కావ్యావిష్కరణ(హాస్యకథ)
కావ్యావిష్కరణ(హాస్యకథ)
కావ్యావిష్కరణ(హాస్యకథ)
"మహాజనులారా! పురప్రముఖులారా! అందరికీ సాహిత్యాభివందనములు.
ఈరోజు సాయంత్రం సరిగ్గా భారతీయ కాలమానం ప్రకారం ఐదు గంటలకు సహజ - అతి సహజకవి,సాహితీ స్రష్ట అయిన శ్రీ కర్కాటక రావు గారిచే రచించబడిన "మహిషాధిష్ఠాన మర్దనం" అనే కావ్యావిష్కరణ మన పట్టణ ఆడిటోరియం నందు ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమంలో కృతికర్త శ్రీ కర్కటకరావు, కృతి భర్త దమనకరావు లే కాక మన పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు, మన ప్రథమ పౌరుడు అయిన శ్రీ మున్సిపల్ చైర్మన్ పాల్గొంటారు. కృతి భర్త దమనకరావు గారు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందిస్తూ స్పాన్సర్ చేస్తున్నారు.కావున యావన్మంది సాహిత్య అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము"
మైక్ లో ఎనౌన్స్ మెంట్ మహా జోరుగా సాగుతోంది రిక్షాలో!
" జయప్రద వస్తోందటరా!" పరాగ్గా విన్న ఒకడు సైకిల్ మీద తనతోపాటు వస్తున్న స్నేహితుడితో అన్నాడు.
" నీ బొంద. జయప్రదా. ఆర్తి అగర్వాలా? మూర్ఖుడా. ఆ సుత్తి కార్యక్రమంలో మన అందరిని పాల్గొని జయప్రదం చేయమంటున్నాడు" రెండవవాడు అన్న మాటలకు మొదటి వాడు నోరు మూసుకుని సైకిల్ పోనిచ్చాడు తన తల మీద తానే కొట్టుకొని.
దమనక రావు అదే దారిలో బైక్ మీద ఆడిటోరియంకు వెళుతూ "ఇది మన ప్రోగ్రాంలో లేదే. దీనికి అయ్యే ఖర్చు కూడా మన ఖర్చు లో కలిపేద్దాము అనుకుంటున్నాడా ఆ కర్కాట రావు? పోనీ పుస్తకం ఏదో రాసి తనకు అంకితం ఇస్తానంటే సరే అన్నాడు కానీ ఇలా అన్నింటికీ తనను చ దోచేస్తే ఎలా అనుకున్నాడు? ఇపుడే తేల్చేస్తాను" అనుకున్నంతలోనే వచ్చేసిందిఆడిటోరియం.
ఆడిటోరియం ముందు నిలబడి మెడలో కండువా ఊపుకుంటూ గాలి తగిలేలా విసురుకుంటూ, సూచనలిస్తున్న కర్కటక రావు దమనకరావును చూస్తూనే
" అయ్యా! నమస్కారం !ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? మీ పేరుకు తగ్గట్టు అన్ని ఘనంగా చేయించాను అంటే నమ్మండి" అంటూ స్వాగతం పలికాడు .
పాపం శివుడు కన్నా జాలిగుండె దమనకరావుది . ఆ మాత్రం పొగడ్తకే ఉబ్బితబ్బిబ్బై బొజ్జంతా కదిలేలా నవ్వుతూ బండిని పార్కింగ్ ప్లేస్ లో ఉంచాడు.
" అది సరేగాని మిస్టర్ కర్కటక రావు. ఏంటి ఆ మైకు గోల ఏమిటి ?మన ప్లాన్ లో లేదు కదా?" అడిగాడు దమనకరావు.
" ఇంత ఖర్చు పెట్టిన వారు మీ పేరు పదిమందికి తెలియకపోతే ఎలాగండి? అయినా ఈ ఆలోచన నాది కాదు. మా అమృతం అదేనండి ...మా ఆవిడ టీవీలో వచ్చిన ప్రకటనే పదే పదే రావడం చూసి నా దగ్గరకి పరిగెత్తుకు వచ్చి 'ఇవాళ సాయంత్రం మీ ఫంక్షన్ కదా?' అంది.
'నా ఫంక్షన్ ఏమిటే నీ మొహం మండ!" అన్నాను.
"అదేనండి మీ పుస్తకావిష్కరణ సభ ఏర్పాటు చేశారు కదా ....ఆ అన్నయ్య గారు ఇంత ఖర్చు పెట్టి ఈ పుస్తకాలన్నీ ప్రింట్ చేయించినందుకు ఆయన పేరు పదిమందికి తెలిసేలా చేయడం మన కనీస ధర్మం అండి" అంది .అందుకే ఈ ఏర్పాట్లు చేశాను
" ఇంతకీ అన్నయ్య గారు ఎవరయ్యా?" అడిగాడు దమనక రావు.
"అదేమిటండీ?అన్నయ్యగారు అంటే మీరే.మా అమృతానికి అన్నయ్యలు లేరు తమ్ముళ్లు తప్ప.అందుకని మిమ్మల్నే తన అన్నయ్య గా భావించింది"అన్నాడు భక్తిపారవశ్యంగా.
" బావా." ఒక్క అరుపు అరిచాడు దమనకరావు.
ఇప్పుడు విస్తుపోవడం కర్కాటకరావు వంతు అయింది. తన వెనుక,చుట్టుపక్కల చూశాడు.
"ఎవరండీ మీ బావ?ఇక్కడ ఎవరూ లేరే?అమాయకంగా అన్నాడు కర్కాటకారావు.
" నీ భార్య అమృతం నా బంగారు చెల్లి అయితే నువు నాకు బావవి కావా ఏంటి?"
"నాతో సరసం ఆడొద్దు సర్.ఇప్పటికే మీరు ఎంతో ధనం నా పుస్తకం కోసం ఖర్చుపెట్టారు."అన్నాడు అయోమయంగా కర్కటక రావు.
"పో బావా.నీతో కాకపోతే ఎవరితో ఆడతాను సరసం? నేను బావా అన్నది నిన్నే...నిన్నే. నాకు ఈ లోకంలో ఒక చెల్లెలు ఉందని ఇప్పుడే తెలిసింది బావ. నేను ఎంత అదృష్టవంతుడిని ? నా బావ ఒక సహజకవి, అతి సహజ కవి.నా చెల్లిని నేను వెంటనే చూడాలి బావా.. వెంటనే చూడాలి బావ" అంటూ కర్కటకరావు ని అమాంతం కౌగిలించుకొని తన్మయత్వం పొందుతూ అన్నాడు దమనకరావు.
ఇదే మంచి సమయం.. అనుకున్న కర్కటక రావు అంతే ప్రేమ కురిపిస్తూ..." అయితే బావగారు మరి మైక్ ఖర్చు ...." అంటూ నసిగాడు
"రాసేయ్. నా పద్దులో రాసేయ్. మా అమృతం చెల్లెమ్మ కి పసుపు కుంకుమ కింద రాసేయ్. ఇంతకీ నా చెల్లి ఎక్కడ?ఎక్కడ నా బంగారు తల్లి?" ఆతృతగా అడిగాడు దమనక రావు.
" ఫంక్షన్ కి వస్తుంది బావగారు. అప్పుడు పరిచయం చేస్తాను. ముందు మీరు లోపలకు వచ్చి ఏర్పాట్లన్నీ చూడండి ఎలా చేశానో?" అన్నాడు కర్ణాటక రావు.
దమనకరావు హుందాగా నడుస్తూ హాలు లోపలికి వచ్చి పరిశీలించాడు .
వేదిక అంతా అందంగా అలంకరించారు. వెనకాల తన ఫొటోలతో పెద్ద బ్యానర్లు కట్టారు. లైట్లు కనబడకుండా లైటింగ్ ఎఫెక్ట్స్ పూర్తిగా వచ్చేలా ,తన నిలువెత్తు బ్యానర్ మీద పడేలా చేసిన ఏర్పాట్లు చూసి మెచ్చుకున్నాడు దమనక రావు. కర్కటకరావు రెండు కుర్చీలు బయటకు తప్పించి వేయించాడు .అందులో సుఖాసీనులై అయ్యారు ఏమీ కాని బావ బామ్మర్దిలిద్దరు .
అన్ని ఏర్పాట్లు చేసి, పనిచేసేవాళ్ళు ఫంక్షన్ అయ్యే టైం కు వస్తామని చెప్పి ఓ 200 టిఫిన్ ఖర్చులకు తీసుకుని వెళ్ళిపోయారు .
కర్కటకరావు ఆ రెండువందలు దమనక రావు చేత ఇప్పించాడు.
********
సాయంత్రం ఆరు అయింది.
ఆడిటోరియంలో మైక్ నుంచి వచ్చే సినిమా పాటలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించసాగింది.
"సరిగ్గా ఐదు గంటలకు అని ఎనౌన్స్ చేసాం కదా. ఇంకా ఎవరూ రాలేదు ఏమిటబ్బా?" అన్నాడు కర్కాటక రావు.
" భారత కాలమానం ప్రకారం అని చెప్పించావు కదా బావా "అన్నాడు దమనకరావు నీరసంగా.
" అవును చెప్పించాను. అయితే?" ఎదురు ప్రశ్న వేశాడు కర్కటకరావు.
"ఆమాత్రం తెలిసుకోకపోతే ఎలా బావా? భారత కాలమానం ప్రకారం అంటే ఇండియన్ పంక్చువాలిటీ అన్నమాట. అంటే సరిగ్గా గంట లేటుగా రమ్మని అర్థం. అంటే జనాలు ఆరు దాటాక వస్తారు." అంటూ నీరసంగా తల వాల్ చేశాడు దమనకరావు.
" అదేంటి బావగారు ఏమైంది?'' ఆదుర్దాగా అడిగాడు కర్కటక రావు
"సరిగ్గా అయిదింటికి అని కరపత్రంలో సమయం చూసుకుని నాలుగింటికి షాపులో కుర్ర వాడిని కూర్చోబెట్టి వచ్చేసాను. నాకు అసలే షుగరు. ప్రతి రెండు గంటలకి పది ఇడ్లీ అయినా పడకపోతే నీరసంతో ఒళ్ళంతా చమటలు పట్టేస్తుంది. వెంటనే తినడానికి ఏమైనా తెప్పించు బావ. " నీరసం పడిపోతూ
ఇక మాట్లాడ లేక లాల్చీ జేబు చూపించాడు దమనకరావు.
జేబులోంచి పర్సు తీయడం కోసం చేయి పెట్టిన కర్కాటకరావు స్పర్శ కితకితలు గా అనిపించి అటు ఇటు గా కదిలి తల వేలాడేయడంతో కర్కటకరావు చెయ్యి దమనకరావు బొజ్జ మడతల్లో ఇరుక్కుపోయింది .
ఏం చేయాలో పాలుపోక అతని బొజ్జ మీద ఎడం చెయ్యి, కుర్చీకి ఎడమ కాలు తన్ని పెట్టి కుడి చెయ్యి పర్సు తో సహా వచ్చేలా బలంగా వెనక్కి ఒక్క గుంజు గుంజాడు కర్కటకరావు.
ఆ దెబ్బకి ఐదు అడుగుల దూరం వెనక్కి వెళ్లి నేల మీద వెల్లకిలా పడిపోయాడు. అమ్మ! నాలో ఇంత బలం ఉందా?' అని తనకు తానే ఆశ్చర్యపోతూ ఎవరూ చూడలేదు కదా అనుకుంటూ లేచి నిలబడి చొక్కా వెనుక అంటిన మట్టి దులుపుకున్నాడు.
అంత క్రితం కురిసిన చిరుజల్లు వల్ల నేల చిత్తడిగా తెలిసిందేమో... మచ్చలు తేలిన చంద్రుడు గా కనిపిస్తున్నాడు ఇప్పుడతను.
దమనిక రావు ఓళ్ళు బాగా చెమటతో తడిసిపోయింది. కర్కాటకారావు గబగబా వెళ్లి దగ్గర్లో ఉన్న బడ్డీకొట్టు లో డజను ఇడ్లీ పార్సిల్ చేయించుకు వచ్చాడు. అప్పటికే దమనక రావు చుట్టూ కొన్ని చిల్లర నాణాలు పడి ఉన్నాయి.పర్సులోంచి జారిపోయి ఉంటాయి అనుకుని అన్ని జేబులో వేసుకుని తానే స్వయంగా దమనకరావు చేత ఒక ఇడ్లీ తినిపించాడు.
అంతే .అప్పటివరకు మొహం తేలేసిన దమనకరావు ఒకసారి ఇడ్లీ ల మీద పడి మాయాబజార్ లో ఘటోత్కచుడి మాదిరిగా తినేసాడు. మంచినీళ్ళ బాటిల్ దింపకుండా తాగేశాడు.
" థాంక్స్ బావ .నా ప్రాణం నిలబెట్టావు" అన్నాడు కర్కటకరావు వీపు చరుస్తూ.
అంతలో వారి ముందు ఒక రిక్షా ఆగింది. అందులోంచి ములక్కాడ పర్సనాలిటీతో ఒక అమ్మాయి, వెదురు కర్రకి పట్టు చీర కట్టి, గుంట కళ్ళతో భయానక ఇంగ్లీష్ పిక్చర్ లోని డ్రాకులా ఆకారంతో చెల్లెలు అనబడే శాల్తీ దిగాయి. ఆమె కంఠం మాత్రం కంచు గంటలా మ్రోగింది.
" ఏయ్ అబ్బాయి. ఇక్కడ ఈ వేళ మావారికి సత్కారం,కావ్యావిష్కరణ కూడాను. ఎక్కడ ఆయన?" అని అడిగింది.
" నీ మొహం మండ. నేనే నే అమృతం" అన్నాడు కరటక రావు.
''మరి మీరేమిటండి... శుభ్రంగా తల దువ్వి అందమైన బట్టలు వేసి పంపాను కదండీ? ఇదేమిటి ఇలా తయారయ్యారు?" అంది సాగదీస్తూ.
"ఇందాక మీ అన్న గారి జేబులోంచి పర్సు తీయబోతే జారి పడ్డాను.మరేం పర్వాలేదు." అతని మాట పూర్తికాకుండానే దమనక రావు కుర్చీలోంచి లేచి చేతులు చాస్తూ "ఏంటి? మా చెల్లి వచ్చిందా? మా బంగారు తల్లి అమృతం వచ్చిందా?"?అంటూ ఒక కాలు ముందుకు వేసి
పరుగు పందెం లో పాల్గొనే వాడిలా పోజు పెట్టాడు తల ఊపుతూ.
"ఏమిటి?ఈయనేనా మా అన్నయ్య... అన్నయ్యా.. " అంటూ అదే రకమైన పోజులో నిలబడింది అమృతం కూడా.
తల ఊపుతూ.
ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా ఆకుకే నష్టం అన్న సామెత గుర్తుకు వచ్చి వారిద్దరి మధ్య అడ్డంగా నిలబడ్డాడు కర్కటక రావు.
నాగ లోకం కేసి నక్కలా చూస్తున్న భార్యను అడిగాడు "అదేమిటి అమ్మూ. ఆ తల ఊపుడు ఇదివరకు లేదుగా?"
" ఇది అనుభూతి అండి...అనుభూతి.తెనుగు సినిమాలో చిన్ననాడు విడిపోయిన అన్నాచెల్లెళ్ళు పెద్దయ్యాక మొట్టమొదటిసారిగా కలుసుకున్న మధురానుభూతి. అనురాగ సంగమం ."అందామె అదే పొజిషన్ లో.
"నీ తెలుగు సినిమా పైత్యం నషాళానికెక్క.రోడ్డు మీద ఏమిటే?" అనబోతుండగా -
"ఏమయ్యా !ప్రేమికుల విడదీస్తూ మధ్యలో నంది విగ్రహంలా నిలబెడతావా... నీకు పక్షవాతం రాను ...బుద్ధి లేదు..." అని ఫంక్షన్ కి వస్తున్న ఒక పెద్దావిడ ఎవరో తిట్టి లోపలికి వెళ్లడంతో ముగ్గురూ లెంప లు వేసుకుని ట్రాన్స్ లొంచి బయటకొచ్చారు .అన్నాచెల్లెళ్ళు ఇద్దరు కబుర్లలో పడిపోయారు.
ముసలి ముతక ఒక్కొక్కరు రావడంతో సందడి ప్రారంభమైంది.
కర్కటక రావు అవసరం ఉన్నా లేకున్నా తనకు 'సెల్' ఉందని అందరికీ తెలియడం కోసం, అంతేకాక తాను అనుక్షణం ఏ మాత్రం ఖాళీ లేని వ్యాపారస్తుడు అని అందరూ అనుకోవాలి అని ఫంక్షన్ స్టార్ట్ అయ్యే అంతవరకు ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. ఎవరెవరికో? ఎందుకో మరి.
నిజంగా వాటికి అయిన ఖర్చు గుర్తు తెచ్చుకుంటే స్పాట్లో మరో పాతిక ఇడ్లీలు తెప్పించుకుని తినేవాడు .
చివరగా మున్సిపల్ కమిషనర్ కు చైర్ పర్సన్ కు ఫోన్ చేశాడు దమనక రావు.
" హలో సార్! ఇద్దరు బయలుదేరారా లేదా? ఇప్పటికే ఏడు దాటిపోయింది" అడిగాడు
"మేము వచ్చి పావుగంట అయిందయ్యా. ఆడిటోరియం లో కూర్చొని మీ కోసం ఎదురు చూస్తున్నాము. ఇంకో ఐదు నిమిషాలు చూసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. అన్నాడు కమిషనర్.
"అదేమిటి సార్ !ఎప్పుడు వచ్చారు ?నేను బయటే ఉన్నాను గా!"
" అవును. నువ్వు... మీ చెల్లి... అనుభూతుల్లోకి వెళ్ళినప్పుడు వచ్చాం. మేం దిగిన జీపు శబ్దం విని కూడా మీరు కదలక పోయేసరికి మీ అన్నాచెల్లెళ్లను విడదీసిన పాపం మాకు ఎందుకని నిశ్శబ్దంగా లోపలికి వచ్చేసాం." అన్నాడాయన తాపీగా.
అది వింటూనే ఒక్కసారిగా లోపలికి గెంతాడు కర్కటకరావు.
ఆ గాలి విసురుకి హాల్ లో కుర్చీల్లోకి వచ్చి పడ్డారు అమృతం,ఆమె కూతురు.
చెల్లెలి పట్ల ప్రేమపాశం, అన్నగారు దమనకరావును కూడా లోపలికి తీసుకు వచ్చింది
******
సభా ప్రారంభం జరిగింది.
అమృతం గారి ప్రోత్సాహంతో కర్కటక రావు గారి కుమార్తె, నూతి లోంచి ఆర్తనాదం అలాంటి ఆలాపన తో ప్రారంభించి ప్రార్థనా గీతం ఆలపించింది.
మున్సిపల్ కమిషనర్ గారు సభకు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా చైర్మెన్, కృతి భర్త దమనక రావు, కృతికర్త కర్కటక రావు తమతమ ఆసనాలను అలంకరించారు.
దిష్టి తగలకుండా అన్నట్లు అమృతమ్మ గారికి కాస్త ఎడంగా కుర్చీ వేసి కూర్చోబెట్టారు.
హాలంతా కిటకిట లాడ సాగింది. పదిమంది నగరవాసులు, 200 మందికి పైగా మున్సిపల్ సిబ్బంది అంతా ఇబ్బందిగానే కూర్చున్నారు.
ఎందుకంటే కమీషనర్ మహా స్ట్రిక్ట్.ఎవరైనా ఎదురు గా మాట్లాడితే 'మా బామ్మ పెంపకంలో పెరిగిన వాడిని. మా బామ్మ అంటే ఎవరనుకున్నారు ? ఈ స్వాతంత్ర్యం,ఈ ఉద్యమాలు,ఈ దెబ్బలు తినడం నీకెందుకయ్యా ...హాయిగా పెళ్ళాంతో కాపురం చేసుకోక ...'అని సాక్షాత్తూ ఆ మహాత్ముడిని ప్రశ్నించిన ధీరవనిత.
'నీలా ప్రతి ఆడది స్వేచ్ఛగా తన భావాలను ప్రకటించుకునే అవకాశం ఇచ్చే స్వాతంత్ర్యం కోసం' అన్న ఆయన సమాధానానికి సంతృప్తి పడి ఆయనతో చేయి కలిపిన ధీరోదాత్తురాలు. (ఇదంతా ఆమెకు ....కలలో అని కమిషనర్ గారికి మాత్రమే తెలుసు). అందుచేత అందరూ టైం ప్రకారం రండి. టైం ప్రకారం పని చేయండి. టైం దాటిన తర్వాత అరక్షణం ఉండకండి.అలా ఎవరినైనా నేను చూశానా ... వారి ఇంక్రిమెంట్ కరెక్ట్ జాగ్రత్త!' అన్న నినాదంతో ' కమిషనర్ గారు నిక్కచ్చి మనిషి ' అని పేరు తెచ్చుకున్న వాడు.
ఆయన అధ్యక్షు ఉపన్యాసం అయిన వెంటనే "మహిషాధిష్ఠాన మర్దనం" కావ్య ఆవిష్కరణ జరిగింది.దానిని 'అంకితం' అందుకున్న అనంతరం కృతి భర్త దమనకరావు మాట్లాడారు .
తాను ఏ పరిస్థితులలో ఆ గ్రంథ ముద్రణకు అంగీకరించింది వివరించారు .తనకు తెలియకుండానే ఒక అమృతమూర్తి తనకు చెల్లిగా లభించినందుకు తన్మయత్వంతో ఊగిపోయి మైక్ కు మరీ దగ్గరగా వచ్చి మాట్లాడారు.
రెండు మూడు సందర్భాలలో అయితే మైకు ఆయన నోటి లోకి వెళ్లి వచ్చింది అంటేనే ...ఆయన ఎంత తాదాత్మ్యం చెందారో...అని అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పుడు లౌడ్ స్పీకర్ నుంచి విన్న వింత భయంకర శబ్దాలకు పిల్లల జడుసుకుని రాగాలాపన చేయడం ఆయన గమనించనే లేదు. అలా ఆయన ప్రసంగం సాగిపోయింది.
ఆ తర్వాత కవిగారి కావ్యానికి సమీక్ష సాక్షాత్తు వారి శ్రీమతి చేస్తారనే ఆశ్చర్యకరమైన ప్రకటన చేసే అవకాశం వచ్చినందుకు కూడా దమనకరావు గారు పట్టలేని ఆనందాన్ని వ్యక్తపరిచారు.
" ఇందాక మనం లోపలికి వస్తుంటే కుర్చీలో తలవాల్చి 'శవం'లా పడుకుంటే చచ్చాడు అనుకుని 'చిల్లర' డబ్బులు వేశాం చూడు. ఆ శాల్తీ వీడెనే...దుక్క లా ఉన్నాడు. అనవసరంగా మన చిల్లర దండగ చేసుకున్నాం "అని ప్రేక్షకుల్లో ఒక ఆవిడ మరొక ఆవిడతో అనడం దమనకరావు విని ఉంటే తనలో, తనకు తెలియని నటుడుని ఉన్నాడని సంబరపడిపోయేవాడు .అయితే అమృతమ్మగారు దమనక రావు ను గాని, దమనక రావు అమృతమ్మగారిని గాని చూసినప్పుడల్లా వారి తలలు ఎందుకు ఉన్నాయో ప్రేక్షకులలో ఎవరికీ అంతుపట్టలేదు .
సరిగ్గా అలాంటి సమయంలో గ్రంధ సమీక్ష చేయడానికి అమృతమ్మగారు మైకు ముందుకొచ్చింది.
" ఆహుతి లందరికీ నా అభివాదములు! ఈ గ్రంథ సమీక్ష చేయడానికి నన్నే మా వారు ఎంచుకోవడంలో చాలా విశేషం ఉంది. నేను మా ఊర్లో ఏడో తరగతి చదువుతుండగా మొదటిసారిగా వారిని చూసాను. ఆయన చూపు నా మీద పడటం నా అదృష్టం . ఈ కావ్యం పేరు 'మహిషాధిష్టానమర్దనం'. మహిషము అంటే ఎద్దు. అధిష్టించడం అంటే ఎక్కుట అని అర్ధం. మర్దనం అంటే తొక్కుట అని అర్ధం.
ఏమి చదువు అబ్బని స్థితిలో ఇంట్లో వాళ్ళు ఆయన్ని గొడ్లు కాయడానికి పంపేవారు. ఊరి చివర ఉన్న పచ్చిక బయళ్ళలో ఆయన వాటిని మేపే వారు. మా పాఠశాల కూడా ఊరి చివర గా ఉండేది . ఒకరోజు ఒక గిత్త దూడ నా ఎరుపు రంగు పరికిణీ చూసి నన్ను కుమ్మబోయింది. ఆ సమయంలో ఆయన అవలీలగా దానిని అధిరోహించి దాని
తోక అందుకుని,దాని మీద నిలబడి దానిని లొంగ తీసుకున్నారు . ఆనాడు వారు నన్ను చూస్తూ చేసిన ఆనంద తాండవం నేను మర్చిపోలేను. తొలిచూపులోనే మేమిద్దరం ప్రేమించుకున్నాం .మా ఇద్దరి ప్రేమ ఊసులు ,అనుభూతుల గీతికలే ఈ గేయ సంపుటి. ఇందులో ఏ గేయం చదివినా అది మీకే వర్తిస్తుంది అన్నంత హృద్యంగా రచించారు రచయిత. దీనిని ఆద్యంతం చదివి, దీని రెండవ భాగాన్ని కూడా వెలువరించాలని ఉత్సాహపడుతున్న మా శ్రీవారికి మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను." అంటూ తన చేతిలో ఉన్న గేయ సంపుటి నుంచి అక్కడ అక్కడ కొన్ని లైన్లు పాడేటందుకు ఉద్యుక్తురాలయింది.
మొదటి రెండు లైన్లు వినగానే టీవీ లో ఏదో ప్రకటన వింటున్నట్టుగా అనిపించడంతో ఎవరు వాళ్ళు పక్కవారితో కబుర్లలో పడ్డారు .
ఒక ప్రేక్షకుడు తల ప్రక్కనున్న వృద్ధుడిని అడిగాడు.
" అసలు కావ్యాలు అంటే ఏమిటి సార్?"
" మీరు తెలుగు వారేనా బాబు?" అడిగాడాయన .
"అవునండి ఏం ₹?"
"ఏం లేదు బాబు .ఊరికే అడిగాను." అని తనలో తాను అనుకున్నాడాయన.
"అమ్మ '!తెలుగు కళామతల్లి! ఎంతటి దుస్థితిలో ఉందమ్మా నీ పరిస్థితి! పట్టుమని పాతికేళ్లు లేని ఈ భావి పౌరుడికి కావ్యం అంటే ఏమిటో తెలియదు. ఏమైందమ్మా నీ కళావైభవం? ఎలా ఈ పామరుల కళ్ళు తెరిపించడం?"
" ఏంటి సార్ ?మీకు కూడా తెలియదా?" అడిగాడు ఆ కుర్రాడు.
''చూడు బాబు.' సహితానాంభావః సాహిత్యం!" అంటే హితముతో కూడినది సాహిత్యం. అంటే మేలు చేకూర్చునది సాహిత్యం అని అర్థం.
ఆంధ్ర సాహిత్యంలో ఎన్నో కావ్యాలున్నా ఒక వ్యక్తి పండితుడు అయ్యాడంటే అతడు పంచ ప్రాథమిక కావ్యాలు చదివి అవగతం చేసుకున్నాడు అని అర్థం. ఆ పంచ మహా కావ్యాలు 'మను చరిత్ర', 'వసుచరిత్ర','శృంగార నైషధం', 'ఆముక్తమాల్యద',' పాండురంగ మహత్యం'. ఇవి బాబు కావ్యాలంటే."వివరించాడు ఆయన
"మరి ఈ మహిషాధిష్ఠాన మర్దనం?' కావ్యావిష్కరణ?" అయోమయంగా అడిగాడు ఆ కుర్రాడు.
" ఏం చేస్తాం బాబు! తెలుగు సాహితీ మాత కు గ్రహణం పట్టింది. గ్రహణం తొలగి తిరిగి ఆ తల్లి పూర్వ కళా వైభవం స్థాయికి చేరేది ఎన్నడో !ఇంక ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు బాబు. కావ్య ఆవిష్కరణ అంటే ఏ కావ్యంలోంచి నైనా ఒక పద్యాన్ని రసాస్వాదన చేద్దామని వచ్చాను. ఇక్కడ ఉన్నది ఎండు గడ్డి అని అర్థమైంది. వస్తాను బాబు" అంటూ ఆయన నిష్క్రమించాడు.
ఒకరిద్దరు మినహా అందరూ వెళ్లిపోవడంతో స్టేజి మీద ఉన్న వారే జనగణమన పాడుకుని ఈ కార్యక్రమం పూర్తి అయినట్లు ప్రకటించుకున్నారు.
*********
దమనక రావు పుణ్యమా అని 300 కాపీలు కర్కటక రావు లభించాయి .అవి తనకు ఇష్టమైన వారికి ఆప్తులకి ఇచ్చుకోమని అప్పగించారు.
దాంతో ఉత్సాహం పట్టలేక ఆ సీజన్లో దొరికే పళ్ళు ఒక జత, ఒక పుస్తకం వీధిలో ప్రతి ఇంటికి స్వయంగా పంచిపెట్టి వచ్చాడు కర్కటకరావు.
ఇక అమృతమ్మగారైతే ఎవరు తన ఇంటికి ఏ పని మీద వచ్చినా, వాళ్లని మాట్లాడనీవ్వకుండా తన భర్త రాసిన పుస్తకం గురించి ఏకరువు పెట్టసాగింది. వీధిలో చిన్న పిల్లలద్వారా వాళ్ళ స్కూల్లో టీచర్లకు పంపింది .
వాళ్ల సాయంత్రమే "ఇంకా పుస్తకాలు కావాలన్నారు ఆంటీ" అంటూ పట్టుకు వెళ్లారు.
ఆ సాయంత్రం ఆ వీధి వారందరి పిల్లల చేతుల్లోనూ ఆ పుస్తకాలే .వాటిని పుచ్చుకుని అందరూ కాలువ ఒడ్డుకు స్నానాలకు వెళ్తుంటే మురిసిపోయారు అమృతమ్మ కర్కటక రావు దంపతులు. ఆ పిల్లలందరిలోనూ అభినవ నన్నయ, తిక్కన, ఎర్రనలు కనిపించసాగారూ వాళ్లకి.
అందరూ స్నానాలు చేసి తిరిగి వచ్చేటప్పుడు ఎవరి చేతుల్లో లేవు పుస్తకాలు .
"ఏమయ్యాయర్రా! అప్పుడే చదివేశారా వాటిని?" సాగతీసుకుంటూ అడిగింది అమృతమ్మగారు.
"పడవలు చేయడానికి బలే దళసరిగా ఇన్నాయి ఆంటీ ఆ కాగితాలు' అని ఒకరంటే-
" నా పడవ ఈడే ముంచేశాడు ఆంటీ" అంటూ వాడి మీద ఒక జెల్లకాయ అందుకున్నాడు రెండవవాడు.
"దీపావళికి మతాబులు, సిసింద్రీలు చేసుకుంటాము.రెండు పుస్తకాలు ఉంటే దాచమంది ఆంటీ మా అమ్మ "అని మరో బుడతడు.
" ఓరి నీ అసాధ్యం కూలా !కావ్య పఠనం చేసే వయసు మీకు ఎక్కడిది ?అయినా మీకు ఇవ్వడం నాది బుద్ధి తక్కువ! పిల్ల కాకులకు ఏం తెలుసు ఉండేలు దెబ్బ?హు!" అంటూ వాపోయింది.
ఇక పెద్ద కాకుల సంగతి !
"ఆ అమృతమ్మ మొగుడు గేయాలేవో వ్రాశాడట .పుస్తకము, పళ్ళు ఇచ్చి వెళ్ళాడు చదివావా "అని అడిగాడు ఒకాయన - సందు చివర పేపర్ చదువుతున్న మరో పనిచయస్తుడిని.
" అవి గేయాలా! చదివితే ఒళ్లంతా గాయాలు అయిపోతాయి జాగ్రత్త ''అంటూ కిల్లీకొట్టుకి పైన వేలాడుతున్న పుస్తకంలోది ఒక్క గేయం పాడి వినిపించాడు అంతే. అప్పటికే అతను కింద పడి కొట్టుకుంటున్నాడు.
*******
ఆ సాయంత్రం దమనక రావు కర్కటక రావు దగ్గరకు పరుగెత్తుకు వచ్చాడు చేతిలో చించిన కాగితాల బొత్తి ఉంది. సమయానికి ఇంట్లో అమృతమ్మ గారు లేదు .
"ఏమిటి బావగారు? అంత కంగారు గా వచ్చారు? చిత్తు కాయితాల వ్యాపారం మొదలుపెట్టారా ఏమిటి?"అన్నాడు రాస్తున్నదల్లా ఆపి.
" నా బొంద! మొన్న నీ కిచ్చిన పుస్తకాలు ఇలా పట్రా!"అన్నాడు గుర్రుగా చూస్తూ.
" అవి ఇంకా ఎక్కడ ఉన్నాయి? అందరికీ ఇచ్చుకోమని చెప్పారుగా .అందరికీ పంచేశాను."అన్నాడు తేలికగా.
" వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? మన సందు చివర చౌక దుకాణం వాడికి అమ్మేసి వచ్చి డబ్బులు పంచేసుకున్నారు. వాడేమో ఆ పుస్తకాలన్నీ చింపి పొట్లాలు కట్టేస్తున్నాడు . అందుకైనా ఉపయోగపడ్డాయి. కానీ నా పంచరంగుల ఫోటో అని కూడా చూడకుండా దాన్ని కూడా పొట్ల కట్టడానికి ఉపయోగిస్తున్నాడు. ఇదంతా నీ వల్లనే ...వా!" అంటూ దీర్ఘం తీశాడు.
" ఊరుకో బావ. ఊరుకో! వసుదేవుడంతటివాడీకే తప్పలేదు ఏం చేస్తాం ? ఈసారి పుస్తకంలోంచి కాగితాలు బయటికి రాకుండా బలంగా కుట్టించేద్దాం సరేనా!" అతని పోలికలో ఎవరు వసుదేవుడో,ఎవరు గాడిదో అర్థం కాలేదు దమనక రావుకు.
దాంతో తిక్కరేగి పోయి తన చేతిలోని కాగితాల్ని కర్కటక రావు మొహాన కొట్టాడు. అవన్నీ కృతిభర్త దమనకరావు ఫోటోలే.
" మనవరాలి పుట్టినరోజుకి నెక్లెస్ చేయించమని మా ఆవిడ ముచ్చటపడి అడిగితే వినకుండా, పేరు కోసం నీ వెంట పడ్డాను చూడు... నా చెప్పు తీసుకుని నన్ను కొట్టుకోవాలి."అన్నాడు రౌద్రంగా ఊగిపోతూ.
" అలా అనకు బావ."
" ఏ వరసంలో నీకు బావనవుతానురా?ఆ.. ఇంకోసారి అలా పిలిస్తే తంతాను"అంటూ హుంకరించాడు దమనకరావు.
విస్తుపోయాడు కర్కటక రావు.
" అదేంటి బావా !అదే...మీ చెల్లెలు ...అంటే మా ఆవిడ..."భయంగా నసిగాడు కర్కటకరావు.
" నా ఫోటోలు ఇలా రోడ్డు మీద పడ్డప్పుడే ఆ బంధం తెగిపోయింది.ఇంకెప్పుడు పుస్తకాలు అచ్చు వేయించడానికి నా దుకాణం గుమ్మం తొక్కడానికి వీల్లేదు. అలా అన్నానని దూకి వస్తావేమో. అలా కూడా రావడానికి వీల్లేదు .జాగ్రత్త!" అంటూ విసవిసా వెళ్లిపోయాడు దమనక రావు.
"ఆ...తలమాసినవాడివి నువు కాకపోతే గుండు మాసినవాడు ఇంకోడు..."అనుకున్న కర్కటక రావు కి ఒక్క క్షణం శ్రీశ్రీ గారు గుర్తుకొచ్చారు.
" వస్తే రాని కష్టాల్ నష్టాల్.… పోతే పోనీ.." వస్తే అప్పుడు చూద్దాం."అనుకుని ఇంట్లోకి నడిచాడు.
ఇప్పుడు కర్కటకరావు తను రాస్తున్న "మహిషాధిష్టాన మర్దనం" రెండవ భాగము ఎవరి చేత స్పాన్సర్ చేద్దామా అని ఆలోచిస్తూనే, అసంపూర్తిగా ఉన్న రచన పూర్తి చేయడానికి తన 'ఘంటం'.. అదేనండి ...బాల్ పెన్ పట్టుకోడానికి లోపలికి వెళ్ళాడు .బయటికి వచ్చే రోజు తొందరలోనే వస్తుంది .సిద్ధంగా ఉండండి.
సమాప్తం.
