kottapalli udayababu

Classics Inspirational Children

4  

kottapalli udayababu

Classics Inspirational Children

అమ్మకు సన్మానం (కధ)

అమ్మకు సన్మానం (కధ)

6 mins
46


అమ్మకు సన్మానం (కధ)


‘’ఈనాడు  మా ప్రముఖ దినపత్రిక నిర్వహించిన సంగీత, నృత్య, చిత్రలేఖన, విచిత్ర వేష ధారణ పోటీలు సమాప్తం అయ్యాయి. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన న్యాయమూర్తులు విజేతలను ఎంపిక చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. మరో అరగంటలో సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంతవరకు అభిరుచిగల చిన్నారులు ఎవరికి తోచిన పాట వారు వచ్చి పాడవలసిందిగా కోరుతున్నాము. ‘’


అని నిర్వాహకులు మైక్ లో చెప్పడం పూర్తికాగానే న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన మరో ఇద్దరు వారి కాయితాలు నాకు అందించి మరో అరగంటలో వస్తాము అని బయటకు వెళ్లారు.


 


మొత్తం కాయితాలు తీసుకున్న నన్ను ప్రధాన నిర్వాహకుడు నా దగ్గరకు వచ్చి గ్రీన్ రూములోకి ఆహ్వానించాడు . నాకు ఒక పక్క టేబుల్. కుర్చీ ప్రత్యేకంగా వేశారు. నృత్య పోటీలు, విచిత్ర వేష ధారణ పోటీలలో పాల్గొన్న కొందరు చిన్నారులకు వారి తల్లిదండ్రులు మేకప్ తీసే ప్రయత్నంలో పడ్డారు.


 


నేను నా కార్యక్రమాన్ని కొనసాగించాను. చిత్రలేఖన పోటీ ఫలితాలు అప్పటికే సిద్ధమయ్యాయి. సంగీత, నృత్య, విచిత్ర వేషధారణ ఫలితాలను ఐటెమ్ వారీగా చివరి జాబితా తయారు చేశాను. వారిలో అత్యధిక మార్కులు వచ్చిన వారి జాబితా గా ప్రత్యేకంగా ప్రధమ, ద్వితీయ. తృతీయ బహుమతుల ప్రకారం తయారు చేశాను.


 నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటే. నాలుగు అంశాలలోను అత్యధిక మార్కులు సంపాదించి ప్రథమ స్థానంలో నిలిచిన బేబీ ఓకే అమ్మాయి కావడమే నా ఆశ్చర్యానికి కారణం.


 నా నిర్ణయం వరకు ఆమెకి అన్ని అంశాలకు ఎక్కువ మార్కులు పడ్డాయి. మిగతా ఇద్దరు న్యాయమూర్తుల మార్కులలోను ఆమె ప్రథమ స్థానంలో ఉంది.


 అంటే న్యాయనిర్ణేతలు అందరు నిష్పక్షపాతంగా వ్యవహరించారు అనడానికి, ఒకే విధంగా ఆలోచించారు అనడానికి మార్కులు ఒకటి లేదా రెండు మార్కుల తేడాతో రావడమే తార్కాణం అనిపించింది నాకు.


 


 ఆ బేబీ పేరు మాధుర్య. మాంటిసోరి పబ్లిక్ స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. ఆ పాప తండ్రి ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేస్తున్నాడు. తల్లి గృహిణి. ఈ వివరాలు నాకు నిర్వాహకులు చెప్పారు. పిల్లలు పాడుతున్న లలితసంగీతం మైక్ లో వినిపిస్తోంది.


 కార్యక్రమం ప్రారంభం కావడానికి సమయం ఉండడంతో నేను కూర్చున్న బల్లమీద చిన్నారులు వేసిన చిత్రలేఖనం బొమ్మలు దొంతరలను ఒక్కొక్కటిగా విడదీసి జాగ్రత్తగా పరిశీలించసాగాను.


 బేబీ మాధుర్య వేసిన చిత్రం ఎందుకు ప్రథమ బహుమతిని పొందగలిగిందో నాకు అప్పుడే అర్థమైంది. ‘’ ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక’’  అన్న కాళోజీ మాటలు గుర్తొచ్చాయి.


 ఒకే ఒక్క పోటీ ఆ చిన్నారుల మనసుల్లో దాగి ఉన్న ఆలోచనలను చిత్రలేఖనం రూపంలో ప్రదర్శించిన తీరు అత్యద్భుతం. వాటిలో ఎవరితోనూ తమ భావాలు చెప్పుకోలేనివి కూడా బొమ్మల రూపంలో తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నాయి.


 బేబీ మాధురి వేసిన చిత్రానికి ‘’ఇవి మా బ్రతుకులు’’ అనే క్యాప్షన్ వ్రాసింది.


 ఆ చిత్రంలో రెండు విభాగాలున్నాయి. మొదటి దృశ్యంలో కొండల నడుమ సూర్యోదయం అయ్యింది.  విద్యార్థులు వ్యోమగాముల్లా తయారై కాన్వెంట్ కి వెళ్తున్నారు - విరబూసిన పువ్వుల్లా . రెండవ దృశ్యంలో సూర్యాస్తమయం జరుగుతోంది. విద్యార్థులు చింపిరి జుట్టుతో నీరసపడి పోయి మాసిన బట్టలతో కాందిశీకుల మాదిరి ఇంటి దారి పట్టారు, వాడిపోయిన పువ్వుల్లా. 


ఈనాడు కాన్వెంట్ చదువులు నేపథ్యంలో ఆ బేబీ కి వచ్చిన ఆలోచనకు నేను ఆశ్చర్యపోయాను. 


అదేవిధంగా నృత్య ప్రదర్శనలో యశోదగా నర్తిస్తూ గోపికలతో ‘తన బిడ్డ అలాంటి అల్లరి పనులు చేయడమ్మా’ అని చిన్ని కృష్ణుని చిలిపి చేష్టలు అలవోకగా ప్రదర్శిస్తున్నప్పుడు నేను బాల కృష్ణుడనై తన్మయత్వంతో పులకించిపొయాను. ఒక ప్రౌఢ నర్తకి పరిణితి చెంది చేసిన నృత్యమా అనిపించింది నాకైతే.


సంగీతంలో మోహన రాగాన్ని అవపోసన పట్టినట్లు ఆలపించిన గీతం వింటుంటే తేనె సోనలాంటి ఆమె కంఠస్వరానికి ముగ్ధుడిని అయిపోయాను. 


విచిత్ర వేషధారణతో అయితే అన్నమయ్య  మళ్లీ అవతరించాడా అనిపించి అప్రయత్నంగా చేతులు జోడించాను.   కార్యక్రమం ముగిసింది.


మాధురి తల్లిదండ్రులు నా దగ్గరగా వచ్చారు.  


‘’సార్! మీరు ప్రధాన న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం మా అదృష్టం. మీకు అభ్యంతరం లేకుంటే ఈ పూట మా ఆతిథ్యం స్వీకరించగలరని కోరుతున్నాము. మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే’’ అన్నారు


‘’ ప్లీజ్ అంకుల్! రండి... అయినా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోకుండా రమ్మంటే ఎలా వస్తారు మమ్మీ’’ అంది తల్లి కేసి తిరిగి మాధుర్య.


 


‘’సారీ సార్ ! నా పేరు సూర్య కిరణ్ . నా శ్రీమతి పేరు మాధవి. మీరు మా ఇంటికి తప్పక రావాలి మా సంతృప్తి కోసం ప్లీజ్’’ అన్నాడు మాధుర్య తండ్రి కిరణ్.


‘’ ఇప్పుడు కరెక్ట్ గా పిలిచారు కాబట్టి తప్పక వస్తారు కదా...అంకుల్’’ మెరిసే కళ్ళతో అంది మాధుర్య . కాదనలేక వారిని అనుసరించాను.


******************


 


పట్టణంలోని సోఫిస్టికేటెడ్ లోకాలిటీలో డ్యూప్లెక్స్ భవనం.


పాప గది నిండా ఎన్నో అవార్డులు, మేమేంటోలు, లామినేషన్ చేయబడిన పేపర్ కటింగ్ ఫైల్స్, ఫోటో ఆల్బమ్స్ అన్నీ చూస్తుంటే ఆ అమ్మాయి కారణజన్మురాలు అనిపించింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న తన ప్రదర్శనలతో అలరించిన ఆమె రాష్ట్ర బెస్ట్ సూపర్ కిడ్ అవార్డుతోపాటు ఎన్నో బిరుదులు అవార్డులతో సత్కరింపబడింది. సుమారు 70 కి పైగా అవార్డులు సన్మానాలు పొందింది. ప్రతి రంగంలోనూ అత్యంత లబ్ధప్రతిష్టులైన వారి ఆశీస్సులు పొందుతూ తీయించుకున్న ఫోటోలు చూసి ‘’ఆమెను కన్న తల్లిదండ్రుల గా మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారమ్మా’’ అన్నాను కళ్లు చెమర్చగా.


వారి ఆతిధ్యానికి ముగ్ధుడైన నేను మాధుర్యని జీవితంలో అత్యంత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశీర్వదించాను.


‘’ నాకు డాన్స్ చేయడం కన్నా బొమ్మలు వేయడం, సంగీతం నేర్చుకోవడం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అంకుల్. ఏడవ తరగతి వరకే డాన్స్ చేస్తాను. ఆ తర్వాత వీణ, కరాటే, టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటాను. కంప్యూటర్ స్కూల్లో నేర్పుతున్నారు. రెండుసార్లు చదరంగంలో రెండుసార్లు విన్నర్ అయ్యాను. విజ్ఞానం కోసం ప్రతి కళలో ప్రవేశం ఉండాలి అంటుంది అమ్మ. నాకు ఏది ఇష్టమైతే దాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకునే స్వేశ్చ ఇచ్చింది .


 వేమన. కృష్ణ, సుమతి శతకాలు మూడు,  భగవద్గీత లో భక్తి యోగము, రామాయణంలో బాలకాండ మహాభారతం లో అరణ్య పర్వం వరకు నేర్చుకున్నాను అంకుల్. అన్నట్లు రేపు రాత్రి మా స్కూలు వార్షికోత్సవం. మీరు తప్పకుండా నా డాన్స్ ప్రోగ్రాం చూడటానికి రావాలి. ఇదిగో నా ఆహ్వాన పత్రిక. ‘’ అంటూ స్కూల్ బ్యాగ్ లోంచి తీసి అందించింది మాధుర్య.


‘’ తప్పక వస్తారు కదూ?’’ అంది ఆశగా చూస్తూ.


‘’ నా బంగారు తల్లి ప్రోగ్రామ్ కి రాకుండా ఉండడమా? నువ్వు నాకు ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ వి. నా ఫ్రెండ్ అడిగితే రాకుండా ఉంటానా? అది సరే గానీ ఇవన్నీ నీకు ఎవరు నేర్పుతారు?’’ అడిగాను ఉత్సాహంగా.


‘’ మమ్మీ నేర్పుతుంది. డాడీ నాకు ఇంగ్లీషు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పుతారు’’ ఆ పాప ఒక్కమాటతో నా మనసు బరువెక్కి పోతోంది. మరి కాసేపు అక్కడే ఆగితే ఉండిపోయే పరిస్థితి రావచ్చు. అందుకే తమాయించుకుని ‘రేపు ప్రోగ్రాం తప్పనిసరిగా వస్తా’నని ఇంటి దారి పట్టాను.


*****************


 మరునాడు రాత్రి మాంటిస్సోరి స్కూల్ వార్షికోత్సవానికి వెళ్లాను. కార్పొరేట్ హంగులతో అత్యంత ఖరీదైన అలంకరణతో వేదిక అలంకరించబడింది. మాధవి, సూర్య కిరణ్ నన్ను ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు.


 


ప్రసంగాలు పూర్తయిన తరువార మాధుర్య ‘మహిషాసుర మర్దిని’ నృత్యాన్ని ప్రదర్శించింది. సాంస్కృతిక కార్యక్రమాలలో మాధుర్య ప్రదర్శనే పూర్తి హైలైట్.


 అనంతరం బహుమతి ప్రదానోత్సవంలో --


మాధుర్య 8 ఈవెంట్స్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నరే కాకుండా ఆల్ రౌండర్ ఛాంపియన్షిప్ తో పాటు బెస్ట్ స్టూడెంట్ విత్ యాగ్రగేట్ ఫస్ట్ రాంకర్గా  నిలిచింది. అభినందనలతో సభ మార్మోగిపోయింది. 


అందుకు యాజమాన్యం మాధుర్యకు సత్కారాన్ని ప్రకటించింది. మాధురి వెంటనే స్పందించి డైరెక్టర్ గారీ చెవిలో ఏదో చెప్పింది. ఆయన సరే అన్నట్లు తల ఊపారు.


 మాధుర్య మైక్ ముందుకు వచ్చింది.


‘’ సభకు నమస్కారం!


‘ ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై.....’’ ఈ పద్యం శివుని ఉద్దేశించినది. అదే శివుని పదం స్థానంలో ‘అమ్మ’ అనే పదాన్ని బట్టి ఈ పద్యాన్ని తిరగరాయాలి ఉంది నాకు.


తినడానికి నలుగురు మనుషులు ఉండి తినేటందుకు మూడు రొట్టెలు ఉండి, తినడానికి నలుగురు వ్యక్తులు ఉంటే, ముగ్గురికి మూడు ఇచ్చి తాని పస్తు ఉండే వ్యక్తి పేరు అమ్మ అని, త్యాగానికి మారుపేరు అని అమ్మ అని మా నాన్నగారు చెప్పారు.


 నేను ఇప్పుడు మీకు ఒక ఉత్తరం చదివి వినిపించబోతున్నాను. అది మా అమ్మ హృదయం. మా తాత గారికి మా అమ్మ రాసుకున్న ఉత్తరం. మా తాతగారు మరణించి మూడు సంవత్సరాలు అయింది.’’ వింటున్న మాధవి ఉలిక్కిపడింది.


 చతుక్కున లేచి వేదికమీదకు వెళ్లబోయిన ఆమెను సూర్యకిరణ్ చేపట్టి ఆపేశాడు.


 ‘’ఈరోజు ఈ ఉత్తరం దేవుని పూజామందిరంలోని వ్యాసపీఠం లో ఉంచిన భగవద్గీత లో దొరికింది. అమ్మ అనుమతి లేకుండా మీ ముందు ఉంచుతున్నందుకు క్షమించమని కోరుతూ ఈ ఉత్తరాన్ని చదువుతున్నాను.


 


‘’దేవతా స్వరూపమైన నాన్నగారికి,


 మీ కుమార్తె మాధవి ప్రణామములతో వ్రాయునది. మీరు ఇపుడు ఇక్కడ లేరు. పై లోకంలో ఉన్నారు. నా ఈ మాటలు మీకు వినిపిస్తాయో లేదో తెలియదు. అయినా నా మనశ్శాంతి కోసం దీనిని వ్రాసుకుంటున్నాను. మనం ఉండే గ్రామంలో మీరు ఓ సాధారణ రైతు. కొంతవరకు మాత్రమే చదువుకున్న మీరు ముగ్గురు అన్నయ్యలను ఎంత ఖర్చైనా భరించి చదివించగలిగారు. నన్ను మాత్రం పదవ తరగతి వరకు చదివించారు. ఆపై చదువు మన గ్రామంలో లేనందువలన పోరుగూరు వెళ్ళి చదవవలసినంత అవసరం లేదని నిష్కర్షగా చెప్పెశారు. 


ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు నేను ప్రతి తరగతిలోనూ అటు చదువులోను, ఇటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ఏదో విధమైన బహుమతిని పొంది సంతోషంగా ఇంటికి వస్తే మీరు ‘’ఆడపిల్లకు ఎందుకు వచ్చినవే ఇవన్నీ? ఎప్పుడైనా ఓ అయ్య చేతిలో పెట్టాల్సిందే గా!’’ అనేవారు. 


చదువులో స్కూల్ ఫస్ట్ వచ్చిన నన్ను ‘పై చదువులు చదివించండి’ అని మీకు వివరించడానికి రామయ్య మాష్టారు ఇంటికి వచ్చి విన్నవిస్తే మీరు ఆయనను అవమానించి మీ డబ్బు, పలుకుబడి ఉపయోగించి ఊరు నుంచి బదిలీ చేయించేశారు. అన్నయ్య చెప్పినా వినలేదు.


 నా కలలన్నీ నాతో పాటు నిద్రావస్థలోకి వెళ్ళిపోయాయి. మీకు అన్ని విధాలా నచ్చిన కుర్రాడిని ఇచ్చి పెళ్లి చేశారు. తండ్రిగా జన్మనిచ్చినందుకు మీరు నాకు చేసిన న్యాయం అది ఒకటే.


 సూర్య నా భర్తగా లభించడం నేను చేసుకున్న పూర్వజన్మ పుణ్యం. చదువుకోవాలి అనుకున్న తృష్ణను గమనించి నేను పీజీ చేసే అంత వరకు తానే గురువై బోధించి నా చేత సాధింప చేసిన వ్యక్తి. ఆ దేవుడు మాకిచ్చిన కలల పంట మాధుర్య.


‘’ నీ లాంటి ఆడపిల్లనే కన్నావా మగ పిల్లవాడికని కనొచ్చుకదమ్మా?’’  అని అదేదో నా చేతిలో పని అన్నట్టు జాలిపడ్డారు మీరు.


నాకు నీలో నచ్చనివి రెండే గుణాలు నాన్నగారు. ఒకటి నియంతృత్వం. రెండవది అనవసరంగా జాలిపడడం. నేను పీజీ చేశాక ఉద్యోగం చేస్తావా? అని సూటిగా అడిగాడు సూర్య.


‘’జీవితంలో నేను పాపా సంతృప్తిగా చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటూ ఆనందంగా బ్రతకగలమా?’’ అని ఎదురు ప్రశ్న వేసాను.


‘’ సంతోషంగానే కాదు...సమృప్తిగా కూడా.’’ అన్నాడు తను.


‘’ అయితే నేను గృహిణిగానే ఉంటాను సూర్య’’ అంటూ నేను ఏమి ఏమి చెయ్యాలి అనుకున్నానో , ఎలా చేయదలచుకున్నానో సూర్య వివరించాను.


‘’నాకు ఆడంబరాలు వద్దు. ఏ విషయంలోనూ ‘అతి’ నాకు ఇష్టం ఉండదు. నేను కోల్పోయినవన్నీ నా పాపలో చూసుకోవాలి. అది నా కోరిక. ఆ సంతృప్తి నాకు కలిగేలా సహకరించు. నిన్ను ఇంకేమి కోరను’’ అని అడిగాను.


‘’ నువ్వు ఎంత మంచి దానివి మధూ...’’ అన్నాడు సూర్య.


 అప్పటి నుంచి పాపకు నాకు వచ్చిన విద్యలన్నీ ఓర్పుగా, నేర్పుగా నేర్పగలిగాను. రెండుసార్లు మాత్రమే  చెప్పేస్తే అవగాహన చేసుకునే నైపుణ్యం భగవంతుడు నా కూతురికి ఇచ్చిన వరం. నాకు తెలియనివి సూర్య ని అడిగా తెలుసుకొని, పుస్తకాలు చదివి తెలుసుకుని పాపకు నేర్పాను.మాధుర్య మా కూతురు గా కన్నా, దాని తల్లిగా నేను గుర్తింపబడుతున్నందుకు గర్వపడుతున్నాను. 


తల్లిదండ్రులకు ఇంతకు మించిన ఆనందం మరేముంటుంది చెప్పండి?  మీరు బ్రతికి ఉన్నన్నాళ్లు మీ ఎదుట నోరు విప్పి ఒక్క మాట ఎదురు చెప్పలేని నేను, అవకాశం వస్తే, అవకాశం ఇస్తే ఆడపిల్ల ఎంతటి ఉన్నత స్థానానికైనా ఎదగ గలదు అని తెలియ చెప్పేటందుకు, నా కూతురు ఎంతో గొప్పది అన్న గర్వం నాలో పెరగకుండా ఉండేందుకు ఈ ఉత్తరం రాసుకుంటున్నానే తప్ప మిమ్మల్ని కించపరచడానికి కానేకాదు. 


 


‘’మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది....


 ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థం అందులో ఉంది...’’ ఒక తాదాత్మ్యత చెందిన రచయిత కలం నుంచి జాలువారిన ఆ పాట నా గురించే వ్రాసాడా... అనుకుంటూ ఉంటాను నేను. ఆ పాటలో ఒదిగిన భావాన్ని అణువణువునా నింపుకుంటూ మీ మనవరాలు మరింత విజ్ఞానవంతురాలు, ప్రవీణురాలు కావాలని పైనుంచి ఆశీర్వదించమని కోరుతూ....మీ కుమార్తె,


           - మాధవి.’’


 


 సభ అంతా చీమ చిటుక్కుమన్నా వినబడే అంత నిశ్శబ్దం. ఉత్తరం స్పష్టంగా, స్ఫుటంగా చదవడం పూర్తిచేసిన మాధుర్య కళ్ళు తుడుచుకుంది.


‘’ నాకుఇంత చక్కని అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ... నేను ఎన్నో సత్కారాలు, సన్మానాలు పొందాను. నన్ను ఇంతగా తీర్చిదిద్దిన మా అమ్మ లాంటి అమ్మ మరి ఎవరికీ ఉండదు. నాకు చేద్దామనుకున్న ఈ సత్కారం మా అమ్మకు నేను చేసుకునే అవకాశం ఇవ్వమని డైరెక్టర్ గారిని సభాముఖంగా కోరుతున్నాను సార్... ప్లీజ్!’’


 


 హాలంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఆ పసి మనసు ఆర్ధత అర్థం చేసుకున్న ఎంతోమంది స్త్రీమూర్తులు నిశ్శబ్దంగా కళ్ళు తుడుచుకున్నారు.


‘’అమ్మా...! రా అమ్మా...!’’ అంటూ మాధుర్య వేదిక  దిగివచ్చి మాధవిని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసింది. కన్నీళ్ళో, ఆనందభాష్పాలో తెలియని స్థితిలో మాధవి కూతుర్ని ఎత్తుకొని ముద్దాడింది.


‘’బీ బ్రేవ్ మధు...’’ అంటూ సూర్య కిరణ్ మాధవి భుజం తట్టాడు ఆప్యాయంగా. ముగ్గురిని వేదిక మీదకి తీసుకువెళ్లడానికి డైరెక్టర్ గారు మిగిలిన అతిథులు కిందకి దిగి వస్తున్నారు.  కరతాళధ్వనులు మోగుతూనే ఉన్నాయి.

సమాప్తం


 


 



Rate this content
Log in

Similar telugu story from Classics