kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన న్యాయం (2వ భాగం)

మనసు చేసిన న్యాయం (2వ భాగం)

3 mins
23


మనసు చేసిన న్యాయం (2వ భాగం)

"మా పెళ్లికి స్వయంగా వచ్చి పిలిచినా మీరు రాలేదుకదా ఆంటీ. అమ్మ ఐతే చాలా బాధపడింది."అన్నాను బాగ్ లోంచి స్వీట్ బాక్స్ తీసి ఆంటీ చేతులలో పెడుతూ...

"ఇవన్నీ ఎందుకు వైభవ్. అంకుల్ మనస్తత్వం నీకు తెలుసు కదా. ఆయన స్వయంగా తెస్తే తప్ప ఎవరేం తెచ్చినా ఆయనకు నచ్చదు అని నీకు గుర్తుండే ఉంటుంది. ఏమీ అనుకోకు ఇలా అంటున్నానని.కాలాలు మారినా కొన్ని మారవు"అని టీపాయ్ మీద పెట్టారు.ఆమె ముఖంలో ఒక అసంతృప్తి వీచిక ఒకసారి మెరిసి మాయమైంది.

"నేను పెళ్లయ్యాక మొదటిసారి అదీ పదిహేనేళ్లతర్వాత వచ్చాను.దయచేసి కాదనకండి. అంకుల్ అడిగితే నేను జాగ్రత్తగా సమాధానం చెబుతాను.ఇక నాకు ఇద్దరు పిల్లలు. పెద్దది అమ్మాయి సెవెంత్, అబ్బాయేమో ఆరవతరగతి చదువుతున్నారు."చెప్పాను.

అంతలో గుమ్మంలో అలికిడి కావడంతో లేచి నిలబడి అటు చూశాను.అంకుల్, ఒక అమ్మాయి, నావయసు ఆవిడ ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ లోపలికి వచ్చారు. ఆ అమ్మాయి సుజాత అని వెంటనే గుర్తు పెట్టాను.

"నమస్తే అంకుల్."చేతులు జోడించి నమస్కరించాను.కాళ్ళకి నమస్కరించడం ఆయనదృష్టిలో అతివినయం ప్రదర్శించడం.

"వైభవ్...నువ్వు...నువ్వేనా?ఎప్పుడొచ్చావ్? బాగా మారావు.నాన్న బాగున్నాడా?"అని సోఫాలో కూర్చున్నారు.వాళ్లిద్దరూ అంకుల్ కు చెరోపక్కన కూర్చున్నారు.

ఆంటీ వెంటనే స్వయంగా ఫ్రిడ్జ్ లోని మంచినీళ్ళ బాటిల్ తీసి అంకుల్ కి ఇచ్చింది.

ఎవరిచ్చినా తీసుకోరు ఆయన. ఆయన ప్రతీ పనీ ఆమె చూసి తీరాలి.అంతచల్లని నీళ్ళని అవలీలగా సగం బాటిల్ ఖాళీ చేసారాయన.

"బై ది బై. ఇతనెవరో తెలుసా సుజి?"అడిగారాయన.

"తెలియదు డాడీ"అంది నవ్వుతూ.నవ్వితే సుజాత బుగ్గలు సొట్టలు పడేవి.ఇపుడు మరీ అందంగా ఉంది ఆమె నవ్వు.

" నీ చిన్నప్పుడు, అంటే అప్పుడు నువు నెలల పిల్లవి.  వీళ్ళ నాన్న నాకు మంచి స్నేహితుడు. ఇతను హైదరాబాద్ లో ఉద్యోగం కోసం వచ్చాడు. మన ఇంట్లో కొంతకాలం ఉన్నాడు. నిన్ను రోజూ ఎత్తుకుని ఆడించేవాడు. అప్పుడు ఇంకా తమ్ముడు పుట్టలేదు. నిన్ను, సౌజన్యని తీసుకుని మేము ఎక్కడికైనా వెళ్తుంటే నిన్ను తానే మోసేవాడు.అనుకోకుండా నాకు విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. రైలెక్కించడానికి వచ్చాడు.నేను అమ్మ రైలెక్కేసాము. గుమ్మంలో నిలబడి ఉన్న అమ్మకి అన్నయ్య నిన్ను అందించాడు. నువు అమ్మ చేతుల్లోంచి జారిపోయి అన్నయ్య దగ్గరకు వెళ్తాలని ఒకటే ఏడుపు. ఎంతగా ఏడ్చావంటే రైలు దాదాపు ఖమ్మం వచ్చేంతవరకు ఏడుస్తూనే ఉన్నావు. రైల్లోవాళ్ళు అది చూసి పోనీ ఆ అబ్బాయిని కూడా తీసుకురావలసింది...అని సలహా ఇచ్చారు.అంత హడావుడి చేసావు.హ హ హ"అంటూ చెప్పారాయన.

'ఈ అన్నయ్య నన్ను మోసాడా'అన్నంత విచిత్రంగా చూసింది సుజాత.

"అంతేకాదు అంకుల్.నేను ప్రతీ శనివారం బిర్లా టెంపుల్ కి వెళ్ళేవాడిని.ఒకసారి ఆంటీ అనుమతితో సుజాతని తీసుకుని వెళ్ళాను.సొట్టబుగ్గలతో అందంగా నవ్వుతున్న తనని చూసి పూజారిగారు నా చేతుల్లోంచి తీసుకుని స్వామి పాదాలకు సుజాతని తాకించి నుదుట బొట్టుపెట్టి ఆశీర్వదించారు. నాకు చాలా ఆనందం అనిపించింది ఆరోజు."అన్నాను.

'అలాగా.థాంక్స్ అన్నయ్యా.'అంది సుజాత.

"అన్నట్టు వైభవ్. ఈవిడ ఎవరో తెలుసా నీకు?"అంకుల్ అడిగారు.

"తెలీదండి.చూసానేమో గుర్తులేదు"అన్నాను.

"అవును నీకు తెలీదు. మా అన్నయ్యగారి ఒకే ఒక అమ్మాయి. తను ఎల్.ఐ.సి. డెవలప్మెంట్ ఆఫీసర్."అని పరిచయం చేసారు అంకుల్ ఆమెని.

"నమస్తే అమ్మా"అన్నాను నమస్కరించి.

"నమస్తే అండి. అన్నట్టు చిన్నాన్న...ఈమె మేముంటున్న పక్క వాటాలోకి అద్దెకి వచ్చారు. వాళ్ళ అమ్మ,తమ్ముడు , మరదలు, ఒక బాబు తో కలిసి ఉంటున్నారు. తనకి పెళ్లైందట. ఈవిడకి ఒక పాప కూడా ఉందట. అయితే భర్తతో విడాకులు తీసుకుందట. ఎప్పుడు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా ఆలోచిస్తూనే ఉంటుంది. తనకంటూ ఒక బ్రతుకు తెరువు కావాలని ప్రాధేయపడింది. నేను తనకి ఏజన్సీ ఇప్పించి నాకు తోచిన సహాయం చేస్తున్నాను. నీకు తెలిసిన ఎవరి చేత అయినా ఎల్ఐసి పాలసీలు చేయించిపెట్టు చిన్నాన్న. ప్లీజ్."అని ప్రాధేయపడుతున్నట్టుగా అడిగి తన బాగ్ లోంచి ఒక కార్డ్ సైజ్ ఫోటో తీసుకుని అంకుల్ చేతికిచ్చింది ఆవిడ.

అంకుల్ ఫోటో చూసి టీపాయ్ మీద పెట్టి "అమ్మా పల్లవి.నువు కోరడము ఈ చిన్నాన్న చేయకపోవడమూనా? తప్పకుండానమ్మా. ఎవరో ఎందుకు? మనముందు వైభవ్ ఉన్నాడుగా.ఏం వైభవ్? పిల్లలకి ఎల్.ఐ.సి.పాలసీస్ చేసే ఉంటావ్. విన్నావుగా

ఒక నిస్సహాయురాలికి సాయం చేసినట్టు అవుతుంది.ఎంత చిన్నదైనా పర్లేదు.ఒక పాలసీ చెయ్యి వైభవ్."

"సరే అంకుల్." అంటూ అప్రయత్నంగా నా చెయ్యి టీపాయ్ మీద నున్న ఫోటోని అందుకుంది. ఆ ఫోటో చూస్తూనే. ఆమెని ఎక్కడో చూసినట్టుగా బాగా అనిపించింది. కానీ చాలారోజులైంది...కొంచెం లావుగా తెల్లగా ఉన్న ఆమె ముఖంలో ఏదో నైరాశ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫోటోని మళ్లీ ఒకసారి పరికించి చూసి టీపాయ్ మీద పెట్టేస్తూ -

"సారీ అండి.మీ అనుమతి లేకుండా ఫోటో చూసాను"అన్నాను.

"నువు పాలసీ చేసే ఏజంట్ గారి ఫోటో చూశావనుకో.టేక్ ఇట్ ఈజీ.పాలసీ చేస్తావా మరి?"అడిగారు అంకుల్.

"తప్పకుండా చేస్తాను అంకుల్.కానీ నాకు వీలైనంత చిన్నది మాత్రం చేస్తాను."అన్నాను.

"అతని వివరాలు తీసుకో అమ్మా.ఫోన్ నెంబర్ అన్ని తీసుకో. నేను ఈలోగా డ్రెస్ మార్చుకుని వస్తాను."అంకుల్ లోపలకి వెళ్ళిపోయారు.

(మిగతా 3వ భాగంలో)



Rate this content
Log in

Similar telugu story from Drama