండిత పుత్రులు.
మీ విద్యాధికారుల్ని సైకియాట్రిస్ట్ ,చెకోస్లవేకియా స్పెల్లింగ్స్ చెప్పమనండి. ఇటువంటి రాస్కెల్స్ పిల్లల
ప్రాణాలు తీయడానికి తప్ప దేనికి పనికిరారు. అవునా ?కాదా?
వైజాగ్ దగ్గర బే ఆఫ్ బెంగాల్ వుంది అంటే మనం కూడా హైదరాబాద్లో ఒకటి పెట్టుకుందాము అనే బుద్ధిలేని
వెధవ మనకు మంత్రి. పదిహేడు మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే సానుభూతి కూడా చూపకుండా
పరీక్ష సరిగా రాయకపోతే తప్పుతారు. అటువంటి వారు ఆత్మహత్యలు చేసుకుంటారు అని స్టేట్మెంట్ యిచ్చిన
వాడిని వురితీయాలా?పబ్లిక్ లో రాళ్ళతో కొట్టి చంపాలో మీరే చెప్పండి?
అంత పెద్ద చదువులు చదివారు. కనీస జ్ఞానం కరువై నట్లు మరీ బానిసలుగా మనుగడ సాగించడం అవసరమా?
పాసయిన ఆనందంలో ఫేస్ బుక్ చూస్తుంటే ఒక కొటేషన్ కనిపించింది. అది మీలాంటి వారికి సరిగా సరిపోతుందని
యిప్పుడు అర్ధం అయ్యింది. కనీసం మీరు భవిష్యత్తులో ఆలోచిస్తారని నాలెటర్లో రాస్తున్నాను.
ఒక బియ్యపుగింజ మరిగే పాలలో చేరితే పాయశమవుతుంది..
అదే బియ్యపు గింజ యెసరుతో కలిస్తే అన్నం అవుతుంది ..
అదే బియ్యపు గింజ పసుపుతో కలిస్తే దీవించే అక్షత అవుతుoది ...
అదే బియ్యపు గింజ బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది...
మీవి బానిస బ్రతుకులు. రాజకీయ బొగ్గుతో కలిసిన చేతకానీ బడుద్దాయిబ్రతుకులు . ...
ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండీ. కిరాణా షాపునుండి వచ్చిన సరుకులు ధరలు ఒక సామాన్య గృహిణి రెండు మూడు
సార్లు పరిశీలించు కుంటుంది. ఘనత వహించిన లెక్చరర్లు , పరిశీలకులు కనీసం ఒక గృహిణి చేయగలిగిన పనికూడా చేయలేక
పదిహేడు మంది పిల్లల్ని పొట్టన బెట్టుకున్నారు. మిమ్మల్ని యేమని పిలవాలో అర్ధం కావడంలేదు.
పశువులు అoదామంటే అవి మీకంటే వుపయోగకరమయినవి . గడ్డితిని పాలు యిస్తాయి.
పోనీ పందులు అందామంటే అవి అశుద్ధం తిని పరిసరాలను బాగుచేస్తాయి.
మరి మీరో లంచాలు తిని పిల్లలతో బాటు సమాజాన్ని చంపేస్తున్నారు.
అమ్మ అనేది .. మీనాన్న ఒకే పోస్ట్ లో నాలుగు యేళ్ళు వున్నారు. యెంత సమర్ధులు కాకపోతే యేలా సాధ్యం
అయ్యేది అని.
కానీ అమ్మ తప్పు చెప్పింది. మీ నాన్న ఎందరి కాళ్ళు పట్టుకోవడంలో సమర్ధులో తెలుసా?అందుకే నాలుగు యేళ్ళు ఒకే చోట పాతుకుపోయారు అని చెప్పాలి.
ఆలోచిస్తుంటే మీదికూడా ఒక బ్రతుకేనా అనిపిస్తోంది.తొలుత బియ్యం గింజవంటి మీలాంటి యెడ్యూకేటెడ్ యేందరో బొగ్గువంటి రాజకీయ నాయకుల కాళ్ళకింద నలిగి పోయినలుపైపోయి చేతబడుల వంటి చావులకు కారణమవుతున్నారు. మొత్తం వ్యవస్థను మీరు మార్చలేరు. కనీసం మీరు
మారవచ్చు. ముందు మీ రాజీనామా లెటర్ని నా శవం ముందు వుంచి నన్ను ముట్టుకోండి. లేదంటే నేను మీకు పుట్టని
కూతురిని అవుతాను. మనం పుడితే తల్లి సంతోష పడాలి సవ్యంగా పెరిగితే తండ్రి ఆనంద పడాలి ఆదర్శoగా బ్రతికితే సమాజం సంబరపడాల చస్తే స్మశానం కన్నీరు పెట్టాలీ జీవితం అంటే అది. పదిహేడు మండి విద్యార్ధుల చావుకు కారణ మైన మీ బ్రతుకుకు అర్ధం యేమిటో చెప్ప గలరా? రేపో మాపో చెల్లి వంటి యెంతోమంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలు రాస్తారు మీ వంటి అసమర్ధుల చేతిలో చచ్చిపోతారు.అది జరగ
కూడదు.
సెలవ్ !
*******
కూతురు రాసిన లెటర్ని చదివి కన్నీరు మున్నీరయి పోయాడు అప్పటికే సగం చచ్చిన అశోక్ రావు.
తన ఛాంబర్ నుండి వస్తున్న డాక్టర్ చూసిన అసహ్యకరమైన చూపు శూలo పోటులా అనిపిస్తే
కూతురి దృష్టిలో అప్పటికే చచ్చిపోయిన అశోక్ రావు రెసెప్షన్ ముందుకు నడిచాడు తన రాజీనామా పత్రాన్ని రాయడం కోసం
కావలసిన తెల్ల కాగితం కోసం.
********సమాప్తం ***************