kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన న్యాయం - 4వ భాగం.

మనసు చేసిన న్యాయం - 4వ భాగం.

3 mins
14


మనసు చేసిన న్యాయం - 4వ భాగం.

ఆరోజు ఆగష్టు 10వ తేదీ.హైదరాబాద్ మహానగరంలో నేను మొదటిసారి కాలుమోపిన రోజు.

అలా అడుగుపెట్టవలసిన పరిస్థితి గురించి ముందుగా మీకు నేను చెప్పాలి.

నాన్నగారికి అన్నయ్య, నేను ఇద్దరమే పిల్లలం. బాంక్ లో క్లర్క్ గా పనిచేసేవారు. నాన్నగారికి చిన్నప్పటినుంచి కళలు అంటే చాలా మక్కువ. మా తాతగారు తన తల్లితండ్రులకి ఒక్కడే సుపుత్రుడట. దాదాపు ఇరవై ఎకరాల పొలం...బోలెడంత పాడీ పంట...ఒక్కగానొక్క కొడుకని అల్లారుముద్దుగా ఆయన్ని పెంచారట...దాంతో అత్తెసరు చదువు...పేకాట, తండ్రికి తెలియకుండా భోగం మేళాలతో జతకట్టడం, చేశారట. ఈవిషయం పెద్దాయనికి తెలిసి తన స్నేహితుడి కుమార్తెనిచ్చి పెళ్లిచేసేసారట. అయినా కొడుకులో మార్పురాకపోయేసరికి ఆ పెద్దాయన మానసికంగా కృంగిపోయి మంచంపట్టి మరణించారట .

ఇంకేముంది? ఉన్న పెద్ద అడ్డుతొలగిపోవడంతో ఒక్కొక్క ఎకరం అమ్మేయడం...ఆ డబ్బుతో భోగం వాళ్ళని మేపడం చూసి వాళ్ళ పెద్దామె, అదేనండీ మా తాత అమ్మగారు తిన్నగా పోలీసు స్టేషనుకు వెళ్లి ఆ భోగం వారివల్ల వూళ్ళో సంసారాలు నాశనమవుతున్నాయని చెప్పి కంప్లైంట్ చేసిందట. 

''ఆయన వస్తేనే రానిచ్చాము ఆయన ఇస్తేనే తీసుకున్నాం. ఇలా ఊరూరూ తిరిగేకన్నా..ఏ పట్నంలో పొతే మాకు నిత్యమూ పంటే. పైగా పోలీసుల గొడవ కూడా ఉండదు.ఇపుడే వూరు విడిచి పోతున్నాం. ఇవిగో ఆయన మాకిచ్చినవాటిల్లో ఖర్చు అవ్వగా మిగిలినవి...'' అని ఆ మిగిలిన డబ్బులు ఇచ్చేసి బ్రతుకుజీవుడా అంటూ ఊరువదిలి వెళ్లిపోయారట వాళ్ళు.

''పోలీసు స్టేషన్ కు వచ్చి నా పరువు తీస్తావా అమ్మా?'' అని కోప్పడ్డాడట మా తాత తన తల్లిమీద. 

''నువ్వు వాళ్లకొంపల్లో చేరి చేసిన భాగోతమంతా ఊరంతా కధలుగా చెప్పుకుంటున్నారు. నీ కుటుంబం పేరు నువ్వే వీధిన పెట్టుకున్నావు. ఇంట్లో నిక్షేపంలాంటి పెళ్లామ్ ఉండగా నీకిదేం ముండల జబ్బురా నాయనా?ఏదైనా నాటకంవేసి ఆనాటి తెల్ల దొరల అన్యాయాలు ప్రజలకి తెలియచెయ్యి. భగత్సింగ్, అల్లూరి సీతారామరాజు...ఇలాంటి నాటకాలు వేస్తే పేరుకు పేరు వస్తుంది...నీ ముచ్చటా తీరుతుంది. అంతేగాని మరోసారి అలాంటి తప్పుడు పనులు చేయకు'' అని మందలించి హితబోధ చేశారట. 

అంతే. ఊరిలో నాటక సమాజాన్ని స్థాపించి తల్లిచెప్పిన దేశభక్తుల కధలు నాటకాలుగా రాసుకుని నాటకాలు వేసేవారట. ఆయనకీ మాలాగే ఇద్దరు పిల్లలు. నాన్నగారు..చిన్నాన్న. 

నాన్నగారు బాగాచదివేవారట. ఎస్.ఎస్.ఎల్.సి. లోకి నాన్నగారు వచ్చేసరికే మొత్తం ఆస్తి నాటక సమాజాలను పోషించడానికి తగలేసి, సొంత ఇల్లు మాత్రం మిగుల్చుకున్నారట. ఆ నాటకాలలో ఏ పాత్రధారి అయినా రాకపోతే వయసుకు మించి ఎదిగిపోయిన నాన్నగారిని ఆ పాత్ర అప్పటికప్పుడు వేయించేవారట. 

ఒకసారి నాన్నగారు అలా నటించడం చూసిన ఆయన మాస్టారు ''ఒరేయ్ గంగాధరం. నువ్వు పొరపాటున కూడా నాటకాల్లో నటించి ఆ కళామతల్లికి అప్రతిష్ట తీసుకురాకురా..'' అని నమస్కరించి వెళ్లిపోయారట. దాంతో నాన్నగారికి చాలా బాధ కలిగిందట.

తాను పెద్దయ్యాకా ఏ వూరిలో ఉద్యోగం చేస్తే ఆవూరిలో నటనపట్ల అభిరుచి గల అందరిని పోగుచేసి ఆవూరిపేరుతో ''డ్రమాటిక్ అసోసియేషన్ '' ఏర్పాటుచేసి ఉత్తమ నటుడు అవార్డు పొందకపోతే నా పేరు గంగాధరమే కాదు.నీ పాదాలమీద ఆన ...నటరాజా..'' అని శపధం చేశారట. తాతగారు నాన్నగారిని చదువుకోనివ్వకుండా పొలంపనులన్నీ ఆయనకే చెప్పేవారట. చివరకు పబ్లిక్ పరీక్షకు వెళ్ళడానికి చొక్కా, పాంటు కూడా లేకపోతే దుప్పటి కట్టుకుని వెళ్లి పరీక్షలు రాశారట. అప్పుడు పర్యవేక్షణకు వచ్చిన ఒక అధికారి అది చూసి పరీక్ష అయ్యాకా తనని కలవమన్నారట. నాన్నగారు వెళ్లి కలిస్తే, ఆయన నాన్నగారి కధ విని జాలిపడి ''ఈ చీటీ తీసుకువచ్చిన అబ్బాయికి, నేను వచ్చినట్టుగానే భావించి నీ బ్యాంకు లో ఏదో ఒక ఉద్యోగం ఇవ్వు.'' అని తన స్నేహితుడైన ఒక బ్యాంకు ఆఫీసర్ గారి ఇంటికి పంపారట.ఆయన నాన్నగారు లెక్కలు బాగా చేస్తారని తెలుసుకుని గుమాస్తా ఉద్యోగం ఇచ్చారట. 

ఆలా నాన్నగారు చదువుకుని బ్యాంకులో ఉద్యోగం సంపాదించారు. పెళ్లి అయ్యాకా అమ్మని వెంటబెట్టుకుని బదిలీ అయిన ప్రతీ వూరిలోను ''డ్రమాటిక్ అసోషియేషన్'' ఏర్పాటు చేసి తానే స్వయంగా సాంఘిక నాటికలు రాసి దర్శకత్వం వహించి...అందులో హీరోగా నటిస్తూ ప్రదర్శించారట. ఆ నాటికలో నాన్నగారికి ఉత్తమ నటుడు, ఉత్తమ రచన, ఉత్తమ దర్శకత్వం అవార్డులు అందుకున్నారట. 

ఆ మరునాడే తమ వూరు వెళ్లి తనను 'నటించవద్దురా' అని చెప్పిన మాష్టారింటికి వెళ్లి ఆ అవార్డులు చూపించారట. ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించి '' నిజంగా ఆరోజు నీ నటన చూసి కళామతల్లికి దౌర్భాగ్యం పట్టింది అనుకుని చిన్నవాడవైన నీకు నమస్కరించానురా గంగాధరం. నన్ను మన్నించరా...ఈరోజు చెబుతున్నానురా....నీలో శక్తి ఉన్నంతవరకు నటనను విడవకురా...ఆ కళామతల్లికి నిజమైన సేవను చేయరా. అటు వుద్యోగం చేసుకుంటూ ఇటు మొదటి పరిషత్తు పోటీలలోనే మూడు అవార్డులు పొందడం అంటే సామాన్య విషయం కాదు. నీలాంటి నిస్వార్ధపరులే ఆ కళామతల్లికి బతికించాలి'' అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారట. 

అలా కొవ్వూరు బ్యాంక్ లో తనకు పరిచయమైనవారే అంకుల్ అన్నయ్య ''జయేంద్ర''గారు. అక్కడ పనిచేసిన మూడుసంవత్సరాలలో నాన్నగారు, జయేంద్రగారు ప్రాణస్నేహితులైపోయారట. సెలవులప్పుడు జయేంద్రగారి వూరు నాన్నగారు కూడా వెళ్ళినప్పుడు అంకుల్ ''ఉపేంద్ర'' తొమ్మిదవతరగతి చదువుతున్నారట, ఆ వూరిలో కూడా నాటిక ప్రదర్శించారట. తన అన్నయ్యతో పాటు నాన్నగారినికూడా ''చిన్నన్నయ్య'' అని పిలిచేవారట అంకుల్. వాళ్ళ వూరు వెళ్ళినప్పుడల్లా అన్నయ్యల ఇద్దరిమధ్యన పడుకుని వాళ్ళ కబుర్లు అన్ని వినేవారట అంకుల్. 

అయితే దురదృష్టవశాత్తు స్టేజి మీద నాటిక ప్రదర్శన సమయంలో గుండెపోటువచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించారట ''జయేంద్ర'' అంకుల్. ఆయనకు భార్య, ఒకే ఒక కూతురు పల్లవి.ఆ పల్లవిగారే నాచేత ఎల్.ఐ.సి.పాలసీ చేయించారు. అప్పటికి ''జయేంద్ర'' అంకుల్ ఇంజనీరింగ్ చదువుతున్నారట . ఎంటెక్ చేసాకా పెద్దలద్వారా తమకు వచ్చిన పొలాలన్నింటిని అమ్మేసి తల్లిలాంటి వదినగారితో, పల్లవిగారితో  వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డారట. 

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే...ఆనాటి కుటుంబాలు, అనుబంధాలు, మంచి, చెడు అలవాట్లు , స్నేహితుల మధ్య కేవలం మాటకే గౌరవించి ఉద్యోగం ఇవ్వగలిగిన నిర్మల స్నేహం...ఇవన్నీ ఉండేవి. మరి ఈనాడు?.....  

(మిగతా 5వ భాగం లో)



Rate this content
Log in

Similar telugu story from Drama