kottapalli udayababu

Tragedy Classics Inspirational

4  

kottapalli udayababu

Tragedy Classics Inspirational

ద్రోణుడు మరణించాడు!!!(కధ)

ద్రోణుడు మరణించాడు!!!(కధ)

7 mins
23


ద్రోణుడు మరణించాడు!!!(కధ)

               “”నటరాజ కళా నిలయం’’ అనే అక్షరాలు హెడ్ లైట్ల కాంతిలో అత్యద్భుతంగా మెరుస్తూ ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రాంగణానికి వింత శోభను కలుగ చేస్తున్నాయి.

 

‘’రాష్ట్ర స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డును రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకున్న శ్రీ శివాజీ గారికి సన్మాన సభ” అని వ్రాయబడిన బ్యానరు సిల్కు ధగధగలతో మెరుస్తూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాటు చేయబడ్డ ఆ సన్మాన సభకు చాలా ప్రత్యేకత ఉంది. ఆరోజు ‘’నటరాజ కళా నిలయం’’ రజతోత్సవ సంరంభం కూడా. నటరాజ కళా నిలయం స్థాపకుడు, శాశ్వత గౌరవ అధ్యక్షుడు అయిన భీమారావు గారు ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు.

 

‘’ఈనాడు నాటక రంగం దీనాతి దీన స్థితిలో ఉంది. నాటక రంగం నుంచి సినీ పరిశ్రమకు వెళ్లి అక్కడి కుటిల రాజకీయాలకు, మోసపూరిత వాతావరణానికి తట్టుకోలేక కళామతల్లి ముద్దుబిడ్డలమని చెప్పుకోలేక బ్రతుకు ఈడుస్తున్నారు కొందరు. తమ అంగ బలంతో, అర్థ బలం తో రాజకీయ రంగ ప్రవేశం చేసి రాజ్యమేలుతున్నారు కొందరు. అటువంటి పరిస్థితులలో తన అత్యుత్తమ నటనా కౌశలంతో బండరాయి లాంటి హృదయాలను కూడా తన కరుణరసంతో కలిగించగల ఒక మహానటుడు, మన సభ్యుడు అయిన చిరంజీవి శివాజీని మన రాష్ట్ర ప్రభుత్వం వారు గుర్తించి ఉత్తమ నటుడి అవార్డుగా ‘’బంగారు నంది’’ అవార్డు, పదివేలరూపాయల నగదు ఇచ్చి సన్మానించడం మన నాటక రంగ సభ్యులందరికీ రసవత్తరమైన పండుగ.

శివాజీ వంటి నట దిగ్గజం మరింతగా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని మన నాటకరంగాన్ని అభిమానులందరూ గర్వించేలా దిశ దిశలా వ్యాపింప చేయాలని కోరుతూ ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడు చిరంజీవి శివాజీ కి సన్మానం జరుగుతుంది. ఈ అవకాశం మనకు కలిగించిన రాష్ట్ర ప్రభుత్వానికి మన కళానిలయం తరఫున కృతజ్ఞతలు అందజేస్తూ, ఆయన మనం చేసే సన్మానం స్వీకరించడానికి ప్రత్యేక ఆసనంలో కూర్చుని వలసినదిగా కోరుతున్నాను.’’

 

అనంతరం వేద పండితులు వేదపఠనం చేస్తుండగా, కార్పొరేషన్ మేయర్ శివాజీని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. సన్మాన పత్రం చదువుతుండగా పండితుల ఆశీర్వచనం జరిగింది. పావు గంట పైనే జరిగిన ఈ కార్యక్రమం పూర్తి అయ్యాక శివాజీ సన్మాన గ్రహీత గా మైకు ముందుకు వచ్చాడు.

 

‘’ సభకు నమస్కారం. కళా ప్రియులకు, నన్ను అభిమానంతో ఆశీర్వదించిన పెద్దలకు, సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముందుగా మీరు నా పట్ల అభిమానంతో చేసిన ఈ సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కృషి చేస్తే రాయి కూడా అర్థమవుతుంది. మట్టిని కూడా వెన్నముద్దగా చేసి మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. మరి ఆ శక్తిని, ఆ స్ఫూర్తిని కలగచేసే ఒక వ్యక్తి ఉండాలిగా!

ఉన్నారు. అణువు అణువు కరుణ తో నిండిన ఆ హృదయం కలిగిన ఆ దివ్య మూర్తి ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు కానీ, బతికే ఉన్నాడు అని తెలుసు. ఆయన నాటకాలే నా నటనకు స్ఫూర్తి. ఆయనే లేకుంటే ఈ శివాజీయే లేడు. ఆ మహానుభావుడికి శిష్యుడైన నేను నా తుదిశ్వాస విడిచే లోగా ‘ గురుదక్షిణ’ సమర్పించుకోవాలని నా ఆకాంక్ష. అందుకే... అందుకే... నన్ను గౌరవించి ఇచ్చిన పది వేల రూపాయల క్యాష్ అవార్డును ఈ కళా నిలయం సిఫార్సు చేసే ఒక వృద్ధ కళాకారునికి నా గురువు పేరు మీదుగా అందించాలని నిర్ణయించుకున్నాను. ఇదే నా కనిపించని గురువుకు ఈ తెలియని శిష్యుడు సమర్పించుకునే గురుదక్షిణ. ఈ సభ ముగిసేలోగా పెద్దలు గురుతుల్యులు శ్రీ భీమారావు గారిని ఆ పేరు ను వెల్లడించవలసిందిగా కోరుతున్నాను. నన్ను ఈ స్థాయికి పెంచిన కళామతల్లికి నేను ఇచ్చే నూలుపోగులాంటి సహాయం అందుకునే ఆ కళాకారుడు ఈ సభలో ఉంటే వేదిక మీదకు పిలువవలసిందిగానూ. లేకుంటే కనీసం ఆయన పేరుని సూచించ వలసిందిగా కోరుతూ నా పట్ల మీ అభిమానానికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ - నమస్తే.’’

 

 అంతే. ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రాంగణమంతా చప్పట్లతో అదేపనిగా మారుమ్రోగిపోయింది. శివాజీ నోటివెంట వృద్ధ కళాకారునికి సహాయం అన్న మాట వినగానే భీమారావు గారు తీవ్రంగా స్పందించారు. ఆయన మాట అంటే కళానిలయం సభ్యులందరికీ వేదవాక్కు. స్టేజి మీద ఉన్న పెద్దలందరూ భీమారావు గారు ఎవరిని నిర్ణయించినా అభ్యంతరం లేదని తమ అంగీకారాన్ని తెలియజేశారు.

 

 ప్రేక్షకులు కూడా తమ హర్షధ్వానాలతో తమ అంగీకారాన్ని తెలియజేశారు. సహాయం అందుకునే వ్యక్తి పేరును సూచించడానికి మళ్ళీ ముందుకు వచ్చిన భీమారావు గారు ఇలా అన్నారు,

‘’ రెండవసారి మైకు ముందుకు వచ్చి మీకు బోర్ కొట్టను. నటనలోనే ఉన్నతుడు అనిపించుకున్న 35 ఏళ్ళు శివాజీ మానవత్వాన్ని చూపించటంలో కూడా మహోన్నతుడు అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు అందరి అనుమతితో ఆ వృద్ధ కళాకారుని పేరును ప్రకటిస్తున్నాను. వారు నాకు గురుతుల్యులు నేను ఆయన వద్ద ఓనమాలు నేర్చుకున్న వాడిని. నా గురువునే తన గురువుగా భావించి ఆయనకు ఈ క్యాష్ అవార్డు పదివేల రూపాయలు చెక్కు చేయవలసిందిగా చిరంజీవి శివాజీని కోరుతున్నాను.  ఆయన పేరు సూర్య ప్రకాశరావు గారు. దయచేసి సూర్య ప్రకాశరావు గారు ఎక్కడ ఉన్నా వేదిక మీదకు రావాలి. ఆయన 77 ఏళ్ల వృద్ధుడు వారిని సగౌరవంగా తోడ్కొని రావలసిందిగా కార్యకర్తలను కోరుతున్నాను. శ్రీ సూర్య ప్రకాశ్ రావు గారు....’’ సభ అంతా మరల కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది.

 

అయిదు నిమిషాలు గడిచినా ఎవరూ ముందుకు రాలేదు. అందరూ ఉత్కంఠతో మరో ఐదు నిమిషాలు చూశారు. ఎవరు వేదిక వైపు రాలేదు.

 

భీమారావు గారు ప్రధాన కార్యదర్శి రఘునాధ్ ని అడిగారు’’అదేమిటి రఘూ ... సూర్యప్రకాశ రావు గారికి ప్రత్యేకంగా ఆహ్వానం పంపానే...ఆయన సభకు రాలేదా?’’

 

‘’వచ్చారు సార్. నేను చూశాను. ఈ పనుల ఒత్తిడిలో పలకరించడం కుదరలేదు. ఆయన ఆఖారీ వరుసలో ఉన్నారు. నేను వేదిక వద్ద ఉండిపోయాను.’’అన్నాడతను ఆయనను కలవలేకపోయిన బాధను వ్యక్తం చేస్తూ.

*********

 

‘’ఎవరు బాబు? మీకు ఎవరు కావాలి?’’

 దారిలోనే ఎదురు ప్రశ్నలు వేస్తూ అడిగిన అతనిని ఎగాదిగా చూశాడు ఆ ముసలాయన. నుదుట కుంకుమ బొట్టు, ఖాకీ యూనిఫారం, కళ్ళజోడు, కాళ్లకు హవాయి చెప్పులతో ఉన్న అతని రూపం చూస్తూనే ఆ ఇంటి వాచ్మెన్ అని చెప్పవచ్చు.

‘’ మీ అయ్య గారు ఉన్నారా?’’ అడిగాడు ముసలాయన

‘’ఉన్నారు బాబు. ఇంకా నిద్ర లేవ లేదు. ‘’

‘’ నీ పేరు?’’

‘’ అప్పలస్వామి.’’

‘’చూడు అప్పలస్వామి.నేను మీ అయ్య గారు లేచెంతవరకు వెయిట్ చేస్తాను. నాకు పని ఏమీ లేదు. సరేనా? నేను ఎక్కడ కూర్చోవాలో చూపించి ఏ పాత పేపరు అయినా నా మొహాన పడేస్తే చదువుకుంటూ ఉంటాను.- మీ అయ్య గారు వచ్చేంతవరకు.’’

ఎంతో కలుపుగోలుతనంగా మాట్లాడుతూనే వరండా మెట్లెక్కి హాల్లోకి వచ్చిన ఆయనని విజిటర్స్ రూములో కూర్చోబెట్టాక తప్పింది కాదు అప్పలస్వామికి.

 కాసేపటి తర్వాత –

‘’ బాబు గారు తమరు వచ్చి రెండు గంటల పైనే అయింది. కాఫీ ఏమైనా తెమ్మంటారా? ‘’అడిగాడు అప్పలస్వామి.

‘’ఉదయం పది గంటలు దాటింది. ఇంతవరకు మీ అయ్య గారు లేవలేదు... అంటే అసలు ఇంట్లో ఉన్నారంటావా లేక నాతో అబద్ధం చెప్తున్నావా?’’ సూటిగా ముసలాయన వేసిన ప్రశ్నకు అప్పలస్వామి కంగారు పడిపోయాడు.

‘’ అబ్బే. అమ్మ మీద ఒట్టు. ఇందాక ధైర్యం చేసి లేపబోయాను. తనంతట తను లేచెంతవరకు నిద్ర లేపితే తోలు తీస్తా అన్నారు బాబు’’

‘’ సరే అయితే. మళ్లీ రేపు వస్తాను’’ అని ముందుకు అడుగు వేయబోయిన ముసలాయనని ఆపాడు అప్పలస్వామి.

‘’ మళ్లీ ఏంటయ్యా?’’

‘’ ఎవరు వచ్చారు అని చెప్పమన్నారయ్యా?’’

‘’ సూర్యప్రకాశరావు... 77 ఏళ్ల సూర్యప్రకాశరావు వచ్చి వెళ్లారని చెప్పు.’’

 

*******

 

మరుసటి రోజు ఉదయం పదిగంటలకు ఎండలో చెమటలు కక్కుతూ వచ్చిన సూర్యప్రకాశరావు గారిని చూస్తూనే అప్పలస్వామి నాలిక కరుచుకున్నాడు.

‘’మీ అయ్య గారు ఈ వేళ కూడా ఇంకా లేవలేదా?’’ అడిగారాయన.

‘’ లేవకపోవడం ఏంటి అయ్యగారు? ఈవేళ ఏడు గంటలకే లేచి పూలరంగడులా తయారై వెళ్ళిపోయారు.’’ ‘’వెళ్లిపోయారా?’’ హతాశుడై శూన్యం లోకి చూస్తూ అలాగే ఉండిపోయారాయన.

‘’ఇంతకీ మీరు వచ్చిన పని ఏమిటి బాబు?’’

ఆయన అంతలోనే సీరియస్ అయిపోయారు. ఒక్క క్షణం తటపటాయించారు.

‘’మీకు ఇబ్బంది అయితే చెప్పద్దు బాబు’’ అన్నాడు అప్పలస్వామి నొచ్చుకుంటు.

‘’ అబ్బే. ఆత్మాభిమానం అడ్డొస్తోంది అప్పలస్వామి. మొన్న జరిగిన సన్మాన సభలో, ఆయాసంగా ఉంటే నేను సభ పూర్తవకుండానే ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత రోజు అంటే మొన్న నటరాజ కళా నిలయం స్థాపకుడు భీమరావు గారిని, నా చిన్ననాటి స్నేహితుడు, శివాజీ బాబు ఇస్తానన్న కేష్ అవార్డుకు నన్ను ఎంపిక చేశారని చెప్పి నన్ను చూసి వెళ్ళాడు. నా మనవడికి నా మనవరాలీ కి పరీక్ష ఫీజు కట్టాలి. ఈ డబ్బు ఉపయోగిస్తామని ఆశపడ్డాను.వాళ్ల దురదృష్టం ఏమిటో... నాకు శివాజీని కలిసే అవకాశం రావడం

లేదు.’’అంటూ ఇంకా అక్కడ పని లేనట్టుగా నిర్వికారంగా లేచి ఇంటిదారి పట్టారు సూర్యప్రకాశరావు గారు.

****************

 

మరుసటి రోజు ఉదయం 7:00 గంటల వేల శివాజీ హాల్లో పేపర్ చదువుకుంటూ కాఫీ తాగుతున్నాడు. అప్పలస్వామి పద్దెనిమిదేళ్ళ నూనూగు మీసాల కుర్రవాడిని వెంటబెట్టుకు వచ్చాడు.

‘ ఏమిటన్నట్లు’ చిరాగ్గా చూశాడు శివాజీ.

ఆ కుర్రవాడు శివాజీకి ఒక కవరు అందించాడు. అందులోంచి రంగు మాసిన  పాత లెటర్-హెడ్ కాయితాలమీద ముత్యాలసరాలు లాంటి అక్షరాలతో పొదగబడిన ఉత్తరాన్ని బయటకు తీశాడు. పైపైన చదివేసి పక్కన పెట్టేద్దాం అనుకున్న శివాజీ అంతరంగం మీద చర్నాకోల ఝుళిపిస్తున్నట్టుగా వ్రాయబడిన వాక్యాలను ఏకాగ్రతతో చదవడం మొదలు పెట్టిన అతను కళ్ల నీళ్ళు తిరుగుతూఉండగానే చదవసాగాడు.

 

 అందులో ఇలా ఉంది.

‘ మాననీయులు, గౌరవనీయులు శివాజీ గారికి కళాభివందనాలు. నా పేరు సూర్య ప్రకాశరావు. సి.ఎస్.రావు అనేది నా నిక్ నేమ్. నేను కళకు అంకితమై, ఉన్న ఆస్తిని సర్వనాశనం చేసి భార్యాబిడ్డలను చెందనాడుకుని కీర్తి ప్రతిష్టలనే ఎండమావుల వెనుక సుదూర తీరాల పరిగెత్తి అలిసిపోయే సరికి నా జీవితం కరిగిపోయింది.

 

ఇంతటి చెడు జీవితంలో కళను నమ్ముకుని నేను సాధించింది ఏమీ లేదు అనుకుంటే పొరపాటే. ఆనాటి నా కీర్తిప్రతిష్టలన్నీ ఆ కళామతల్లి పెట్టిన భిక్షే. మిగతా ఈనాటి జీవితం కేవలం నా స్వయంకృతాపరాధం.

 

ఇన్నేళ్ల జీవితంలో నేను మర్చిపోలేని అపురూప సంఘటన ఒకటి మీకు వివరిస్తున్నాను. నేను ఇంకా చిత్రా రంగంలో అడుగు పెట్టని రోజులు. నేను రచించి దర్శకత్వం వహించిన నాటకాన్ని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ హాల్ లో ప్రదర్శిస్తున్న రోజు. నేను మేకప్ రూమ్ లో మేకప్ వేసుకుంటున్నాను. ఒక 7 ఏళ్ల కుర్రాడు గడపను ఆనుకొని నేను మేకప్ అయ్యే విధానాన్ని పరిశీలిస్తున్నాడు.

‘ లోపలకు రా’ అన్నాను.

‘ భయంగా ఉంది’ అన్నాడు.

‘ నీ పేరు?’ అడిగాను.

‘’ రాజు’’

‘’ నీకు నాటకాలు అంటే ఇష్టమా?’’

‘’ చాలా ఇష్టం సార్. మీ పేరు పేపర్లలో మీ ఫొటోలు చూడ్డం నాకు ఎంతో ఇష్టం. మీరు కరుణ రసం ఎంతో బాగా పోషిస్తారని మా అమ్మఅస్తమానూ అంటుంది. మీరు నటిస్తుంటే చూడాలని నా కోరిక. అందుకే అమ్మతో చెప్పకుండా వచ్చాను. నాటికి చూశాక వెళ్తాను.’’

 ఆరోజు హాలంతా కిటకిటలాడిపోతోంది. అయినా నేను వాడిని ముందు సీట్లో కూర్చో పెట్టించాను. మధ్య మధ్యలో నిద్ర వస్తుండగా కళ్ళు నులుముకుని ఎక్కడ ఈ దృశ్యం మిస్ అయిపోతానో అని వాడు చూపిన ఉత్కంఠను నేను ఎన్నడూ మర్చిపోలేను. నాటకం పూర్తిగా చూసేసరికి వాడు కుర్చీలోనే నిద్రపోతూ కనిపించాడు. వాడిని లేపి మొఖం కడిగించి వాడితో ఫోటో తీయించుకున్నాను. నా ఆ నాటకానికి బాలప్రేక్షకుడు వాడు ఒక్కడే. అది ఒక తడి జ్ఞాపకం. నా నటనకు అలాంటి అభిరుచి ఉన్న వాడే వారసుడు అనుకున్నాను.

 

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఎండమావుల వెంట పరిగెత్తి బంగారు జీవితాన్ని పాడు చేసుకోకుండా నా తరువాతి తరం నటునిగా మీకు ఇచ్చే పనికిమాలిన సలహా – ‘ జీవితాన్ని అద్దంలా చూసుకోమని’. ఆత్మాభిమానం చంపుకుని రెండు రోజులు మీ ఇంటికి వచ్చాను. రాత్రి నుంచి విపరీతమైన ఆయాసం తో ఊపిరి పీల్చడం కష్టంగా ఉంది. మీరు చేస్తానన్న ఆర్థిక సహాయం పొందడానికి నటరాజ కళా నిలయం వారు ఇచ్చిన సిఫార్సు లెటర్ కాపీ కూడా దీనితో జతపరుస్తున్నాను.

 

మీకు అభ్యంతరం ఇబ్బంది లేకుంటే మీరు చేస్తానన్న ఆర్థిక సహాయం నా మనవడికి ఇచ్చి పంపండి. నేను స్వయంగా రాలేకపోతున్నందుకు మన్నించండి. ‘కళాకారుడు ఎప్పుడూ ఆర్థికంగా కుచేలుడే’ అని అసహ్యించుకోకండి. మీ సహాయానికి, సహాయం చేస్తానన్న మాట కి ఆజన్మాంతం కృతజ్నుడీని. మిమ్మల్ని ఆ నటరాజు సదా దీవించాలని కోరుతూ...

మీ సహాయం అర్ధించే

సి.ఎస్.రావు( సూర్యప్రకాశరావు.)’’

 

ఉత్తరం చదివిన వెంటనే ఒక్క సారి చేతుల్లో ముఖం దాచుకుని భోరున విలపించసాగాడు శివాజి.

తెల్లబోయి వింతగా చూడసాగారు అప్పలస్వామి. ఆ వచ్చిన అబ్బాయి.

ఐదు నిమిషాల అనంతరం తేరుకున్న అతను గబగబా లేచి లోపలకు వెళ్లి మరో ఐదు నిముషాలలో తయారై వచ్చాడు. అతని సిల్కు లాల్చీ జేబులో హడావుడిగా దోపుకున్న వంద రూపాయల నోట్ల కట్ట తొంగిచూస్తోంది.

‘’ బాబు ..నీ పేరు?’’

‘’ ప్రకాష్ రాజ్!”

 శివాజీ అతనితో అప్పలస్వామి వెంటరాగా బయల్దేరాడు సూర్యప్రకాశరావు గారి ఇంటికి.

 దారి లో ప్రకాష్ రాజ్ చెప్పిన విషయాలన్నీ విని జీర్ణించుకోలేకపోయాడు. ఎంత వద్దనుకున్నా తన నిర్లక్ష్యం ఒక వ్యక్తిని ఎంతటి వేదనకు గురి చేసిందో అర్ధమవుతూ ఉంటే అతని కళ్ళు ఊట బావిలా చమరుస్తూ, మనసు పొరల మధ్య దాగున్న దుర్గుణాలన్నీ కరిగి కన్నీరై జారిపోసాగాయి.

 

 అతను గుమ్మంలో అడుగుపెడుతూనే ఆయాసంతో రొప్పుతూ ఉన్న సూర్యప్రకాశరావు గారి పాదాలకు నమస్కరించి ‘’గురువుగారు !నన్ను... నన్ను... క్షమించండి “అంటూ బావురుమన్నాడు .

ఎవరికీ ఏమీ అర్థం కాని ఆ పరిస్థితిలో నెమ్మదిగా కళ్ళు తెరిచిన రావు గారీ పక్కనే కూర్చున్నాడు శివాజీ.

 

‘’ గురువు గారు... నేను... నేను రాజుని. మీరు మీ జీవితంలో జ్ఞాపకంగా ఉంచుకున్న శివాజీ రాజుని. ఇదిగో మనం ఇద్దరం తీయించుకున్న ఫోటో’’ అంటూ శివాజీ తన జేబులోంచి ఫోటోతో పాటు నోట్ల కట్టను కూడా ఆయనకు చేతులకు అందించాడు.

 

 ఆయన కళ్ళల్లో వింత శక్తి ప్రవేశించి నట్టుగా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి ఫోటోను పరిశీలించి చూసారు. నెమ్మదిగా మనవడి సాయంతో పైకి లేచిన ఆయన శివాజీని అత్యంత సంతోషంతో కౌగిలించుకున్నారు.

 

‘’ బాబు రాజు ‘’అంటూ మనవడు రాజు చేతిని శివాజీ చేతుల్లో ఉంచారు.

‘’ నిన్ను... నిన్ను కలుస్తాను అని అనుకోలేదు రా.! నా మనవడికి నీ పేరు పెట్టి నిన్ను వాడిలో చూసుకుంటున్నాను. నేను నిన్ను ఏదీ కోరను బాబు. వాళ్ళు తండ్రి లేని పిల్లలు. వాడు చదువుకుని తన కాళ్లమీద తాను నిలబడి తన కుటుంబాన్ని పోషించుకునే చేయూత ఇవ్వు. ఇదొక్కటే నా కోరిక.’’

ముద్దగా వస్తున్న మాటలు ఆగిపోయి అచేతనంగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయిన ఆయనను చూస్తూనే అందరూ గొల్లుమన్నారు.

 

 ఏకలవ్య శిష్యరికం చేసి గురువును ప్రత్యక్షంగా సేవించి ప్రత్యక్ష ప్రేరణగా, స్పూర్తిగా తీసుకుని గురువుని మించిన శిష్యుడు అయిన శివాజీరాజూ చేతుల్లో, భారత యుద్ధంలో ద్రోణాచార్యుడు మరణించినట్టుగానే ఈ ద్రోణుడూ మరణించాడు. అయితే ఇద్దరికీ ఒకటే తేడా .

ఆత్మ సంతృప్తి!

 

సమాప్తం

 

 

 

 

 



Rate this content
Log in

Similar telugu story from Tragedy