katyayini boorle

Tragedy

5.0  

katyayini boorle

Tragedy

ఈ పాపం ఎవరిది?

ఈ పాపం ఎవరిది?

2 mins
510



అమ్మా! అమ్మా!

నిద్రలేస్తూనే అమ్మని పిలుస్తున్నాడు ఎనిమిదేళ్ల చింటూ. బయటకొచ్చి చూస్తే చాపమీద అమ్మ పడుకుంది. తల దగ్గర చిన్న దీపం కూడా పెట్టారు. చింటూకి ఏమి అర్థం కాలేదు. అమ్మా... అంటూ దగ్గరకెళ్లి కదిపాడు. అమ్మ పలకలేదు, కళ్ళు తెరిచి చూడలేదు. చాలాసేపు అమ్మా...అని పిలుస్తూ ఎంతసేపటికి అమ్మ లేవకపోయే సరికి నిస్సహాయంగా అక్కడున్న వారివైపు చూసాడు. ఆచూపు వేయి గునపాలు గుచ్చినంత బాధ కలిగించింది అందరికీ.


రాత్రి నిద్రలోవున్నప్పుడు అమ్మా నాన్న గట్టిగా మాట్లాడుకోవడం, నాన్న అమ్మను కొట్టడం వరకే ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తున్న చింటూకి గుర్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియదు.


నిద్ర లేచేసరికి అమ్మ ఇలా!

అక్కడున్న వాళ్లందరినీ చూస్తూ బామ్మ దగ్గరికి వెళ్లి "అమ్మ లేవదేంటి బామ్మా" అంటూ అడిగాడు. ఆవిడ మొహం తిప్పుకుంది.

అక్కడే ఉన్న అమ్మమ్మ గబుక్కున చింటూని అక్కున చేర్చుకొని, కళ్ళనీళ్ళు తుడుచుకుని" అమ్మ దేవుడు దగ్గరికి వెళ్ళింది నాన్నా! అందుకే మాట్లాడటం లేద"ని చెప్పింది.

చింటూ మెదడులో వేల ప్రశ్నలు. ట్రైన్ లోనూ బస్సులోనో కదా ఎక్కడికైనా వెళ్ళేది. ఇలా పడుకుంటే ఎలా వెళ్తారు? వాడి చిన్ని బుర్రకు అర్థం కాలేదు.

ఇలా పడుకుంటే దేవుడి దగ్గరికి వెళ్లినట్లా? మళ్ళీఅమ్మ ఎప్పుడు వస్తుంది?ఎందుకు నాతో మాట్లాడటం లేదు? అమ్మ లే!లే అమ్మా! అని అమ్మను కదుపుతూ ఏడుపు మొదలు పెట్టాడు.

అది చూసి అక్కడున్న వారందరి హృదయాలు బాధతో, దుఖంతో బరువెక్కిపోయి కళ్ళు చెమ్మగిల్లాయి. వాడి చిన్ని మనసుకు వాళ్ళ అమ్మ ఇంక లేవదు, మాట్లాడదు,వాడితో ఇదివరకులా ఆడుకోదు అన్న నిజం అర్థమయ్యేటట్లు ఎలా చెప్పాలో ఎవరికీ పాలుపోవడం లేదు.

రాత్రి జరిగిన గొడవలో ఆవేశంతో తనతండ్రి వలన జరిగిన పొరపాటుకి తలకు దెబ్బ తగిలి తల్లి మరణించిందన్న నిజం చింటూకి అర్థం కాలేదు.

అమ్మ ఎందుకు లేవడం లేదు?అన్న చింటూ ప్రశ్నకు ఎవరు బదులు చెబుతారు?

అర్థం లేని చిన్నచిన్న విషయాలను పెద్ద తప్పులుగా ఎత్తి చూపి భార్యాభర్తల మధ్య అపార్ధాలు,గొడవలు సృష్టించిన నాయనమ్మ తాతయ్యలు చెబుతారా?

ఆవేశంలో ముందు వెనుకలాలోచించకుండా భార్య పై చేయి చేసుకున్న చింటూ తండ్రి చెబుతాడా?

నాన్నా! అమ్మ కావాలి! అని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ తండ్రి దగ్గరకు వెళ్లాడు చింటూ. వాడిని ఎలా సముదాయించాలో అర్థం కాలేదు అతనికి. చేసిన పొరపాటుకి లోలోనే పశ్చాత్తాపపడుతున్నాడు అతను. ఒక్క క్షణం ఆవేశాన్ని అదుపులో పెట్టుకోకపోవడం వల్ల జరిగిన అనర్థానికి ఆ 'పసిహృదయం' ఎంతగా తల్లడిల్లుతోంది చూసిన అతను కూడా చింటూని గుండెలకు హత్తుకొని వెక్కివెక్కి ఏడవసాగాడు.

ఆ దృశ్యం చూసిన వాళ్ళందరి కళ్ళు నీలిమేఘాలు అయ్యాయి. ఆ తండ్రి కొడుకులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

ఏదిఏమైనా నిజం నిప్పులాంటిది. ఇవాళ కాకపోతే రేపైనా పరోక్షంగా చింటూకి అన్యాయం చేసిన వాళ్లకి తాము చేసిన పొరపాటుకు భగవంతుడు ఏమిశిక్ష విధిస్తాడో అన్న చింత కలుగకమానదు. అది తమను ఏ విధంగా దహించివేస్తుంది అన్న భయం కలుగక పోదు.


Rate this content
Log in

Similar telugu story from Tragedy