Kiran Vibhavari

Horror

4.6  

Kiran Vibhavari

Horror

దెయ్యం

దెయ్యం

5 mins
3.0K


"మీరెప్పుడైనా దెయ్యాన్ని చూసారా?" ఆర్ జే గాయత్రి శ్రోతల్ని అడుగుతోంది. ఇదేదో ఇంట్రెస్టింగ్ విషయంలా అనిపించి రేడియో వాల్యూం పెంచాడు రాహుల్. అతడు జాతీయ రహదారి 65లో విజయవాడకు ఒంటరిగా వెళుతున్నాడు. చుట్టూ పరిసరాలలో ఒక్క వాహనం లేదు. చీకట్లు అలుముకుంటున్నాయి. పక్షులు తమ తమ గూళ్లకు చేరుకుంటున్నాయి.


మనసులో ఏదో మూల భయమున్నా "పాతికేళ్ళ కుర్రాడ్ని. నేను దెయ్యాల గురించి భయపడటం ఏంటి" అని కొట్టి పారేశాడు. దారిలో సంతోష్ ధాబా దగ్గర తన ఫ్రెండ్ శ్రీకాంత్ ని ఎక్కించుకుని వెళ్లాలనే తొందరలో కారు వేగంగా నడుపుతున్నాడు. 


చిన్నప్పుడెప్పుడో వినేవాడు దెయ్యాల కథలు ఇప్పుడు ఈ రేడియో పుణ్యమా అని మళ్లీ వినగల్గుతున్నా అని మురిసిపోతూ సరదాగా వింటున్నాడు. 

మెల్లమెల్లగా సూర్యుడు కిందకి జారిపోతూ ఉంటే రేడియో శ్రోత చెప్పే కథ విందాం అని చెవులు రిక్కరించి వింటున్నాడు. 

" హెల్లొ అండి నా పేరు ఆచారి." అవతలి వ్యక్తి చెప్పాడు.

"హెల్లొ ఆచారి గారు. మీరు దెయ్యాన్ని నమ్ముతారా?" rj గాయత్రి అడిగింది.

"అందుకే కదండి ఫోన్ చేశాను."

"ఓ అవునా, చాలా మంచిది ..అసలే ఈ రోజు అమావాస్య, బయట చీకటి పడుతూ చిరు జల్లులు కురుస్తున్నాయి. చెప్పండి మీ అనుభవం" రాగాలు తీస్తూ అడిగింది.

" నేను ఒక రోజు NH 65 లో విజయవాడ వెళ్తున్నా అండి. ఆ దారిలో ఒక అడవి ఉంది. దానిని ఆనుకునే ఒక స్మశానం ఉంటుంది. అక్కడ స్మశానం ఉన్నట్టు ఎవ్వరికీ తెలియదు. నాకూ తెలియదు మా ఫ్రెండ్ చెప్పెంతవరకు. ఆ స్మశానం దగ్గర ఇప్పటివరకు చాలా ప్రమాదాలు అయ్యాయనీ, ఎంతో మంది చనిపోయారని , ఆ చనిపోయినవారు తమని పిలుస్తారని అటువైపుగా వెళ్లే వాళ్ళు చాలామంది చెప్పారట." ఆచారి చెప్పుకుంటూ పొతే

"అవునా ఇంతకీ మీరు దెయ్యం చూశారా" గాయత్రి అడిగింది.

"అబ్బ నన్ను చెప్పనివ్వండి ..మధ్యలో మాట్లాడొద్దు ప్లీజ్" రిక్వెస్ట్ చేసాడు

"ఓకే ఓకే ... కాం ..ఏం మాట్లాడను.." ఆమె బదులిచ్చింది.

"అయితే ఆ రోజు అమావాస్య, రాత్రి కావొస్తోంది. స్వతహాగా దెయ్యాల్ని నమ్మను. అందుకే మా ఫ్రెండ్ మాటల్ని పట్టించుకోలేదు."

రాహుల్ కి చిత్రంగా అనిపించింది. అతనుకూడ అదే దారిలో వెళ్తున్నాడు. ....అది కూడా అమావాస్య రోజున..ఇదేదో బాగుందే అనుకుని మిగతా కథ వింటున్నాడు.

ఆచారి చెపుతూ పోతున్నాడు. " అయితే స్మశానం దగ్గర ఉన్నట్టుండి ఒక్కసారి మెరుపులు వచ్చాయి. ఏవో కూతలు వినిపించాయి. దెయ్యాన్ని చూడాలని నాకు ఆశగా ఉంది. ఎవరైనా కనిపిస్తారేమో అని చుట్టూ చూసా. చెట్లు తప్పా ఏవి లేవు. స్ట్రీట్ లైట్స్ కొట్టుకుంటున్నాయి. చల్లటి గాలికి చిరుజల్లులు తోడయ్యాయి. ఇక స్మశానం దాటేoతలో ఒక లారీ కనిపించింది. ఆ లారీ డ్రైవర్ ఇంకా క్లీనర్ అనుకుంటా కొద్దిదూరంలో లారీ రోడ్డు పక్కగా ఆపి కూర్చున్నారు. నా కారులో పెట్రోల్ అయిపోవచ్చింది. దగ్గరలో పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందో కనుక్కుందాo అని వారి ముందు కారు ఆపి పెట్రోల్ గురించి అడిగాను. వాళ్ళు నన్ను అదోలా చూస్తూ ఉన్నారు. వాళ్ళ కళ్ళముందు చెయ్యి ఆడించి, మళ్లీ అడిగాను. వాళ్ళు స్మశానం వైపు చెయ్యి చూపించారు. నాకేం అర్థం కాలేదు. రా బయటకు రా మేము తీసుకు వెళతాం అంటూ ఏదోలా నవ్వారు. నాకు వాళ్ళ నవ్వు నచ్చలేదు. వీళ్ళను చూస్తే దొంగల్లా అనిపించారు. అసలే ఒంటరిగా ఉన్నాను. ఏదైనా అఘాయిత్యం జరిగితే? ఎందుకొచ్చిన రిస్క్ అని కారు స్టార్ట్ చేసుకుంటూ ముందుకు కదిలాను. వాళ్ళు నన్నే చూస్తూ ఉన్నారు. రేర్ వ్యు మిర్రర్ లో వాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నారు. వీళ్లవల్ల ఏదైనా అపాయం ఉంటుందని వీళ్ళ లారీ నంబర్ ఫోటో తీద్దాం అని లారీ ముందు కారు ఆపాను. అక్కడి దృశ్యం నా కళ్ళతో నేనే నమ్మలేదు." అతడు చెప్తుంటే,

"ఏమైందండి" గాయత్రి అడిగింది.


అబ్బ కథ మంచి పట్టు మీద ఉన్నప్పుడు మధ్యలో ఈ పిల్లోకటి అనుకున్నాడు రాహుల్.


ఆచారి కొనసాగించాడు " ఆ లారీ ముందు భాగంలో వాళ్ళిద్దరూ చచ్చి పడివున్నారు. నేను లారీలో వాళ్ళ శవాలను, బయట వాళ్ళ ఆత్మలను చూస్తూ కొయ్యబారిపోయాను. వాళ్ళు నన్నే చూస్తూ నిల్చున్నారు. నేను క్షణం ఆలస్యం చెయ్యకుండా కారు స్టార్ట్ చేసి వేగంగా వెళ్ళిపోయాను. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ కి చెబితే నివ్వెర పోయారు. 


 అక్కడ ఒకప్పుడు అడవి ఉండేదని అదంతా కొట్టేసి అక్కడి తండా వాళ్ళను చంపేసి, కొందరిని వెళ్లగొట్టి, అక్కడ రోడ్డు వేశారని. ఆ స్మశానం ఆ తాండా వారిదని. అక్కడ రోజు రాత్రి పూట దెయ్యాలు కనిపిస్తాయని అవి ఒక్కోసారి చంపేస్తాయని లారీ డ్రైవర్ లూ కథలు కథలుగా చెప్పుకుంటారని మా ఫ్రెండ్ చెప్పేసరికి నేనెంత ప్రమాదం నుండి బయట పడ్డానో తెలిసి మచ్చేమటలు పట్టేసాయంటే నమ్మండి." అంటూ ఆచారి ముగించాడు. 


గాయత్రి ఇంకా ఆ కథ నుండి బయటకు రాలేదేమో ఇంకేం మాట్లాడకుండా వెంటనే ఒక పాట వేసేసింది.


రాహుల్ బుల్షిట్ అని నవ్వుకుని విజిల్ వేసుకుంటూ సాగిపోతున్నాడు. 

  దారిలో స్మశానం వచ్చింది. ఆచారి కథను తలుచుకుంటూ నవ్వుకున్నాడు. అర్ధం కానిదేదో గట్టిగా అరిచాడు.


నిజానికి మనిషికి భయం వేసినప్పుడు ఇలా అరుస్తాడు నవ్వుతాడు భయం లేనట్లు నటిస్తాడు. రాహుల్ పరిస్థితి అదే. మొదటిసారి అతనికి భయం వేస్తోంది. కారు వేగం పెంచాడు. స్మశానం వచ్చింది. అదేంటో సడన్ గా కారు ఆగింది. రాహుల్కు చమటలు పట్టాయి. కారు దిగి చూసాడు. ఇంజన్ హీట్ ఎక్కింది..ఏం చెయ్యాలో అర్దం కాలేదు సమయానికి నీళ్ళు కూడా లేవు. అతని గొంతు ఎండిపోతోంది. ఏం చెయ్యాలో అతనికి పాలు పోవట్లేదు.

వింత వింత కీటకాలు అరవడం మొదలు పెట్టాయి. అవి అరుపుల్లా లేవు ఏదో తెలియని ఏడుపులా ఆ చిక్కటి చీకటిలో, ఆ నిశ్శబ్దపు రేయిలో గట్టిగా వినిపిస్తున్నాయి. వాటి అరుపులు రోత పుట్టిస్తున్నాయి. చిరుజల్లు మొదలైంది. అడవివైపే మెరుపులు మెరిసాయి. ఆ మెరుపులుకి ఉరుములు తోడయ్యి వాతావరణం భయంకరంగా ఉంది. 


చచ్చినోడు ఈ రోజు అమావాస్య కావాలా!? పోని ఆ రేడియో లో ఈ రోజే దెయ్యాల గురించి మాట్లాడాలా!? పోని అది కూడా తానెందుకు వినాలి. దేవుడా నన్ను రక్షించు. మొదటిసారి దేవుడ్ని మొక్కుకున్నాడు. వాహనాలు వస్తూ పోతూ ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి ఆపట్లేదు. చిమ్మ చీకటి తన ఫోన్ టార్చ్ వెలుగులో వాహనాల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. అతని షర్ట్ మీద ఎముకల బొమ్మతో డేన్జర్ అని పెద్దగా రాసుంది. అందుకేనేమో ఎవ్వరూ అపట్లేదు. ఆపని వాహనాల్ని తిట్టుకుంటూ, కాళ్ళను రోడ్డుకు తన్నుకుంటూ ఉన్నాడు. వాళ్లూ ఇతన్ని దెయ్యం అనుకుని ఉండొచ్చునేమో.

   రాక రాక ఒక కారు తనకోసమే అన్నట్టు మెల్లిగా వచ్చింది. దానికి లైట్స్ లేవు. ఏదో ఒకటి చచ్చినోడి పెళ్లికి ఏదైతే ఏంటని, గబ గబ కారు ఎక్కేసాడు. డ్రైవర్ కి థాంక్స్ చేపుదామని పక్కకు చూసాడు. డ్రైవర్ లేడు. కానీ కారు ముందుకి పోతూ ఉంది. ఆ ప్రాంతం కిందకి ఉండటంతో కారు కొంచెం వేగంగా పోతోంది. రాహుల్ కి పై ప్రాణాలు పైనే పోయాయి.. కిందకి దూకేద్దాం అని డోర్ తెరవబోయాడు. ఒక పెద్ద చెయ్యి వచ్చి అడ్డు వేసింది..ఆ చెయ్యి సున్నంలో ముంచి తీసినంతగా తెల్లగా ఉంది. చీకట్లో కూడా మెరుస్తూ కనబడింది ఆ చెయ్యి.


 అతడు గట్టిగా అరవడానికి ప్రయత్నించాడు. కానీ ఎందుకో మాట పెగట్లేదు. భయనికేమో మాట నోట్లోనే ఆగిపోయింది. తన ఫోన్ వెలుగులో డోర్ బయటకు చూసాడు చెయ్యి లేదు మళ్లీ బయటకు దిగుదాం అనేలోపు మళ్లీ ఆ పెద్ద చెయ్యి వస్తోంది. 


రాహుల్ కి ఏడుపు మాత్రమే తక్కువ. ఏం చెయ్యాలో పాలు పోవట్లేడు. ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని. అభిషేకం చేస్తానని మొక్కుకున్నాడు. ఆ స్వామి మహిమో మరేమో స్మశానం దాటి మెయిన్ రోడ్డు మీదకు వచ్చే సరికి కారు ఆగింది. చేతుల్లేవు. ఇక క్షణం ఆలోచించకుండా వెనక్కి తిరిగి చూడకుండా పరుగు లంకించాడు..


 ఏవో ఆపసోపాలు పడుతూ సంతోష్ ధాబాకి చేరుకున్నాడు. తనకోసం ఎదురుచూస్తున్న శ్రీకాంత్ కి జరిగిందంతా చెప్పాడు. ఎప్పుడు దెయ్యాల్లేవు దేవుడులేడనే తన ఫ్రెండ్ ఇలా దెయ్యం గురించి చెప్తుంటే అతనికి నమ్మబుద్ధి కాలేదు. భయం ఎంతవారినైనా మారుస్తుందంటే ఇదే మరి అనుకుంటూ బిగ్గరగా నవ్వాడు.


" ఒరేయ్ నువ్వు భయపడ్డావా హీ హి హి" ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. ఆ నవ్వు విని ఆ ధాబాలో ఉన్న వారంతా వీళ్లనే చూసారు.


అంతలో ఇద్దరు బలిష్టమైన సర్దార్ లు వీళ్ళను సమీపించి " ఒరేయ్ ఎర్ర చొక్కా డేన్జర్ బొమ్మ!.. ఏంట్రా మేము కారు ఆగిపోయిందని కష్టపడి కారు తోస్తుంటే ఎంచక్కా మహారాజులా కారెక్కి కనీసం థాంక్స్ కూడ చెప్పకుండా పోతావా" అంటూ తన్నడం మొదలు పెట్టారు. శ్రీకాంత్ వాళ్ళను ఆపి కొంత డబ్బిచ్చి పంపించేసాడు. విషయం అర్ధం అయ్యి ఇంకా నవ్వసాగాడు. 


రాహుల్ కి భయం కొద్ది కొద్దిగా దూరంగా అయ్యింది. అంటే ఆ కారు లో దెయ్యం లేదా.. డామిట్ కథ మొత్తం అడ్డం తిరిగింది...ఎంత భయపడ్డాను?!!...ఇదంతా ఆ రేడియో ఆచారి వల్లే దరిద్రుడు భయపెట్టాడు.


"ఒరేయ్ అలా తిట్టకురా ..వాడెవడో కాదు నేనే.. బోర్ కొడుతుంది అని చిన్న కథ అల్లాను.... నమ్మేసావా... యూ ఫూల్" ఇంకా బిగ్గరగా అరవసాగాడు.

ఇప్పుడు రాహుల్ చేతిలో తన్నులు తినడం శ్రీకాంత్ పని అయ్యింది.




Rate this content
Log in

Similar telugu story from Horror