katyayini boorle

Others

4.2  

katyayini boorle

Others

తొలగిన తెరలు

తొలగిన తెరలు

6 mins
867



అత్తయ్యకి ఏం సమాధానం ఏం చెప్పమంటావు ? నిన్ను బావకి చేసుకోవాలని అత్తయ్య ఆరాటపడుతోంది... అన్నది సుజాత...కూతురు సుమలత తో!


వాళ్లు ఆశపడితే సరిపోయిందా! నాకూ ఇష్టం వుండాలిగా...


అదే...! మరి ఇష్టం అవునో కాదో చెప్పేస్తే... వాళ్లూ శాంతి పడతారు కదా!


'నాకు ఇష్టం లేదు'... అన్నది ముభావంగా.


ఏం? ఎందుకని? మనం ఈరోజు ఇలా వున్నామంటే వాళ్ళ చలవే! చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న నిన్ను చదివించటం నా ఒక్కదాని వల్ల అయ్యే పనేనా ! అత్తయ్య కుటుంబం అండగావుండబట్టే కదా...!


అమ్మా!! ఇంక చాలు ఆపేయ్... అన్నది అరుస్తూ! వాళ్లు సాయం చేశారు... వీళ్లు ఆదుకున్నారు... అంటూ మొదలు పెట్టకు...నేను వినలేను. రాత్రికి బయలుదేరి హైదరాబాద్ వెళుతున్నాను. రేపు డ్యూటీ లో జాయిన్ అవ్వాలి. తొందరగా అన్నం పెట్టు ఇంకా సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను వెళ్ళాక వాళ్లకు చెప్పు- "బావను చేసుకోవడం ఇష్టం లేదని".


చెప్పక ఛస్తానా! ఎప్పటికైనా నీ మీద ఆధారపడి బ్రతికే రోజు వస్తుందనో ...కడుపుతీపి వల్లో...నీ మాటలకు విలువిచ్చి పెంచినందుకు నాకు మంచి మర్యాద చేసావ్!


అమ్మా!! ఇంక చాలు... అన్నం పెట్టు త్వరగా... అన్నది కోపంగా.

            ▪️▪️▪️▪️▪️

గుమ్మంలో కారు ఆగిన చప్పుడు విని గబగబా వచ్చి చూసింది సుజాత .

ముందు సుమలత, ఆ వెనకాల ఇంకో యువకుడు కారు దిగి నిలబడ్డారు. లత మెడలో మంగళ సూత్రం. కాలి మెట్టెలు చూసి నిశ్చేష్టురాలైంది.


పక్క వాటా లోనే ఉంటున్న మేనత్త పద్మ గబగబా వచ్చి ఎర్ర నీళ్లు దిష్టి తీసి... హారతిచ్చి వారిద్దర్నీ ఇంట్లోకి తీసుకువెళ్ళింది. కూతురు నిర్వాకానికి

ఆడపడుచు ముందు తలెత్తుకోలేక దోషిలా నిలబడి చూస్తూ వున్న సుజాత తో... "ఇప్పుడు ఏం జరిగింది వదినా...దాని మనసు మనం తెలుసుకోలేదు. దా...వచ్చి పిల్లల్ని ఆశీర్వదించు" అన్నది.

నన్ను క్షమించు...అన్నది రెండు చేతులెత్తి పద్మకి దణ్ణం పెడుతూ...!

ఊరుకో...వదినా!అన్నది పద్మ ఆర్ద్రత నిండిన కళ్ళతో!


కాలం గడిచి పోతున్నది. ఋతువులు మారుతున్నాయి. సుమలత బావ మాధవ్ కు కూడా వాసంతి అనే గుణవంతురాలితో పెళ్లి జరిగింది. చిలకా గోరింకల్లా ముచ్చటైన జంట.సుమలత భర్త రాజేష్ తో సహా పెళ్లికి వచ్చింది.


రెండేళ్ళలో లతకు ఒకబాబు, మాధవ్ కు ఇద్దరు కవల పాపలు.పిల్లల ఆటపాటలతో... సుమలత రాకపోకలతో రెండు కుటుంబాల వాళ్ళు గతాన్ని మరచి సంతోషంగా గడుపుతున్నారు.    

             ▪️▪️▪️▪️▪️▪️▪️

ఉన్నట్టుండి ఒకరోజు హఠాత్తుగా చంకలో బిడ్డతో వచ్చిన సుమలతను చూసి...రామ్మా! రా!!ఒక్కదానివే వచ్చావా! అల్లుడుగారేరి? అన్నది సుజాత గుమ్మం వైపు చూసి.


ఏం? అతను వస్తేనే రావాలా !నేను ఒక్కదాన్నే రాకూడదా? ఎదురు ప్రశ్న వేసింది సుమలత.

అలాగని కాదు... ఎప్పుడు వచ్చినా ఇద్దరూ వస్తారుగ... ఈసారి ఒక్కదానివే వచ్చావే... అతనికి సెలవు దొరకలేదా ?అని అంటూనే ...కూతురు ఇంటికి వచ్చిన 'తీరు'కి ఇద్దరి మధ్య ఏం గొడవలు జరిగాయో ఏమో అనుకుంటూ... లోలోన మధన పడుతున్నది తల్లి .


వచ్చిన దగ్గర నుండి ఏం మాట్లాడకుండా మౌనంగా వుంటున్న కూతుర్ని కదిలించాలంటే భయం. అయినా ధైర్యం చేసి అడిగేసరికి ...అతను తెగతెంపులు చేసుకుని ...తనని బాబుని వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు... అంటూ చెప్పింది నిర్లక్ష్యంగా.


ఇంత పెద్ద విషయాన్ని ఏదో మామూలు విషయం అన్నట్లుగా చెబుతున్న కూతురు ధోరణికి ఏం చేయాలో పాలుపోలేదు సుజాతకి.

మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ?

ఏముంది చేయడానికి ...నేను ఇక్కడ ఉద్యోగం చూసుకున్నాను. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. పిల్లవాడిని కొన్నాళ్ళు నువ్వు చూసుకుంటే చాలు... అన్నది స్థిరంగా .

గట్టిగా మాట్లాడితే ఏ అఘాయిత్యానికి దారితీస్తుందో అని కూతురి మనస్తత్వం తెలిసిన తల్లి మరింకేం మాట్లాడలేదు.


సుమలత రోజూ ఉద్యోగానికి వెళ్లి వస్తున్నది.


బాబు మాధవ్ పిల్లలతో పాటు ఆడుకుంటూ మాధవ్ కు బాగా చేరిక అయ్యాడు. భార్య పిల్లలంటే మాధవ్ కు వున్న ప్రేమ, కుటుంబం పట్ల అతనికి ఉన్న శ్రద్ధ దగ్గర్నుండి గమనించ సాగింది సుమలత . ముఖ్యంగా... భార్యంటే వున్న అనురాగం... ఒంటరితనంతో కాపురం చేసే సుమలత మనసులో ఎక్కడో అసూయ కలిగిస్తున్నది.


తల్లి మాట విని బావను పెళ్లి చేసుకుని వుంటే ఈరోజు ఆమె స్థానంలో నేను ఉండే దాన్ని కదా... అని పదే పదే ఆలోచించసాగింది . రోజురోజుకు వాసంతి పై ద్వేషం పెంచుకుంటున్నది. ఏదో ఒకటి చేసి ఆమె స్థానాన్ని తాను దక్కించుకోవాలన్న దుర్బుద్ధి కలిగిందే తడవుగా మాధవ్ కు దగ్గరవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.


స్కూటీ పాడైందన్న వంకతో రోజూ...సుమలత ను ఆఫీసు దగ్గర దింపి మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకురావడం మాధవ్ కి 'దినచర్య' అయింది.


ఒక రోజు కాఫీ తాగుదాం ...రా !బావా !అంటూ రెస్టారెంట్ కు తీసుకువెళ్ళింది. బావా...నీకు వారసుడు లేడు కాబట్టి నా బిడ్డను కనుక మీరు దత్తత తీసుకుంటే... నేను నా భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటాను. ఈ విషయం ముందు నీకే చెబుతున్నాను. నీకు ఇష్టమైతే ఇంట్లో వాళ్లకు చెబుదాం... అన్నది . కష్టంలో వున్న మరదలికి సాయం చేస్తున్నానన్న మనసుతో... పైగా గతంలో ఆమెను ఇష్టపడ్డ కారణం వల్లనో... ముందువెనుకలు ఆలోచించకుండా 'సరే'నన్నాడు మాధవ్.


ఇదే విషయం ఇంట్లో వాళ్లతో చెప్పాడు. వాసంతికి పద్మకు బాబును దత్తత తీసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. దీనికి వాళ్లు ససేమిరా ఒప్పుకోలేదు. దాని బిడ్డను చేరదీసి నీ పిల్లలకు అన్యాయం చేయకంటూ...గట్టిగా వారించారు.


జరిగింది సుమలత తో చెప్పాడు మాధవ్. పోనీలే బావా...ఏదో సాయం చేస్తావు అనుకున్నాను...మీ వాళ్లను ఒప్పించలేకపోయావు. అయినా వాళ్లంత గట్టిగా పట్టుబడితే నువ్వు మాత్రం ఏం చేయగలవు? అంటూ...అతని చేతగానితనాన్ని రెచ్చగొట్టసాగింది. నాకు మాత్రం మీరు తప్ప ఎవరు ఉన్నారు? అంటూ కన్నీరు పెట్టుకుంది. మరదలి దొంగ ఏడుపుకి కరిగిపోయిన మాధవ్ మళ్ళీ ఇంకోసారి తల్లిని, భార్యను ఒప్పించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.


తన మాట నెగ్గనీయలేదన్న కారణంతో తల్లిని ఏమీ అనలేక... చీటికీమాటికీ వాసంతి పై విసుక్కోవడం... పిల్లల మీద అరవటం చేస్తున్నాడు మాధవ్.


సుమలత సాన్నిహిత్యం కారణంగా కాపురంలో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. రోజురోజుకి మాధవ్ లో అశాంతి పెరిగిపోతున్నది. అదను కోసం కాచుకు కూర్చున్న సుమలత మాధవ్ కి మరింత చేరువయే ప్రయత్నంలో... అతని మనసులో భార్య పట్ల విషం నింపుతోంది.


మాధవ్ కాపురంలో గొడవలు చిలికిచిలికి గాలివానగా మారాయి .అతను పూర్తిగా సుమలత మాయలో పడ్డాడు. చివరకు ఒక రోజు అందరి సమక్షంలో తాను వాసంతికి విడాకులు ఇచ్చి...సుమలతను పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పేశాడు.


విధిలేక పిల్లలతో పుట్టింటికి చేరింది వాసంతి. ఇల్లు విడిచి మాధవ్ వేరేచోట ఉండసాగాడు.పెద్దవాళ్ళు ప్రేక్షకపాత్ర వహించారు.

కూతురు చేసిన ఈ పనికి తలెత్తుకోలేకపోయింది సుజాత. పాలకుండ లాంటి కుటుంబంలో విషపు చుక్కలు చిందించి... ఛిన్నాభిన్నం చేసిన కూతురంటే అసహ్యం వేసింది .అలాగని జరుగుతున్న దాన్ని చూస్తూ ఊరుకోలేక పోయింది .

కష్టంలో ఆదుకున్న ఆడపడుచు పద్మకు...అదే ఇంటికి మరో తరం ఆడపడుచు తన కూతురు సుమలతకు వ్యక్తిత్వంలో ఎంత తేడా!!! ఆమె ఒక కుటుంబాన్ని నిలబెడితే...ఇది దాని స్వార్థం కోసం ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. నా కడుపున చెడబుట్టిందని బాధపడింది.

ఏదో ఒకటి చేసి ఆడబడుచు కుటుంబాన్ని నిలబెట్టాలని మనసులో గట్టిగా నిశ్చయించుకున్నది.

కూతురు సంగతి తెలిసిందే... చెప్పినా వినదు. అసలు అల్లుడు కూతురుని వదిలి పెట్టడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించింది.


వాసంతి సాయంతో అల్లుడు పనిచేసే చోటికి వెళ్లి అతని గురించి ఆరా తీసి అతన్ని కలిసింది.


"సుమలత బాగా ఖర్చు మనిషనీ... జీతం మొత్తం ఆడంబరాలకు ఖర్చు చేసి నెల చివర్లో అప్పులు చేబదుళ్ళు చేయడం అలవాటని... అతని తల్లిదండ్రులకు అతని సంపాదన నుండి ఒక్క రూపాయి కూడా ఇవ్వనిచ్చేది కాదని, వృద్ధాప్యంలో వున్న వారిని ఇంటి నుంచి వెళ్లగొట్టిందనీ"చెప్పాడు. ఎన్నో సార్లు నచ్చజెప్పినా వినలేదు. తానొక్కడే వారికి ఆధారం కాబట్టి... ఇష్టం లేకపోయినా...బాబును వదిలి పెట్టి వారి దగ్గరకు వెళ్లి పోయాను. ఇక జన్మలో లత మొహం చూసేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పాడు.


కూతురు చేసిన తప్పుకి తనను క్షమించమని అతన్ని బతిమిలాడింది. ఇంటి దగ్గర పరిస్థితులు వివరించి ఒక కుటుంబాన్ని నిలబెట్టడం కోసం తమతోపాటు ఊరికి రమ్మని అల్లుడిని ప్రాధేయపడింది.


                  ▪️▪️▪️▪️▪️

ఇంటికి వచ్చిన భర్తను చూసి కోపంతో ఊగిపోయింది సుమలత. మళ్లీ ఎందుకు వచ్చావు... అంటూ చొక్కా పట్టుకుని బయటకు నెట్టివేసేంతలో...తల్లి వచ్చి ఆమె చెంపలు పగలగొట్టింది.

అమ్మా!! అని అరిచింది ఏడుస్తూ...

అవును అమ్మనే... ఈ దెబ్బలు ఎప్పుడో కొట్టివుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నీ స్వార్థం కోసం బంగారం లాంటి అల్లుడిని బాధపెడితే చూస్తూ వూరుకున్నా! మాధవ్ ని ఇల్లొదిలేలా చేసావు.వాసంతిని పుట్టింటికి చేరేలా చేసావు. ఇంకా ఎంతమంది జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావ్ అన్నది ఆవేశంగా!


అమ్మా!! అంటూ గట్టిగా అరిచింది సుమలత.


చూడు... నీ కాపురం... నీ ఇష్టం. నిలబెట్టుకుంటావో... చెడగొట్టుకుంటావో...నాకు అనవసరం. ఇతనిని మాధవ్ ముందు నిలబెట్టి జరిగింది బయటపెడతాను‌. నీ మాయ లోంచి మాధవ్ ని బయట పడేస్తాను.

అమ్మా!!అమ్మా!!అన్నది లత బిగ్గరగా ఏడుస్తూ!


కూతురి దుఃఖం చూసి తల్లి కడుపు తరుక్కుపోయింది.దగ్గరకు తీసుకుని ప్రేమగా అనునయించింది. నా బంగారు తల్లివికదూ... నా మాట విను. ఏం చేశావో?... ఏం చేస్తున్నావో?...ఏం జరుగుతుందో... ఒకసారి ఆలోచించు. నీ కళ్ళకు కమ్మిన తెరలు తొలగించుకుని చూడు...ఎలా బ్రతకాలనుకుంటున్నావో... ఆత్మవిమర్శ చేసుకో!మాధవ్ ని చేసుకుంటే... రేపు ఈ సమాజంలో నీ స్థానం ఏమిటన్నది గుర్తించు.మానావమానాలు విడిచి తిరిగే ఆడదానికి మర్యాద వుండదు. నీ ముందు కాకపోయినా వెనకాల వేలెత్తి చూపడానికి వేలల్లో వుంటారు. ఆ అవమానాల మధ్య ...ఛీ! ఊహకే అసహ్యంగా వున్నది.


చేసిన తప్పును సరి దిద్దుకునే అవకాశం అందరికీ రాదు.నీకు భగవంతుడు మరో అవకాశం ఇచ్చాడు.అబ్బాయిని క్షమించమని అడిగి నీ కాపురం చక్కబెట్టుకో తల్లీ! నీ బిడ్డ సమాజంలో గౌరవంగా ఎదిగేలా చేయి. అదే ఈ' అమ్మమాట'కు నువ్విచ్చే విలువ. ఇన్నాళ్లు నువ్వడిగినదేదీ...కాదనలేదు. ఈ ఒక్కసారికి నా మాట విను. నీ తల్లి గౌరవంగా జీవించేట్టు ప్రవర్తించు. నిన్ను నువ్వు మార్చుకో.అదే నీకు,నీ బిడ్డకు శ్రేయస్కరం.


మరునాటి ఉదయాన్నే చక్కగా తయారై తల్లి కాళ్ళకు దణ్ణం పెట్టి బిడ్డను తీసుకుని భర్తతో తన ఇంటికి వెళ్ళిపోయింది సుమలత.


భార్య కాళ్ళు పట్టుకుని క్షమించమని వేడుకొని... ఇంకెప్పుడూ ఇటువంటి తప్పు చేయనని ప్రమాణం చేసి మరీ వాసంతి, పిల్లల్ని ఇంటికి తెచ్చుకున్నాడు మాధవ్.

రెండు కాపురాలు నిలబెట్టానన్న తృప్తితో... సంతోషంగా ఊపిరి తీసుకుంది సుజాత.






Rate this content
Log in