kottapalli udayababu

Classics Inspirational Children

3.6  

kottapalli udayababu

Classics Inspirational Children

బొమ్మరిల్లు !!!(కధ)

బొమ్మరిల్లు !!!(కధ)

7 mins
394



''నాన్నమ్మా...ఎలా ఉన్నావ్?" కవ్వంతో వెన్న చిలుకుతున్న పరమేశ్వరి హటాత్తుగా మనవడి రాకతో ఉలిక్కిపడింది.

"ప్రభూ...నువ్వేనా నాన్న? ఈ నాన్నమ్మ ఇపుడు గుర్తువచ్చిందా? ఎపుడు నాలుగు రోజులు ఉండేలా పంపమన్నా 'వాడి చదువు పోతుంది. ఆదివారాలు కూడా వాడికి క్లాసులుంటాయి ' అని మీ నాన్న ఒకటే గోల పెట్టేవాడు.అలాంటిది నా మనసెరిగి ఇన్నాళ్ళకు నిన్ను పంపించాడన్నమాట." చేస్తున్న పని ఆపి లేచి ఆమె ప్రభాత్ బుగ్గలు చిదిమి 'నా బంగారు కొండ' అని ముద్దాడింది.

ఊహించని విధంగా ప్రభాత్ నాన్నమ్మని కరుచుకుపోయాడు.

" నాన్న పంపించలేదు నాన్నమ్మా...నేను ...నేనే చెప్పకుండా వచ్చేసాను."

పరమేశ్వరి విస్తుబోయింది.

" ఏమిటీ? చెప్పకుండా వచ్చేసావా? నాన్న, అమ్మ ఎంత కంగారు పడతారో తెలుసా?" ఆదుర్దాగా అడిగింది ఆమె ప్రభాత్ ని.

"పడనీ.పడాలి నాన్నమ్మా...పదో తరగతి వరకు వారి ఇష్టం. కాని ఇంటర్ కు వచ్చాకా మా పిల్లల ఇష్టాలతో పని లేకుండా వారి ఇష్టాలను మా మీద రుద్దుతానంటే ఊరుకునే తరం కాదు మాది. నిజానికి ఇక్కడకు కూడా రాకుండా చచ్చి పోదామనుకున్నాను. కానీ అపుడపుడు నువ్వు చెప్పే మాటలు, నాలో కొత్త ఉత్తేజాన్ని, నువ్ రాసే ఉత్తరాలు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. 'కోపం వచ్చి ఏదైనా ఒక పని చేసేముందు ఒక్క క్షణం ఆలోచించు ' అని నువ్ ఒకసారి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఈ విధంగా అయినా నిన్ను చూడవచ్చు అనే ఉద్దేశంతో వచ్చేసాను నాన్నమ్మా..తప్పు చేసానా?" అడిగాడు ప్రభాత్ గారంగా. 

ఆమె మనవడి బుగ్గలు చిదిమి తనచేతిని తానే ముద్దు పెట్టుకుంది.

" నా దగ్గరకు వచ్చి మంచి పని చేసావ్ నాన్న. దేవుడు అందమైన మానవ జీవితాన్ని ఇచ్చింది ఒక పరమార్ధం సాధించడానికి. సృష్టిలో మనం పనికిరావనుకున్న ఎన్నో మొక్కలు వైద్యం లో పనికి వస్తాయి. అలాగే మిగతా జీవులు కూడా!..జీవితం మీద విసిగి విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఎందఱో, కనీస జీవిత సత్యాలు తెలీక, పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు అని తెలుసుకోలేక, అర్దాంతరంగా జీవితాల్ని ముగించుకుంటున్నారు. ప్రతీ పుస్తకం లోను మంచో చెడో ఉంటుంది.మంచి పుస్తకం చదివితే ఎలా మన జీవితాన్ని మలచుకోవాలో తెలుస్తుంది.అదే చెడ్డ పుస్తకం చదివితే మనం ఎలా బ్రతకకూడదో చెబుతుంది. ఈ సున్నిత విషయం గ్రహించే తీరిక, ఓపిక ఈవేళ సమాజంలో దాదాపు లేదనే చెప్పాలి. ముందు స్నానం చేసిరా.టిఫిన్ పెడతాను." అందామే కామన్ బాత్రూం బయట తలుపు పక్కన గీసర్ ఆన్ చేస్తూ.

" సరే. " భుజాన ఉన్న బాగ్ తీసి గెస్ట్ రూమ్ లోకి వెళ్ళాడు ప్రభాత్.

టవల్ కట్టుకుని మరో టవల్ భుజం మీద వేసుకుని బాత్ రూమ్ లోకి వెళ్ళబోతూ " నువ్వు నాకో మాటివ్వు నాన్నమ్మా.నేనిక్కడ ఉన్నట్టు మా నాన్నకి ఎట్టి పరిస్తితులలోను చెప్పను అని నాకు మాటివ్వు. ఉహు..నామీద ఒట్టు వేయి. " అని ఆమె మాట కోసం ఎదురుచూడకుండానే ఆమె కుడి చేతిని తన తల మీద పెట్టుకున్నాడు ప్రభాత్.

పకపకా నవ్వేసింది పరమేశ్వరి. " హారి భడవా.ఎందుకంత కోపం అమ్మ నాన్న మీద? "

"ఇది కోపం కాదు నాన్నమ్మా. ఒక అమాయకత్వం మీద ప్రయోగిస్తున్న నియంతృత్వం మీద నిరసన. నీ సెల్ ఫోన్ ఏదీ? నాకివ్వు." అన్నాడుతన సెల్ ఫోన్ కుడిచేతిలో ఉంచుకుని.

మళ్ళీ నవ్వేసింది పరమేశ్వరి. తన ఫోన్ ప్రభాత్ కి ఇస్తూ..."నామీద కూడా అంత అపనమ్మకం అన్నమాట." అంది.

"అబ్బా..ఇది అపనమ్మకం కాదు. ముందు జాగ్రత్త." అంటూ ఆ ఫోన్ కూడా అందుకుని బాత్రూం లో దూరాడు ప్రభాత్.

                                       

                                        *    *    *

మనవడున్న నాలుగు రోజులు నాలుగు క్షణాలుగా గడిచిపోయాయి పరమేశ్వరిగారికి. మనవడితో ఎన్నెన్నో కబుర్లు.

ఊడ్పులూడ్చాకా వరిపైరులన్నీ వెన్నులేసి పాలుపోసుకుంటున్న తరుణమది. కనుచూపుమేరంతా ధరణీమాత, కొబ్బరిచెట్లు ఇరువైపులా  నిలబడ్డ గట్లు అంచులుగా ఉన్న ఆకుపచ్చ చీరకట్టుకుని వీస్తున్న పైరగాలికి అలల కెరటాలల్లే పైర్లు తలూపుతుంటే, సాయం సంధ్యలో అస్తమిస్తున్న భానుడి ప్రతిబింబాన్ని నుదుటి తిలకంగా దిద్దుకున్న విశాలమైన నుదురుగల ఆకాశం, సూర్యాస్తమయాన్ని మరింతగా ద్విగుణీకృతం చేస్తూ అతన్ని తమ చాటున దాచేసుకొవాలనుకుంటున్నట్లుగా మేఘమాల ప్రయత్నిస్తుంటే..తన కిరణ ప్రభావంతో మేఘాల అంచుల్ని వెండి మెరుపులతో మెరిపిస్తూ పశ్చిమానికి వాలిపోతున్న సూర్యబింబపు అందాన్ని ఆ ప్రకృతి రమణీయతను పరమేశ్వరి వర్ణిస్తూంటే ఆ అద్భుత దృశ్యాలను మనసు పొరల్లో ముద్రించుకుంటూ ఆమెను అనుసరించాడు ప్రభాత్.  

ఈ నాలుగు రోజుల్లో మనవడి అభీష్టాలు చాలా తెలుసుకుంది ఆవిడ. వంట చేస్తున్న సమయంలో భోజనం పట్ల అతని ఇష్టాలు, సినిమాలపై అభిప్రాయం,కళల పట్ల సాహిత్యం పట్ల అతని అభిరుచి,పట్నవాసపు జీవితం తో పోలిస్తే పల్లె జీవితపు జీవన విధానం, మాతృదేశంలో చదువుకుని విదేశాలలో డాలర్ల సంపాదనకోసం ఎగబడుతున్న పిల్లల గురించి, వారిని ఆవిధం గా ప్రోత్సహించే తల్లి తండ్రులగురించి...ఎన్నో ఎన్నో విషయాలను చర్చకు తెచ్చి అతనితో వాదించి అతని స్పష్టమైన అభిప్రాయాలను తెలుసుకుంది పరమేశ్వరి.

ఆ రాత్రి పరమేశ్వరిని అడిగాడు ప్రభాత్.

''నాన్నమ్మా.ఇంతవయసు వచ్చినా నువ్ ఎందుకు విశ్రాంతి తీసుకోవు? నాన్నగారి దగ్గరకు వచ్చి ఎందుకు వచ్చి ఉండవు?''

''నేను అక్కడకు వచ్చేస్తే ఇక్కడ పొలం, పుట్రా సంగతి ఎవరు చూసుకుంటారు రా?'' ఆవిడ తేలికగా నవ్వేస్తూ అంది.

''అది అసలు కారణం కాదు.''

''మరి?'' అమాయకంగా ముఖం పెట్టి అడిగింది పరమేశ్వరి.

''నువ్వే చెప్పాలి. ప్లీజ్.చెప్పవూ.."అడిగాడు నాన్నమ్మ ఒళ్ళో తలపెట్టుకుని.

''చెబుతానురా. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వూరిలో అంతా ఒకే కుటుంబం లా ఉండేవాళ్ళం. ఐకమత్యం గా ఉండేవాళ్ళం. ఏదైనా సమస్య వస్తే మగవాళ్ళు అంతా కూర్చుని చర్చించేవారు.కుటుంబ పెద్దగా ఎవరైతే ఉంటారో వాళ్ళు విశాల దృక్పధంతో ఆలోచించేవారు. పదిమందికి పనికి వచ్చేలా నిర్ణయం తీసుకునేవారు. ఆడవాళ్ళం. పెద్దలకి మా పరిధిలో సమాధానం ఇచ్చేంత పరిజ్ఞానం మాకు ఉండేది కాదు. వారి మాటే శిరోధార్యం గా ఉండేది. ఆ నిర్ణయం వల్ల లాభం వచ్చినా , నష్టం వచ్చినా అందరమూ సమానంగా భరించే వాళ్ళం.

కానీ స్త్రీ చదువుకోవడానికి ఎప్పుడైతే సమాజం లో అడుగు పెట్టిందో ఆనాటినుంచి సమాజం లో చాల మార్పు వచ్చింది. తనకోసం, తనకుటుంబం కోసం తన చదువు అని నిర్ణయించుకుని కుటుంబవ్యవస్థలో కీలక పాత్ర వహించింది. సంసారం గడవడానికి కుటుంబానికి ఆధారం అయింది

.

కానీ ఆధునిక విజ్ఞానం పేరుతొ పరాయి సంస్కృతిని ఎప్పుడైతే మనం అనుకరించడం మొదలు పెట్టామో ఆరోజు నుంచి ఆడదాని ఆలోచనలో వింత మార్పు వచ్చింది.  

ఎంతసేపు తాను భర్త తనపిల్లలు.. వాళ్ళ పిల్లల ప్రేమ వాళ్ళకే దక్కాలి. ఉదాహరణకి నేను పిలిచాననుకో,'బామ్మదగ్గర ఏంచేస్తున్నావ్ రా? వచ్చి చదువుకో..'అని పిలిచేస్తే ఏమిటి అర్ధం?

నీతో మాటలాడనివ్వరు.మీరు స్కూలుకు వెళ్ళిపోయాక ఒకసారి మీ అమ్మ నన్ను కడిగేసింది.

'మీకెందుకత్తయ్యా ఆవిషయాలు ఏదో కృష్ణా రామా అనుకోక. మీదగ్గర పది నిముషాలు కూర్చుంటే వాడు పది రాంకులు వెనుకబడిపోతాడు. వాడి చదువుకుని పైకి వస్తే మీరేగా ఆనందించేది?.వాడి భవిష్యత్తు పాడుచేయడం వల్ల మీకేం వస్తుంది చెప్పండి? మీ మనసు బాధపెడితే క్షమించండి.' అని పెదవి విరుపుగా అనేసి వెళ్ళిపోయింది.

'అమ్మ నిన్ను అంతమాట అందా..?'అడిగాడు ప్రభాస్ బామ్మ కళ్ళల్లో ఏదో వెతుకుతూ. అప్పటికే ఆమె చెంగుతో మనవడికి కనిపించకుండా కళ్ళు తుడుచుకుందామన్న ప్రయత్నం వ్యర్థం అయింది.

ప్రభాస్ "సారీ బామ్మా.అనవసరంగా నిన్ను బాధపెట్టాను."అన్నాడు.

''లేదు నాన్నా. నేను అనవసరంగా అసలు బాధపడను. భగవంతుడు అవకాశం ఇస్తే ఒకరికి పెట్టే పై చెయ్యిగానే ఉండాలన్నది నా కోరిక నాన్నా.'' అన్నారావిడ నవ్వుతూ.

''నాన్నమ్మా...నీకు ఇన్ని తెలివితేటలూ ఎలా వచ్చాయి నాన్నమ్మా? '' అడిగాడు ఆశ్చర్యంగా ప్రబాస్.

'' వీటిని తెలివితేటలూ అనరు నాన్నా. బ్రతుకు తెరువు అంటారు. ఒక దారిలో నడుస్తున్నప్పుడు ఎదురుగా ఏవేవో అడ్డుగా వస్తుంటాయి. వాటినుంచి సమయ స్ఫూర్తితో తప్పించుకుని క్షేమంగా బయటకి వచ్చి మన గమ్యం వైపు ప్రయాణం చేయడమే జీవితం అంటే."

"అర్ధమైంది నాన్నమ్మా. అమ్మ ఏ విషయమూ ఇలా సౌమ్యంగా చెప్పదు. నాన్నని ఏ విషయంలో అయినా సపోర్ట్ చేస్తే నేనేదో తనకి అన్యాయం చేసేసినట్టు మాట్లాడుతోంది. "రేవు నువ్ నన్నేం చూస్తావ్?" అని ఏదో కోల్పోయినట్టు ఏడ్చేస్తుంది. రేపు నేను తనని చూడాలని ఆలోచన ఉన్న అమ్మ, నాన్నని నిన్ను చూసేలా ఎందుకు ప్రోత్సహించదో అర్ధం కాదు."

పరమేశ్వరిగారి కళ్ళల్లో చివ్వున నీళ్లు చిమ్మాయి.

"నాన్నా ప్రభా. మీ అమ్మకి అభద్రతాభావం ఉంది.నాకు అది లేదు.అందుకే హాయిగా బతుకుతున్నాను. సరే.బాగా పొద్దుపోయింది. ఇక పడుకో."ప్రభాస్ తల ప్రేమతో నిమిరి దీపం తీసేసి తనగదిలోకి వెళ్లిపోయారామే.

ప్రభాస్ చాలా సేపటి తరువాత నిద్రలోకి జారుకున్నాడు.

********

మరునాడు ఉదయం లేచి తన గదిలోంచి బయటకు వచ్చిన ప్రభాస్ కి హాల్లో తల్లిదండ్రులు ఇద్దరూ బామ్మతో మాట్లాడుతూ కనిపించారు.

గంటు పెట్టుకున్న ముఖంతో వచ్చి వారి పక్కన కూర్చుని ముఖం పక్కకి తిప్పుకున్నాడు.

"ఒరేయ్ ప్రభూ...ఏంపనిరా ఇది. ఎంత కంగారు పడిపోయామో తెలుసా.మనసు మనసులో లేదు. నీకేదైనా కష్టం మావల్ల కలిగితే మాతో చెప్తే మనమే అక్కడ పరిష్కరించుకునే వాళ్ళం కదా.ఇక్కడ బామ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకు?" అడిగాడు విజయచంద్ర.

ప్రభాస్ మాట్లాడలేదు.

''ఏంటమ్మా...వాడంటే చిన్నపిల్లవాడు. నువ్వైనా నచ్చ చెప్పి ఇంటికి పంపాలి గానీ...ఇలా నీ దగ్గర ఉంచేసుకుంటే ఎలా?''

''బాగుందిరోయ్ ....నాన్నమ్మానేను ఇక్కడకు వఛ్చినట్టు ఎవరికైనా చెబితే నామీద ఒట్టే అనీ నీ కొడుకు ఒట్టు వేయించుకున్నాడు. నన్ను ఏమన్నా అంటే బాగుండదు.'' అందామె చిరుకోపం ప్రదర్శిస్తూ.

''నాన్నగారు. రెండు నిముషాలు నేను మనసువిప్పి మాట్లాడే అవకాశం ఇస్తారా? వింటాను అంటే చెప్పండి . మాటాడతాను. లేదా...నిశ్శబ్దంగా ఇంటికి వెళ్ళిపోదాం. నాన్నమ్మను మాత్రం ఏమీ అనద్దు.''

ఆయన బిత్తరపోయాడు. తనతో కొడుకు ఏనాడు అలా మాట్లాడి ఎరుగడు . భార్యవైపు చూసాడు. తనకేమీ పట్టనట్టు తల తిప్పుకుంది అనిత. అత్తగారి ముందు మాట్లాడటం ఆమెకు ఇష్టం లేదు. ఆమె తర్కం ముందు తాను ఓడిపోతానని తెలుసు. అందుకే మౌనం వహించింది.


''సరే చెప్పు.''అన్నాడాయన విసుగ్గా.

''నేను ఇంజనీరింగ్ చదవను నాన్నగారు. ఇంటెర్మీడియెట్ అయ్యాకా నేను డిగ్రీ చదువుతాను. యే శిక్షణో తీసుకుని బాంక్ లోనో, ఎల్.ఐ.సి.లోనో, లేదా రైల్వే లోనే ఉద్యోగం వచ్చేలా చదువుతాను.నేను జన్మించిన ఈ నేలమీదే బ్రతికి, ఈ గాలి పీలుస్తూ మన ఇండియాలోనే ఉంటాను గాని...నేను పెద్ద చదువులు చదివేసి, విదేశాలకు వెళ్లిపోయే మీ కోర్కెలు మాత్రం తీర్చలేను తీర్చను. మీకు అందుకు ఇష్టమైతే ఇంటికి వస్తాను. లేకపోతే రాను.''

'ఇదంతా మీ అమ్మ నిర్వాకం' అన్నట్టు భర్తకేసి సూటిగా చూసి తలతిప్పుకుంది అనిత.

''ఎందుకని? ''అడిగాడు విజయచంద్ర.

''చూడండి నాన్నగారు. మీరు నామీద ఖర్చుపెట్టే ప్రతీ పైసాకి నేను న్యాయం చేసే దిశగా కష్టపడతాను . మొదటి ముగ్గురిలో తప్పనిసరిగా ఒకడిగా ఉండే ప్రయత్నం చేస్తాను.దాంతో నా జీవితం స్థిరపడేలా చూసుకుంటాను. 

ఇక మీరు చెప్పిన మాటల్లో నా ఉన్నతి కన్నా, దానిద్వారా మీరు సుఖంగా జీవించాలి నే స్వార్ధం కనపడుతోంది. 

''అయితే ఏమంటావ్? '' ఉద్రేకంతో ఊగిపోయిన విజయచంద్ర కొడుకు మాటలలోని భావం అర్ధం అయ్యేసరికి ఒక్కసారిగా నల్లబడిన ముఖంతో తలదించుకున్నాడు అనిత మోచేతి పోటుతో. 

పరమేశ్వరిగారికి మతిపోయింది. 

''నాన్న...ప్రభా...నువ్వు గదిలోకి వెళ్ళు.'' ఆమె చూసిన చూపుకి ప్రభాస్ మారు మాట్లాడకుండా బామ్మగారి గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.

"చూడబ్బాయి. ఊహ, జ్ఞానం తెలుస్తున్న పిల్లల జీవితాలు ముళ్ళమీద ఆరేసిన బట్టలాంటివి.చాలా జాగ్రత్తగా వాటిని ఏమాత్రం చిరుగు పడకుండా తీసుకునే నేర్పు తీసుకునేవాడికి ఉండాలి.లేకపోతే ఆ నష్టం ఇద్దరిదీను. వాడు రేపు సాయంత్రానికి నీ ఇంట్లో ఉంటాడు.సరేనా?భోజనాలకి లేవండి."అని తనదగ్గర ప్రభాస్ ఉన్న ఈ నాలుగురోజుల్లో అతని అభిరుచులు, ఆలోచనలు ...అన్నీ కొడుకు కోడలికి వివరించారావిడ. చాలా విషయాలు వారిద్దరితో చర్చించాకా చివరగా ఆమె అన్నారు.

''అబ్బాయి. ఈవేళ జ్నానమ్ వచ్చిన ప్రతీ వాడు తాను సొంతంగా ఆలోచించే తత్వాన్ని నేర్చుకుంటున్నాడు. అంతెందుకు? ఈవేళ నేను చెప్పే మాటలు మీకే నచ్చవు. 


నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే. ఆధిక్యత, నియంతృత్వము కేవలం ధనవంతులకు, రాజకీయం లోనూ మాత్రమే పనికొస్తాయి. మధ్యతరగతి జీవితాల్లో వాటికి స్థానమిస్తే జీవితంలో అతివిలువైనవి కోల్పోవచ్చు. లేదా వ్యక్తులనే కోల్పోవచ్చు. మీరు వాడితో చక్కగా మనసు విప్పి మాట్లాడండి. వాడు చెప్పేది వినండి. ఏది వాడి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తుందో దానిని అనుసరించేలా మీ ప్రోత్సాహం, సహకారం అందించండి . మీ కోరిక, వాడి లక్ష్యం రెండూ నెరవేరేలా చక్కని ఆలోచన చేయండి. తద్వారా అందరమూ ఆనందంగా ఉంటాము. సరేనా?''

అనిత చటుక్కున లేచి పరమేశ్వరిగారి కాళ్ళకి నమస్కరించింది. 


''అనితా .. ఏమిటిది ..లే...లే.?''అని పరమేశ్వరిగారు కన్నీళ్లు జారిపోతున్న ఆమె బుగ్గలు తుడిచారు.

''చూడమ్మా. సముద్రతీరాన నిలబడినప్పుడు దూరంగా వస్తున్న పెద్ద కెరటాలను చూసి చాలా ఆనందం వేస్తుంది. మనమూ వాటిని చేరుకోవాలని ఆరాట పడతామ్. కానీ అవి దగ్గరకు వచ్చేకొద్దీ మనల్ని లోపలికెక్కడ లాగేస్తుందో అని భయమూ పడతాము. సమయస్పూర్తిగా నిర్ణయం తీసుకోవాల్సింది మనమే నమ్మా. 

ఈ సమాజంలో ప్రతీ కుటుంబం చక్కని బొమ్మరిల్లు లాంటిది. దానిని పదిమంది స్ఫూర్తిగా స్వీకరించేలా మన బొమ్మరిల్లును మరింత అందంగా మెరుగులు దిద్దుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది.''

'' అత్తయ్యా. నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. కుటుంబ వ్యవస్థ పట్ల ఇంటి చక్కని అవగాహన ఉన్న మిమ్మల్ని ఇంతకాలం దూరం చేసుకున్నందుకు సిగ్గు పడుతున్నాను. నన్ను మన్నించండి.  మిమ్మల్ని ఒక్క కోరిక కోరవచ్చునా?''అడిగింది అనిత.

'' అదేమిటమ్మా? ఏంకావాలో అడుగు. ''

''లేదత్తయ్య...మీ సాహచర్యం కావాలి. ప్రభాస్ తన కాళ్ళ మీద తాను నిలబడేవరకు మీరు మాతోనే ఉండాలి.కాదనకండి.''

''అమ్మా..అవునమ్మ.. ప్లీజ్. మమ్మల్ని క్షమించి మా ఇంటికి రామ్మా..''అన్నాడు విజయచంద్ర బాధాతప్త హృదయంతో.

'' మీ ఇంటికి రాకపోవడానికి మీరు తప్పేమీ చేయలేదు నాన్న. జస్ట్ అభిప్రాయబేధాలు అంతే.

అయ్యో ...మీ మంచికే కదా మేము చెబుతున్నదీ...అని మేము అనుకుంటాం. మనసంసారం విషయంలో వీళ్ళ అభిప్రాయాలతో మనకి పనేమిటి? అని ఒకరికొకరు అనుకోవడం వల్లనే ఈ పరిస్తితి. . ఈవేళ ఎవరి జీవితాలు వారివి. అనుబంధాలు పెంచుకుంటే పెరుగుతాయి. తెంచుకుంటే తెగిపోతాయి.'' అన్నారామె నిర్లిప్తంగా. 

''నాన్నా.. ప్రభా...'' పరమేశ్వరిగారు ప్రభాస్ ని పిలిచారు. 

ప్రభాస్ ముభావంగా వచ్చాడు. ''అమ్మ, నాన్న నన్ను ఇంటికి రమ్మంటున్నారు. రానా వద్దా ?'' అడిగారు అతన్ని.

''రా నాన్నమ్మా. అయితే నీమీద నాకు కోపం వచ్చింది. '' చిరుకోపంగా అన్నాడు.

''మళ్ళీ ఏమైందిరా?'' అడిగింది అనిత దగ్గరగా వచ్చి.

''నేను ఇక్కడికొచ్చినట్టు నాన్నకి వాళ్ళకి ఎలా తెలిసింది?నామీద ఒట్టు వేయించుకున్నాను. ఫోన్ కూడా తీసేసుకున్నాను.''బుంగమూతి పెడుతూ అన్నాడు ప్రభాస్.

''పిచ్చివాడా.మనకు తెలిసిందే ప్రపంచం అనుకుంటే ఎలా? నీ అనుమానం నాకూ వచ్చింది. కరణంగారి అబ్బాయి మీ నాన్న బాల్య స్నేహితులు. నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లినప్పుడు పలకరించాడుగా. వాడు ఫోన్ చేసి చెప్పాడట. తీరిందా నీ అనుమానం? నీమీద ఒట్టు వేయించుకున్నాకా కూడా అలా ఎలా చెబుతాను అనుకున్నావ్ నాన్న?'' అన్నారామే ప్రభాస్ బుగ్గ చిదుముతూ.

''నన్ను మన్నించు నాన్నమ్మా.'' ఆమె బుగ్గను ముద్దాడి చెమరించిన కళ్ళతో ఆమెను చుట్టుకుపోయాడు ప్రభాస్.

సమాప్తం



Rate this content
Log in

Similar telugu story from Classics