కరోనా తిప్పలు
కరోనా తిప్పలు
ప్రియమైన
పద్మా!
ఈ కుశలాలు అవీ తరువాత ముందు ఈ కరోనా తెచ్చిన కష్టాన్ని నీతో షేర్ చేసుకుంటే... గుండె భారం కాస్త దిగుతుందని రాస్తున్నాను.
అసలు సమస్యంతా...మా అత్తగారి స్మార్ట్ ఫోన్ తో వచ్చిందే. కరోనా భయంతో ఇంటిల్లిపాదికీ రోగనిరోధకశక్తి పెంచేయాలని కంకణం కట్టేసుకున్నది మా అత్తగారు.
చీటికీమాటికి ఫేస్బుక్, వాట్సాప్ చూడను... కనిపించే ప్రతీది మామీద ప్రయోగించెయ్యను. మొన్నటికి మొన్న ఆవుపేడతో అపార్ట్మెంట్ గోడలనిండా పిడకలు. మేనేజ్మెంట్ గోల చేస్తే ఆ గోడల రంగుకు ఐదువేలు వదిలాయి. ఇంతకీ ఆ పిడకలగోల ఎందుకో తెలుసా?... వాటి పొగ పీల్చితే కరోనా దగ్గరకు కూడా రాదని ఎవడో ధూప్ బాబా సందేశం. ఇహ ఆ ఎండిన పిడకల్ని స్టౌ మీద మండించి వచ్చే పొగ' పీల్చండి... బాగా పీల్చండి' అని ప్రాణాలు తోడేస్తున్నారనుకో! నేను పిల్లలు ఎలాగో తప్పించుకున్నా...మావారు, మామగార్లకు తప్పదుగా... పాపం. అసలే మామగారు కృష్ణవర్ణపు ఛాయేమో...పొగ పీల్చి పీల్చి మరింతమెరుపు సంతరించుకుని రాత్రైతే మాట తప్ప మనిషి కనిపించడంలేదు.
ఈ పిడకల గోల సద్దుమణిగిందని సంతోషించే లోపు ఇరవై నిమిషాల కొకసారి అలారం పెట్టుకొని మరీ మా చేతులు రుద్దించేస్తున్నారు. "గుమ్మం దాటి బయటకు వెళ్ళడం లేదు...వదిలేయవే బామ్మా"! అని పిల్లలు మొత్తుకున్నా... వినడంలేదు.మా చిన్నవాడు మరీ సున్నితం కదా... చేతులు పొక్కిపోయి పొలుసులు రాలిపోతుంటే ఆన్లైన్ లో డాక్టర్ కు'సహస్రం' చదివించాము. మరోమాట మా అపార్ట్మెంట్ పక్కన మెడికల్ షాపతను ఈమధ్యనే కొత్త ఫ్లాట్ కూడా కొన్నాడని తెలిసింది.
'మూగవాడి ముందు ముక్కు గోక్కోవడం ప్రమాదం' చందాన ఎక్కడ చదివారో మరి...ఆడబడుచు చేత ఇంట్లో అందరికీ...పనిమనిషితో సహా పి.పి.ఈ.కిట్లు, మాస్క్ లు ఆర్డర్ చేసి తెప్పించారు.'ఇదెక్కడి గోలమ్మా! ఇలాగైతే నాను ఒగ్గీస్తా' అని బెదిరింపు.చాటుగా ఇంకో ఐదొందలు ఎక్కువిస్తానని కాళ్ళావేళ్ళా పడితే అది ఆ 'కిట్ తొడుక్కోడానికొప్పుకుంది. ఆ కిట్లు తొడుక్కుని ఇంట్లో తిరుగుతుంటే... మామగారెవరో...మా వారెవరో...ఎవరిని ఏమని పిలవాలో...కర్మ!
ఆఖరుకు బిగ్ బాస్కెట్, అమెజాన్ కొరియర్ వాళ్ళని కూడా వదలడం లేదు.తెచ్చిన ఐటమ్స్ అన్నీ వాళ్ళతోనే శానిటైజ్ చేయిస్తున్నారు. "మాకింక పనుల్లేవా?"అంటూ వాళ్ళు ఆవిడ మీద ఎగరడం..ఏవందో ,రెండొందలో ఆశ చూపి పనులు చేయించడం... ఈనెల చివరన లెక్క చూస్తే ఆవిడ చూపించిన'ఆశల మొత్తం' ఇరవైవేలు . నాకిప్పుడు అర్ధమౌతోంది...మా నాన్న అప్పగింతల్లో ఎందుకు కళ్ళనీళ్ళు పెట్టారో...ఈ 'వానరసోదరి' లాంటి మనిషితో మాఅమ్మాయి ఎలా వేగుతుందో?అని భయమేసినట్లుంది.
ఇదంతా ఓ ఎత్తైతే... ఫేస్బుక్ లో వచ్చిన ప్రతి సలహా పాటించి కషాయాలు... కాకరకాయలు తయారుచేసి మాచేత త్రాగించడం... ఆన్లైన్ డాక్టర్ గారికి 'సహస్రాలు'చదివించడం...ఇదీ వరస.
మీ అమ్మగారి నిర్వాకాలు తట్టుకోలేకపోతున్నామని...మాగోడు ఈయనకు చెప్పినా..ఆ గోడకు చెప్పినా ఒకటే! ఇహ అత్తగారు 'మాటతప్పని ,మడమతిప్పని మనిషై'తే... పాపం మామగారు 'ఎదురు చెప్పని మనిషి'... ఈయనకు చెప్పినా ప్రయోజనం లేదు. ఎక్కడికీ పారిపోలేని దుస్థితి.ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మిమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఏదైనా సలహా చెబుతావని ఆశిస్తూ...
నీ స్నేహితురాలు,
లత.
