kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన న్యాయం - 7 వ భాగం

మనసు చేసిన న్యాయం - 7 వ భాగం

4 mins
5


మనసు చేసిన న్యాయం - 7 వ భాగం 

'ఇపుడు చెప్పండి. మాన మర్యాదలు లేనిది మీకా మాకా? మీ మనస్తత్వం తెలిసి విజయ నేను కొన్న చీరలు మీకు చూపించడం దాని తప్పు. పోనీ చూపించింది అనుకుందాం. మీకు నచ్చిన చీర తీసుకుని మీ బాగ్ లో పెట్టేసుకుంటే అదేం చేయగలదు? పెద్దవారు మీకు తెలియాలికదా...అది ఇపుడు మీ ఇంటి పిల్ల కాదు. మాఇంటి కోడలు నా భార్య. పైగా ఆచీర కట్టుకు వచ్చి, దానికి నేను కొన్న చెప్పులు వేసుకురావడానికి మీకుండాలి మాన మర్యాదలు. మీ ఆయన అవికూడా మీకు కొనిపెట్టలేరా? ఆ చీర మీరు సింగారించుకుని మాఇంటికి రావడం ఇంకో తప్పు. పైగా 'నేను చేసింది తప్పా?' అని అడగడం మరో తప్పు. నేను నా భార్యతో కలిసి సినిమాకో, షికారుకో వెళ్ళేటప్పుడు తాను ప్రత్యేకంగా కనిపించాలని ఆ చీరలు కొన్నాను. మర్యాద మరిచిపోయి అల్లుడనే గౌరవం లేకుండా నన్ను అడిగారు కాబట్టే నేను కూడా మిమ్మల్ని అలా అడిగాను.మీరింకా ముందుకు పోయి 'నేను బజారు దాన్ని అనుకున్నారా?' అన్న మీ ప్రశ్నకు సమాధానం ఒకసారి వీధిలోకి వెళ్లి అడగండి. చుట్టుపక్కల వాళ్ళే చెబుతారు.'' అన్నాడు అన్నయ్య సీరియస్ గా.

''అమ్మోఅమ్మో...ఎంత గుండెలు దీసిన బంటు కుటుంబం కాకపోతే నిన్ను నామీదకి ఉసిగొల్పి మీ నాన్నగారు లోపలకి వెళ్ళి పడుకుంటాడా? చూస్తాను.ఈ సంగతి నలుగురిలోనూ పెట్టి నేను ఏం తప్పు చేసానో పెద్దమనుషుల మధ్యే అడుగుతాను.'' అందావిడ ముక్కు చీదుతూ.

'' అమ్మా. మతి ఉండే మాట్లాడుతున్నావా? ఒక విషయంలోంచి ఒకదానిలోకి లాగి అలా పెడార్ధాలు తీస్తావేమిటి? నేను సుఖంగా ఉండాలని పెళ్లి చేసావా? లేదా నా కాపురాన్ని పదిమందిలో పెట్టి వీధిపాలు చేయదలుచుకున్నావా? ఆడపిల్లను ఇచ్చుకున్నదానివి వియ్యాలవారింటికి వచ్చి ఇలా మాట్లాడానని పది మంది పెద్దల్లో చెబితే వాళ్ళే నీకు బుద్ధి చెబుతారు. నువ్వు చేస్తున్నది తప్పమ్మా . దయచేసి ఈ గొడవ ఇంతటితో వదిలేసి తమ్ముడిని, చెల్లెళ్లని తీసుకుని వెళ్ళిపోమ్మా...నా కాపురం నన్ను చేసుకొనీ అమ్మా...ప్లీజ్...'' అని వదిన అత్తయ్యగారి కాళ్ళమీద పడింది... వెక్కి వెక్కి ఏడుస్తూ. 

ఆవిడ రోషంగా ముక్కు ఎగరేసింది. 

''భేష్...బాగుందే...చాలా బాగుంది. నిజంగా నేను తప్పే చేసాను. నాకు చీరలు, నగలు, ఫ్యాషన్ల పిచ్చి అని నీకు తెలుసు. తెలిసీ చీరలు చూపించావు...'' ఆవిడ ఇంకా ఏదోచెప్పబోతోంది.

''పెళ్లయిన మూడునెలలకి మొదటిసారి నిన్ను చూసిన ఆనందం ఒక పక్క...ఆయన నన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నారన్న సంతోషం నీతో పంచుకోవాలని మరోపక్క...అంతే తప్ప నేను నీగురించి అసలు ఆలోచించనేలేదు.''

ఆ మాటలు వింటూ ఆమె వెటకారంగా నవ్వింది .

''అవునే...పెళ్లయి అత్తారింటికి వచ్ఛేసిన ఆడపిల్లని మొదటి మూడునెలలూ ప్రాణంగా చూసుకున్నారనుకో...ఇంక ఆపిల్ల అత్తవారి తరపునే మాట్లాడుతుంది. అలా మాట్లాడకపోతే ఏ మందో మాకో పెట్టి మాట్లాడించే తెలివితేటలూ కూడా ఉంటాయి కొందరికి. ఏదైతేనేం...ఈ ఇంటివాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఏదోనా పిల్ల అనే చనువుతో తెలిసో, తెలియకో చేసిన పని తప్పో రైటో వాళ్ళనే అడిగి తెలుసుకుందామని ఆ పెద్దాయన దగ్గరకొస్తే కొడుకును రెచ్చగొట్టి వెళ్లి ఆ తండ్రి పడుకున్నాడు. కొడుకును వద్దంటూనే ఆపినట్టు నటించింది మీ అత్తగారు. పొరపాటున అదేచీర కట్టుకు వచ్చిన పాపానికి అల్లుడి చేత ఎన్ని మాటలు పడాలో అన్ని పడ్డాను. చివరకి కన్నకూతురిచేత కూడా ' వెళ్ళిపోమ్మా' అనిపించుకున్నాను. ఎంత అదృష్టం నాకు ? ఈ రోజు పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో...ముందు రాకూడదనే అనుకున్నాను. తమ్ముడు చెల్లెళ్ళు అక్కని చూసి వద్దాం అన్నారని, తింగరి మొహంలా బయల్దేరాను.ఒరేయ్ పిల్లలు...ఎక్కడున్నారర్రా...''ఆమె అరుపుకు పిల్లలు ముగ్గురూ గదిలోంచి హాల్లోకి వచ్చారు.

''చూసారా వెధవల్లారా... అక్కని చూద్దాం ...బావని చూద్దాం...అని చంకలెగరేసుకుంటూ బయల్దేరారు. ఎంత మర్యాద చేసేసారో...వింటున్నారుగా . ఇక మీవల్ల ఎన్ని మర్యాదలు పొందాలో...పదండి. పదండి. ఆ సంచీ పుచ్చుకుని బయల్దేరండి. ఈ విషయాలన్నీ అక్కడ మీ నాన్నతో చెబితే ఆయన కూడా నాకు గడ్డి పెట్టేవాడే. ఏంచేస్తాం ...చేసుకున్నదానికి చేసుకున్నంత. పదండి.'' అని పిల్లల్ని తీసుకుని వెంటనే బయల్దేరిపోయింది ఆవిడ.

''వదినా. నిండు ముత్తైదువ అలా కన్నీళ్లతో మా ఇంట్లోంచి భోజనం చేయకుండా వెళ్తే మా ఇంటికి శుభం కాదు.నా మాట విని భోజనం చేసి వెళ్ళండి. లేకపోతే పిల్లలు మాడిపోతారు. అమ్మా విజయా...నువ్వుకూడా చెప్పమ్మా '' అని అమ్మ ఆవిడకు అడ్డుపడింది.

''అవునమ్మా. ఇదేమన్నా న్యాయంగా ఉందా... భోజనం చేసేసి వెళ్ళమ్మా...ప్లీజ్.'' అని తల్లి కాళ్ళు పట్టుకుంది వదిన.

''నేను భోజనం చేసి వెళ్లకపోతే మీకు అశుభం అని ఆలోచిస్తున్నారే తప్ప...ఆప్యాయంగా భోజనం చేసి వెళ్ళమని చెప్పే పిలుపులా ఉందా మీ పిలుపు? అత్తాకోడళ్లు తల్లీకూతుళ్లయిపోయారు. కన్నతల్లిని నేను పరాయిదాన్నయిపోయాను. అంతా నా ఖర్మ. ఇంత జరిగాకా నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను. విజయా. నీకు కాపురానికి వచ్చినప్పుడు పెట్టిన పాత చీర తీసివ్వు. ఈ చీర ఇక్కడే విప్పేసి పోతాను. అలాగే నేను మొన్న వదిలేసిన నా చెప్పులు కూడా ఎక్కడున్నాయో కాస్త వెతికిపెట్టు.'' అందావిడ ముక్కు చీదుతూ. 

''అమ్మా..ప్లీజ్...ఈ ఒక్కసారి నా మాట విను. కాస్త ఎంగిలి పడి వెళ్ళమ్మా.'' అంది విజయ ఇంకా గట్టిగా తల్లి కాళ్ళు పట్టుకుని. 

''నువ్వు తీసి ఇస్తావా? నన్ను తీసుకోమంటావా?నన్ను అనవసరంగా విసిగించకు.'' ఆమె కోపంగా విదిలించుకోబోయింది.

అన్నయ్య ఒక్కసారిగా వదిన రెక్క పుచ్చుకునిపైకి లేపాడు.

'' విజయా...ఆవిడ వెళ్తాను అన్నప్పుడు నీకు అంత పంతమేమిటి?ఆవిడని వెళ్లనీ..'' అన్నాడు. 

వదిన ఏదో చెప్పబోతుంటే...అమ్మ అంది కంగారుగా...

'' అన్నం వేళకు ఇంటికొచ్చిన శత్రువుకైనా అన్నం పెట్టి పంపించాలిరా నాన్నా... నువ్వు అలా అనకురా''

దాంతో అన్నయ్య విసుగ్గా బయటకు వెళ్ళిపోయాడు.

''అవును మరి. శత్రువుని చేసేసారు. ఇక అన్నం పెట్టి పంపిచేస్తే సరిపోతుంది.నాకు గతిలేక మీ ఇంట్లో తినాలి మరి. '' అత్తయ్యగారు వదిన గదిలోకి వెళ్లి అయిదు నిముషాల్లో తిరిగి వచ్చింది. ఇపుడు ఆమె ఒంటిమీద కొత్త చీర లేదు. ఈలోగా నాన్నగారు హాల్లోకి వచ్చారు.

''అమ్మాయి తాయారు.నువ్వు చేస్తున్నది చాలా తప్పు.కుటుంబ పెద్దగా చెబుతున్నాను. భోజనం చేసి వెళ్ళమ్మా..''అన్నారు.

''అవునన్నయ్య...మీరు ఈ కుటుంబానికి పెద్దమనిషి. అందుకే జరుగుతున్న భాగోతం అంతా మిగతావాళ్ళకి వదిలేసి లోపలి వెళ్లిపోయారు. ఏదో గిల్లి జోల పాడటం అంటే ఇదే.'' అని ఆయనకు సమాధానం చెప్పేసి, 

''ఒరేయ్..నువ్వు వెళ్లి బయట చెప్పుల స్టాండ్ లో నేను ఎప్పుడూ వేసుకునే చెప్పుల జత ఉంటుంది. అది తీసి పెట్టు. ఆ పక్కనే అక్క కొత్త చెప్పుల జత ఆ స్టాండ్లో పెట్టేసేయ్.''అని కొడుకుకు పురమాయించింది ఆమె.వదిన వైపుకు తిరిగి...

''అమ్మా...కూతురా..ఒకసారి నన్ను వెతుక్కుంటే వెతుక్కో. నేనేమీ పట్టుకెళ్ళడం లేదు. పదండమ్మా..పదండి.'' అని ఆవిడ పిల్లల్ని తీసుకుని గుమ్మం దాటింది ఆవిడ.

''అమ్మా...అమ్మా..'' అని ఏడుస్తూనే వెనకాలే వెళ్ళింది వదిన. ఆవిడ కరగలేదు. వెను తిరిగి చూడలేదు.

చెప్పులేసుకుని గేటు తీసుకుని రోడ్డుమీద నిలబడింది పిల్లలతో సహా. అప్పుడే వచ్చి ఆగిన ఆటో మాట్లాడి ఎక్కేసింది. 

సర్పద్రష్టలా చూస్తూ ఉండిపోయాము మేమంతా. మేము సంబాళించుకుని వెనక్కి తిరిగేసరికి వదిన గుమ్మంలో కళ్ళు తిరిగి పడిపోయి ఉంది.

(మిగతా 8వ భాగంలో)


  



Rate this content
Log in

Similar telugu story from Drama