Kiran Vibhavari

Inspirational Others

4.3  

Kiran Vibhavari

Inspirational Others

కన్యత్వం

కన్యత్వం

4 mins
35.2K


అదో మారు మూల పల్లెటూరు. పట్నం పోకడలు అంతగా తాకని చిన్న ఊరు. ఆ అందమైన ఊరిలో ఓ అందమైన కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి మగపిల్లవాడి కనాలని ఎంత ఆశో! ఆ ఆశకు తగ్గట్టుగా నలుగురు మగపిల్లలు పుట్టారు ఆ ఇంట్లో. చివరాకర్లో ఓ అందమైన అమ్మాయి పుట్టింది. పేరు కస్తూరి. చురుకుదనంతో పాటు తెలివితేటలను పుణికి పుచ్చుకున్న పుత్తడి బొమ్మ.  


కానీ ఆమె చేసిన ఒకే ఒక్క నేరం ఆడపిల్లగా పుట్టడం. పాపం ఆ నేరానికి శిక్ష వేస్తూ అడుగడుగునా ఆంక్షలు , కట్టుబాట్లు. ఆ బట్టలు వేసుకోకు, అలా ఎక్కువగా నవ్వకూ.. మగవారితో మాట్లాడకు... చీకటి పడ్డాక బయటకు తిరగకు. మగవారి వైపు చూడకు. గెంతులు వెయ్యకు...ఆడుకోకు ఇలా ఎన్నో ఎన్నెన్నో. పాపం ఆ పిల్లకు మాత్రం ఉండదా ఎగిరే గువ్వలా ఈ అనంత విశ్వంలో విహరించాలని, తన ఆశలకు కలలకు కొత్త రెక్కలు తొడగాలని!! ఏంటో ఈ పిచ్చి ప్రపంచం ఆడదాని కోరికల చిట్టా అస్సలు పట్టించుకోదు. వారి మనసు నిండా ఉన్న ఆశలు ఎవ్వరికీ అక్కర్లేదు.


కానీ కస్తూరికి ఉన్నదల్లా ఒకటే ఒక్క కోరిక. తనో పెద్ద చదువు చదివి, ఆ ఊరి కలెక్టరమ్మలా , హుందాగా ఆ ఊరికి వచ్చీ తనవాళ్ళ ముందు దర్పంగా తిరగాలని. ఆడపిల్లకు తిండి ఖర్చే ఎక్కువ అనుకునే ఆ ఇంట్లో, ఆమె తన పంతం నెగ్గించుకోవాలి అంటే పెద్ద యుద్ధమే చెయ్యాల్సి వచ్చింది. ఆ గ్రామంలో ఉన్న బడి పదవ తరగతి వరకే. మరి ఆపై చదువుకోసం పొరుగూరు వెళ్లాల్సిందే. వారికి ఇష్టం లేకున్నా, వారిని ఒప్పించి పట్నం వెళ్లి చదువుకుంది. 


రెండు ఏళ్ళు ఇట్టే గడిచి పోయాయి. ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయిన కస్తూరి తన వాళ్ళను కలవాలని ఊరికి వచ్చింది. ఆమె వచ్చీ రాగానే తండ్రి ఒక పిడుగు లాంటి వార్త చెప్పాడు. ఆమెకు పెళ్లి కుదిరింది అని. తన ఆశలకు, ఆశయాలకూ అడ్డుకట్ట వేస్తూ ఆమెను బలవంతంగా, పెళ్లి పీటలు ఎక్కించారు. బతిమలాడింది.. వెక్కి వెక్కి ఏడ్చింది.. కాళ్ళా వేళ్ళా పట్టుకుంది.. తనను కలెక్టర్ చేయమని వేడుకుంది... ఇంకా ఎన్నో ఎన్నో చేసింది. అవేవీ ఆ కన్నవాల్లు పట్టించుకోలేదు. ఆమెకు పెళ్లి చేసేసి గుండెల మీద కుంపటి దించేసుకున్నాము అనుకున్నారు.  


పట్నంలో ఉండే అత్తమామలు ఏరి కోరి ఈ పల్లెటూరి పిల్లను తెచ్చుకున్నారు. భర్త చదువుకున్నవాడే అయినా, అతడు కూడా పల్లెటూరి పిల్ల అయితే అణిగిమణిగి ఉంటుంది. చెప్పిన మాట వింటుంది. ఇంట్లో పని మనిషి లాగా, కుక్కిన పేను లాగా పడి ఉంటుంది అని మనసు చంపుకొని చేసుకున్నాడు. పెళ్లి అనేది చాలా వరకు వ్యాపారమే కదా. అది ఆ పల్లెటూరి పిల్ల గొప్పతనమో!! మరి అదృష్టమో!! ఊరి జనం మాత్రం ఇంత గొప్పింటి సంబంధం వెతుక్కుని వచ్చేసరికి కస్తూరి చాలా అదృష్టవంతురాలు అని , తమకా అదృష్టం రాలేదని తెగ ఇదైపోయారు. ఏదోలా పెళ్లి జరిగిపోయింది. 18 సంవత్సరాలు నిండని కస్తూరి మెట్టినింట అడుగుపెట్టింది. అప్పటివరకు మగవాడి స్పర్శ అంటే తెలియని ఆ కన్నె పిల్ల, భయం భయంగా శోభనం గదిలోకి పాల గ్లాసు పట్టుకుని వెళ్ళింది. ఆమె రాక కోసం ఎదురు చూస్తున్న వాడిలాగా ఆమె భర్త గబుక్కున వెళ్లి ఆమె భుజాలు పట్టుకుని లాక్కు వచ్చి మంచం మీద పడేసాడు. ఒక చేత పాల గ్లాసు ఒలగకుండా జాగ్రత్తగా పట్టుకుని, తనను తాను సంభాలించుకుంటూ, జాగ్రత్తగా మంచం మీద కూర్చుంది.  


అతడు తలుపు గొళ్ళెం పెట్టీ, ఆమె తెచ్చిన పాలు గబుక్కున తాగేసీ, ఆమె మీద పడి ఆక్రమించేసుకున్నాడు. ఇక్కడ ఆమె అనుమతి అతనికి అవసరం లేదు. ఎందుకంటే తాళి కట్టాడు కదా. ఫ్రీ లైసెన్స్ వచ్చేసింది. కలయిక అంటే ఏంటో కూడా తెలియని కస్తూరి, అదే ప్రేమ అనుకుని, తన భర్త చెప్పినట్టే చేసింది. నిజానికి ఆమెను గదిలోకి పంపిన అమ్మలక్కలు చెప్పినట్టే మౌనంగా అతడికి సహకరించింది. ఆమెకు ఏదో తెలియని నొప్పి ఉన్నా, శరీరం అంతా అతని గోళ్ళ గాటులతో నిండిపోయినా మూగగా ప్రేమంటే ఇదే ఏమో అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. 

కొత్త ఇల్లు కదా... అది కూడా తనవారందరికి దూరంగా ఉండేసరికి పొద్దున్నే మెలుకువ వచ్చేసింది. ఏం చేయాలి?? ఎక్కడికి వెళ్ళాలి?? కాలకృత్యాలు తీర్చుకుని రావాలంటే ఎవరి అడగాలో తెలియని మొహమాటం తో భర్త ఎప్పుడు లేస్తాడా అన్నట్టు అతన్ని చూస్తూ కూర్చుంది. బయటకు వెళ్లాలంటే ఏదో తెలియని సిగ్గు. 

అంతలో తలుపు చప్పుడైంది. ఆ చప్పుడుకు నలిగిన చీరను సవరించుకుని లేచి వెళ్ళబోయెంతలో, భర్తకు మెలుకువ వచ్చేసింది. అతడు కూడా లేచి బట్టలు వేసుకున్నాడు. కస్తూరి తలుపు తీసింది. ఎదురుగా భర్త తల్లి..అదే కస్తూరి అత్తగారు. నవ్వుతూ లోపలికి వచ్చి, మంచం మీద ఏదో వెతికింది. ఆమె వెతికింది దొరకలేదు ఏమో...మొహంలో చిరాకు తెచ్చుకుని, కొడుకుని కళ్ళతో ఏదో ప్రశ్నించింది. అతడు లేదన్నట్టు సైగ చేశాడు. అత్తగారు అనుమానం తీరక కస్తూరిని వెనక్కి తిప్పి, ఆమె తెల్లని చీరను, ఆమె పిరుదులను నొక్కి నొక్కి చూసింది. ఎక్కడా ఆమెకు కావలసింది కనిపించలేదు. దాంతో అంతవరకూ ప్రశాంతంగా ఉన్న అత్తగారు ఉన్నఫలనా కస్తూరి జెబ్బ పట్టుకుని బయటకు లాగి, అక్కడున్న అమ్మలక్కల మధ్యలో నించోబెట్టి, "చూసారా...బజారు దాన్ని అంట గట్టారు మాకు. ఇది శీలవతి కాదు. దాని చీర మీద చిన్న మరక లేదు. కనీసం వారి దుప్పటి మీద కూడా నెత్తుటి చుక్క లేదు. మీరైనా న్యాయం చెప్పండమ్మా ..నా కొడుక్కి ఏరి కోరి పల్లెటూరి పిల్లను ఇచ్చి చేశాను. ఎందుకు?? వాల్లైతే పెళ్లికి ముందు ఎవరితోనూ తిరగరు. పద్ధతిగా ఉంటారు అనే కదా.. ఇప్పుడు ఇలాంటి కులతను తీసుకు వచ్చి, నా కొడుకు జీవితాన్ని బుగ్గిపాలు చేసానమ్మా.."గుండెలు బాదుకుంటూ ఏడ్వ సాగింది. కస్తూరి కి ఒక్క నిమిషం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. 

మిగిలిన అమ్మలక్కలకు కూడా ఒక్కొక్కరు కస్తూరి వెనక వచ్చి ఆమె చీర చూస్తూ, ఆమె పిరుదుల వైపు చూస్తూ నోళ్ళు నొక్కుకున్నారు. కస్తూరి కి తల కొట్టేసినట్టు అయ్యింది. ఆమెకు తెలియకుండానే కళ్ళలోకి నీళ్ళు చేరాయి.


"లేదు అత్తమ్మ నాకు ఇంతకు ముందు ఎవరితోనూ సంబంధం లేదు నన్ను నమ్ము అత్తమ్మ.." అంటూ అత్తగారి కాళ్లు పట్టుకుంది. ఆవిడ చీ కొట్టింది. అమ్మలక్కలు కూడా నోటికొచ్చి నన్ని మాటలు అనేసారు. కస్తూరి హృదయం వారి మాటలకు ఇంకా కృంగి కృశించి, పరుగు పరుగున వెళ్ళి ఎదురుగా ఉన్న బావిలో దూకేసింది. ఈ హఠాత్పరిణామానికి పెళ్లి కొడుకుతో సహా అందరూ తెల్లబోయారు. వెంటనే తేరుకుని ఇద్దరు పనివాళ్ళు బావిలో దూకి, ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఆలస్యం అయిపోయింది ఆమె కాళ్ళకు పారాణి ఆరక ముందే కొత్త పెళ్ళికూతురు శవమై తేలింది. ఇది ఒక్క కస్తూరి కథ కాదు. ఇలాంటి కస్తూరి లు ఇంకా చాలామంది ఉన్నారు. హైమన్ పొర/ కన్నెపొర ఆటల్లో కూడా చిరిగి పోతుంది అని తెలియని మూర్ఖులు ఇటువంటి పరీక్షలు ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇప్పటికీ కస్తూరి లాంటి ఆడవాళ్లు తన నిజాయితీని నిరూపించుకోవడానికి అగ్నిపరీక్షలు కాకపోయినా అంతకన్నా ఎక్కువే అనుభవిస్తున్నారు. అగ్ని పరీక్ష దీనికన్నా మెరుగైంది. ఎందుకంటే వీళ్ల మాటల తూటాలను ప్రతినిత్యం అనుభవించే దానికన్నా నాఒక్క నిమిషంలో కాలి బూడిద అవ్వడం నయం కదా. 


 పురాణకాలం నుండి ఆడదానికి మాత్రమే శల్య పరీక్ష. ఏం మగవాడికి శీలము ఉండదా?? శీలం అంటే ఆడదాని సొత్తు మాత్రమేనా? మణిరత్నం సినిమాల్లో నాకు విలన్ సినిమా చాలా ఇష్టం. అది ఒక పురాణగాధను పోలి ఉంది. అందులో హీరో తన భార్యను విలన్ ఎత్తుకుపోతే, ఆమె శీలాన్ని శంకించి నిన్ను ఎలా పరీక్షించాలి అని అడుగుతాడు. అందుకు ఆమె మరి నువ్వు కూడా నాకు దూరంగానే ఉన్నావు కదా మరి నిన్నెలా పరీక్షించాలి?? అని ఎదురు ప్రశ్నిస్తుంది.  ఇది వినడానికి చిన్నదే అయినా ఎంతో అర్థం ఉంది. అతడికి మాత్రం శీలము ఉండదా ?? అతడిని మాత్రం పరీక్షించవద్దా?? అతడినీ ఎందుకు మాటల శరాలతో గాయం చెయ్యరు?? ఓహ్ ... మర్చిపోయాను అతడు మగవాడు కదా. 


Rate this content
Log in

Similar telugu story from Inspirational