Kiran Vibhavari

Inspirational Others

5.0  

Kiran Vibhavari

Inspirational Others

తప్పంటారా?

తప్పంటారా?

2 mins
34.8K


"నీకు తెలుసా నా అభిమాన నటుడు తన పేరుకు ముందు తన తల్లి పేరు పెట్టుకున్నాడు. " నా స్నేహితురాలు అనూష గొప్పగా చెప్పింది.


"బోడి...నా అభిమాన నటుడు అయితే సినిమా మొదలయ్యేటప్పుడు వచ్చే టైటిల్స్ లో ముందు హీరోయిన్ పేరు వచ్చాకే అతని పేరు వచ్చేలా చేశాడు. ఎంత దయా హృదయుడు కదా!! అందుకే జన్మ జన్మలకూ అతడికే నేను ఫ్యాన్" మరో స్నేహితురాలు కల్పన అబ్బురపోతూ చెప్పుకొచ్చింది.



నాకు ఏం చెప్పాలో తెలియక, ఈ పీత బుర్రలకు ఇంతకు మించి ఆలోచించే జ్ఞానం లేదని ఫిక్స్ అయిపోయి, "మరి మీ అభిమాన నటులు తోటి హీరోయిన్స్ కన్నా ఎక్కువ పారితోషకం ఎందుకు తీసుకుంటున్నట్టు!!?! ఇద్దరూ కలిసే కదా పని చేస్తున్నారు. ఇద్దరిదీ ఒకటే కష్టం. అలాంటప్పుడు మీ స్త్రీ వాదులైన ఆ హీరోలు హీరోయిన్లు కన్నా తక్కువ డబ్బులు తీసుకుని, తమ సమానత్వాన్ని చాటు కోవచ్చు కదా. ఏం పేరు పెట్టుకోడానికి ఒప్పుకున్న నిర్మాత దీనికి ఒప్పుకోడా!? " నేను వ్యంగ్యంగా నవ్వుతూ అడిగేసరికి తెల్ల మొహాలు వేశారు ఇద్దరు.  



వీళ్ళే కాదు మనం కూడా చాలా సార్లు సమానత్వం అంటే ఏంటో తెలుసుకోకుండానే , సమానత్వం కోసం ప్రాకులాడుతాం. ఏవేవో కొత్త భాష్యాలు ఆపాదిస్తూ ఉంటాం. అసలు సమానత్వం అనేది ఉందా?? అది అంత అవసరమా?? అన్ని విషయాలకు దాన్ని అపాదించేద్దామా??

ఆడ, మగ ఇద్దరూ కలిసే కదా ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. మరి ఎందుకు ఆడదాన్ని వెనకే ఉంచేసారు? దీనికి సమాధానంగా మన కుటుంబ వ్యవస్థ గురించి చెప్పుకోవచ్చు. ఆదిమానవుడుగా ఉన్నప్పుడు ఆడా మగా ఇద్దరూ కలిసి వేటకు వెళ్లారు కానీ ఎప్పుడైతే, నాగరికత ఏర్పడిందో అప్పుడు కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పడింది. ఆడవారు ఇంటిపట్టునే ఉంటూ పిల్లల బాధ్యతను కుటుంబ బాధ్యతను తీసుకున్నారు. మగవాడు ఆహార వస్తు సంపాదనకు వెళ్ళాడు. క్రమేపీ సున్నిత పనులకు అలవాటు పడిన ఆడవారు 


మగవాడి కంటే అల్పులమని భావించ సాగారు. ( దీనికి ఉదాహరణగా చెప్పాలంటే , గిర్ ఫారెస్ట్ ఆసియా సింహాలకు ప్రసిద్ధి. అయితే పర్యాటకులు విసిరే ఆహారానికి అలవాటు పడిన సింహాలు, వాటి పిల్లలు వేటను, తమ గంభీరత నూ మర్చిపోతున్నాయి అని అక్కడి నిర్వాహకులు తెలిపారు. మరి మనం కూడా ఈ సామాజిక వ్యవస్థలో పడి మన అసలైన అస్తిత్వాన్ని కోల్పోయామా??!)

 దీనికి మనిషి ఏర్పరుచుకున్న సంప్రదాయాలు, గ్రంధాలు , కట్టుబాట్లు కూడా ఒకింత కారణమే. వాటిని విమర్శిస్తే వాటికి నిగూఢ అర్థాలు వెలికి తీసేవారు ఇప్పటికీ కోకొల్లలు. ( మొన్న ఒక మేధావి పీరియడ్స్ సమయంలో ఆమె వంట చేస్తే కుక్కగా , పందిగా పుడుతుంది అంటే దానిని ఖండించాల్సింది పోయి, చంకలు గుద్దుకుని మరీ ఆ సదరు వ్యక్తి ఆలోచనను సమర్థించిన వాళ్ళు ఉన్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని ఈ మాట చెబుతున్నా.. )

ఇంతకీ సమానత్వం అంటే ఏమిటి?? మగవాడు ఆ పని చేశాడు కాబట్టి నేనూ కూడా చేస్తాను అని పూనుకోవడమా?? లేదంటే అతడు తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, విశృంఖల చేష్టలు చేస్తున్నాడు. మరి మేము చేస్తే తప్పేంటి అని చొక్కాలు విప్పుకుని తిరగడమా?? 

నిజమైన సమానత్వం అంటే నిన్ను నువ్వు నమ్మడం. నువ్వు ఎవరికీ తీసిపోవని గుర్తించడం. లింగ బేధం లేకుండా ఉండే సమ సమాజ నిర్మాణం. నువ్వు ఆడదానివో మగవాడివో అని కాదు. నువ్వు ఒక మనిషివి అని నిన్ను నువ్వు గుర్తించడం.






ప్రపంచ జనాభాలో సగం మంది ఆడవారు ఉన్నారు. ఇప్పటికీ చాలా మంది వంటింటికి పరిమతమౌతూ, చేత కాని వాళ్ళలా ఏటువంటి ఉత్పత్తి లేకుండా, కేవలం పిల్లల్ని కని పెంచే యంత్రాలుగానే తమ బతుకు ఈడుస్తున్నారు. మరి వాళ్లలో ఉన్న శక్తి ఇలా నిరుపయోగం అవుతోంది అంటే, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా వెనకబడుతుంది అని అర్థం చేసుకోవాలి. మరి వారి గురించి పోరాడే బాధ్యత మనకు లేదంటారా?? ఈ పోరాటం తప్పంటరా??


Rate this content
Log in

Similar telugu story from Inspirational