Dinakar Reddy

Abstract Drama Inspirational

4  

Dinakar Reddy

Abstract Drama Inspirational

ఇది నా దేశం

ఇది నా దేశం

2 mins
461


అయినా మాస్టారూ! ఇంకా పిల్లలకు దేశభక్తి కథలు చెబుతూ, ఆ జరిగిపోయిన కాలం గురించిన పాటలు నేర్పిస్తూ.. ఎందుకండీ శ్రమ పడతారు అని ప్రకాశం మాస్టారికి మిగతా టీచర్లు అందరూ సలహా ఇచ్చారు. ఏదో జెండా ఎగరవేసి చాక్లెట్లు పంచితే చాలదా అని వాళ్ళ ఉద్దేశ్యం.


ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం వస్తోందంటే ప్రకాశం మాష్టారు బడిలోని పిల్లలకి స్వాతంత్ర్య సంగ్రామం గురించిన కథలు చెప్పి ఆ విశేషాలు పాటలుగా పాడిస్తారు.


ఆ రోజు స్వాతంత్ర్య దినోత్సవం..


పిల్లలందరూ తలా ఒక స్వాతంత్ర్య నాయకుని గురించి మాట్లాడారు. గాంధీజీ, నేతాజీ, నెహ్రూ, భగత్ సింగ్ ఇలా అందరి గురించీ మాట్లాడారు.


ఆ కార్యక్రమానికి ప్రకాశం మాష్టారు ఒక వృద్ధ మహిళను తీసుకుని వచ్చారు. ఆమెది ఆ ఊరే. నడవలేక నడుం వంగిన ఆమె నిలబడి జాతీయ జెండాకు సెల్యూట్ చేసి ఊత కర్ర సాయంతో నిలబడింది.


ఆమె చేసిన సెల్యూట్ చూసి అప్పటి వరకూ ఏదో నామ మాత్రంగా ఈ మీటింగ్ అయిపోతే చాలు అనుకున్న మిగతా టీచర్లకు ఎవరో పాఠం చెప్పినట్లు అనిపించింది.


ఆ ముసలమ్మ మాట్లాడుతోంది. పిల్లలూ. నా పేరు చెప్పినా చెప్పకున్నా ఒకటే. మీకు ఒక సంగతి చెబుతాను. బాగా గుర్తు పెట్టుకోండి.


మన దేశం పరాయి పాలనలో ఉన్నప్పుడు స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని మనం ఎప్పుడూ మరచిపోకూడదు. భావి తరాలకి దేశ భక్తిని సగర్వంగా నేర్పండి.


అప్పట్లో బ్రిటీష్ వారిని ఎదిరించి మేము జైలుకు వెళ్ళినప్పుడు మాకు దేవతా పులుసు పెట్టేవారు. అంటే పురుగులు, రాళ్ళు కలిపిన ఆహారం. చెప్పలేని చోట్ల కొట్టేవారు. అయినా మేం వెనక్కి తగ్గలేదు. ఎన్నో అకృత్యాలు చూసి అహింసావాదంతో ఈ జాతి ప్రజలు స్వాతంత్య్రాన్ని సాధించారు. ఆమె చెప్పిన సంఘటనలు విని మిగతా టీచర్ల హృదయం కూడా ద్రవించింది. వాళ్ళు ప్రకాశం మాష్టారుతో అన్న మాటలు ఎంత అర్థం లేనివి కదా అనిపించింది.


ఆమె తిరిగి మాట్లాడింది.

అవన్నీ పాత సంగతులే. కానీ వాటిని మనం ఎప్పటికీ సాధారణ విషయాలుగా కొట్టిపారేయకూడదు. ఈ జాతికి దేశభక్తి లేకుంటే సగర్వంగా తల ఎత్తుకుని ప్రపంచం ముందు నిలబడేది కాదు. నీ దేశాన్ని ప్రేమించు. గర్వంగా ఇది నా దేశం అని అను. అలా ఉండేట్లు, దేశాన్ని అభివృద్ధి మార్గంలో పయనింపజేసేందుకు నీ వంతు కృషి చేయి. మంచిని పెంచు. దేశం కోసం నిలబడు అంటూ ఆమె ఊతకర్రతో నేలపై కొట్టింది. పిల్లలందరూ చప్పట్లు కొట్టారు.


ఎందరు వీరుల త్యాగ ఫలం

మన నేటి స్వేచ్ఛకే.. అంటూ ఆమె పాడింది. పిల్లలూ ఆమెతో గొంతు కలిపారు.


ఆ వేదిక మొత్తం దేశ భక్తుల త్యాగ తరంగాల స్మృతిలో నిండింది.


ప్రకాశం మాష్టారు ఆమె ఖాదీ చీరకు చిన్న భారత జెండాను తగిలించారు. భారత్ మాతా కీ జై అని అన్నారు. మిగతా టీచర్లందరూ జై అని పిల్లలతో సహా ఉద్విగ్నంగా అరిచారు.


ఏ గుర్తింపునూ పొందకపోయినా, దేశభక్తితో నిండిన ఆమె హృదయం భారత దేశ జెండాను సగర్వంగా తడుముతూ ఆనందించింది.


ఆమె మెల్లిగా అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్ళింది. ఆమె అడుగు జాడల్లో నడవడానికా అన్నట్టు అందరూ ఆమెకు నమస్కరించారు.



Rate this content
Log in

Similar telugu story from Abstract