kottapalli udayababu

Drama Action Classics

4  

kottapalli udayababu

Drama Action Classics

మేలిముసుగు (కధ)

మేలిముసుగు (కధ)

7 mins
29



మేలిముసుగు (కధ)  

ఫోన్ మోగింది.

రాత్రి 10:00 గంటలు దాటింది.

వ్రాసుకుంటున్న నా కథని ఆపు చేసి ఫోన్ లిఫ్ట్ చేశాను.

''హలో.. హలో... ప్రతిమ ఉందా?'' ఎవరిదో స్త్రీ గొంతు.

"ఎవరు మీరు?'' అడిగాను.

""అది ఈ నెంబరేనా...?'' అని నా ఫోన్ నెంబర్ చెప్పింది.

''అవును. ఇది నా నెంబరే.ఎవరు కావాలమ్మా?''

"ప్రతిమ ఉందో లేదో చెప్పండి. నాకు ప్రతిమ కావాలి.''

''ప్రతిమ ఊర్లో లేదు. ఇంతకీ మీ పేరు?'' ఫోన్ కట్ అయింది.

మళ్లీ రెండు నిమిషాల్లో ఫోన్ మోగింది ఫోన్ ఎత్తాను.

''ఎవరు మాట్లాడుతున్నారు?'' అడిగాను.

''మీరు... మీరు ప్రతిమ భర్త గారా?'' ఆమె మళ్ళీ.

''అవును చెప్పండమ్మా. ఏం కావాలి?''

''సార్ అయాం వెరీ వెరీ సారీ. నేను ప్రతిమ ప్రాణ స్నేహితురాల్ని. నా పేరు మాళవిక. తను నేను ఒక్క ప్రాణంగా కలిసే పెరిగాము. మాది అమలాపురం.'' ఆమె ఇంకా ఏదో చెప్పబోతోంది.

ఈసారి నేను ఫోన్ పెట్టేసాను. మంచి మూడ్ లో ఉన్న నా కథ ప్లాట్ అంతా పాడు చేసింది.

 మరో రెండు నిమిషాల్లోమళ్లీ ఫోన్ మోగింది 

"ఏంటమ్మా ఏం కావాలి మీకు? మీరు ప్రతిమ ఫ్రెండ్ అయితే కావచ్చు .కానీ నా భార్య ప్రస్తుతం ఊర్లో లేదు. నన్ను డిస్టర్బ్ చేయకండి - మరోసారి ఫోన్ చేసి'' కటువుగా సీరియస్ గా అన్నాను.

''సారీ సార్. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నా అభిమతం కాదు శ్రీకాంత్ గారు.''

''నా పేరు కూడా తెలుసుకున్నారు అన్నమాట''

''అన్నమాటే కాదు. మీ రచనలు అన్నీ చదివాను. మీ కధ ప్రచురింపబడిన ప్రతీసంచిక నా దగ్గర ఉంది.''

నేను విసుగ్గా ఫోన్ పెట్టేయబోయి ఆగాను.

''ఇప్పుడు మీరు ఫోన్ పెట్టరు శ్రీకాంత్ గారు.''

''అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?'' ఇంట్రెస్ట్ లేకపోయినా కుతూహలంగా అడిగాను.

 ''మీరు రాసిన కథల్ని నాకు చాలా ఇష్టం శ్రీకాంత్ గారు. చాలా వెరైటీ ప్లాట్ తీసుకోవడం, చివర సందేశం ఇస్తూ కథ ముగించే విధానం, కధను మించిన కధనం , అందులో మీ నైపుణ్యం ఓహ్ ! నాకు చాలా చాలా ఇష్టం. ఇలా మీ కథలను గూర్చి చెప్పే అభిప్రాయం వినకుండా మీరు ఫోన్ పెట్టెయరనే అలా అన్నాను. అయితే మీరు రాసే కథల్లో శృంగార కథలు వుండడమే నాకు ఎందుకు ముల్లు గుచ్చుతున్నట్లుగా ఉంటుంది శ్రీకాంత్ గారు''

నాకు కోపం వచ్చింది.

అయినా నిగ్రహించుకుని చెప్పాను.

''ఆ కథలు రాసినా కేవలం భావం 'మేలిముసుగు' లోంచి తొంగి చూస్తున్నట్లుగా కనిపిస్తుందే తప్ప డైరెక్టుగా అభ్యంతరకర పదాలు, అసభ్య వర్ణనలు రాకుండా చాలా జాగ్రత్త తీసుకుంటూ రాస్తాను. ' శృంగార కథ కూడా సహజమైన వర్ణనతో కుటుంబ కథలా మలిచే రచయిత మీరు ఒక్కరే' అని ప్రశంసించిన లేఖలు నాకు ఎన్నో వచ్చాయి. మా ఇంటికి వస్తే చూపిస్తాను ''అన్నాను వ్యంగ్యంగా.

" మీరు నా స్నేహితురాలి భర్త అని ఖచ్చితంగా తెలియబట్టే కాబోలు శ్రీకాంత్ గారు... ఈ మధ్య మీ ఫోటో మీ కవితల్లో చూసి అనుకున్నాను''

''ఏమని ?'' 

''నా అభిమాన రచయిత రసికుడే కాదు... కవిపండితుడు కూడా అని''.

 ''మీ అభిమానానికి థాంక్స్. వ్యక్తి ముఖం చూసినంత మాత్రాన అతను వ్రాసిన కథలన్నీ అతని అనుభవాలేననీ,  అతని మనస్తత్వం తన కథల్లోని పాత్రల మనస్తత్వాల సమ్మేళనం అని అనుకుంటేనే పొరపాటు. అయినా ఎవరో ఏదో అనుకుంటారని నేను రచనలు చేయడం లేదు. నా రచనలు సామాజిక స్పృహ కలిగి ఉన్నాయా లేదా అని ఆలోచిస్తాను. తనకోసమే వ్రాసినా కృష్ణశాస్త్రిగారు గీతాల్లో ఎంత సందేశం ఉంటుందో, ఆత్రేయ గారి పాటలు హృదయాన్ని ఎక్కడ తాకితే గాయం మానుతుందో.... అంత అద్భుతమైన కవి చక్రవర్తుల మధ్య నేను ఎంత? నా రచనలు ఎంత? వారి కాలి గోటికి కూడా పోలని నేను ఎటువంటి రచనా చేసినా సరే ...కాలక్షేపం కోసం కాదు... సమాజానికి ఓ సందేశం ఇవ్వాలి అన్న ఆలోచనతోనే రాస్తాను. నా అనుభవం మరొకరికి గుణపాఠం కావాలనే నా ఆరాటం. వాటిని ఆలంబన గా చేసుకుని రచన సాగించే ప్రవృత్తి నాది.  అందుచేత ఒక కథా రచయిత వ్యక్తిత్వాన్ని అతని కథలోని పాత్రలతో ఎప్పుడూ అంచనా వేయకండి, ఉంటాను. గుడ్ బై.'' టక్కున ఫోన్ పెట్టేసాను.

ఈసారి వెంటనే ఫోన్ మోగింది,

'' శ్రీకాంత్ గారు. మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి నా బాధ చెప్పుకోవాలని ఫోన్ చేసి ఏదేదో మాట్లాడాను. నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. నేను నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. దయచేసి ఫోన్ పెట్టకండి.''

 ఒక్క క్షణం మౌనంగా ఆలోచించాను.

''ఇబ్బంది అంటే?''

''రేపు మా కజిన్ సిస్టర్ కి ఎంగేజ్మెంట్ ఏలూరులో. అయితే అనుకోకుండా బయలుదేరిన నేను తాడేపల్లిగూడెం వచ్చేసరికి జాతీయ రహదారిలో రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ వల్ల ఆఖరి బస్సు వెళ్ళిపోయింది. వెంటనే ప్రతిమ గుర్తుకు వచ్చింది అందుకని ఈ రాత్రి మీ ఇంట్లో ఉండి రేపు ఉదయం బయల్దేరి ఏలూరు వెళ్దామన్నఆలోచనతో మీ ఇంటికి రావడం కోసం ఫోన్ చేసాను. మీరేమో ప్రతిమ వూళ్ళో లేదంటున్నారు.''ఆమె మాటలకు నాకు జాలేసింది నిజంగా.

    ''అలాగా! ఇంతకీ మీరు ఎక్కడినుంచి మాట్లాడుతున్నారు?''

''బస్ కాంప్లెక్స్ నుంచి''

"నిజమేనమ్మా.. ప్రతిమ నిజంగా ఊర్లో లేదు. మీకు... మీకు అభ్యంతరం లేకుంటే మా ఇంటికి రావచ్చు.''అనుమానపడుతూ అడిగాను.

''మీ ఇంటికి తను లేనప్పుడు వస్తే బాగుండదేమో''

''నాకా? మీకా?'' 

''పోన్లెండి. ఎవరికైతేనేం ?'' నేను/... నేను... మీ ఇంటికి రాలేను''

''మీ ఇష్టం. మీకు నమ్మకముంటే రండి. కథారచయిత శ్రీకాంత్ పై అపనమ్మకం అయితే మానేయండి'' నిర్మొహమాటంగా అన్నాను.

ఆమె రెండు నిమిషాలు మౌనం వహించింది. ఆలోచించుకున్నట్టుంది.

''నేను వస్తున్నాను శ్రీకాంత్ గారు. మరి మీ ఇల్లు నాకు తెలియదే. మీ వివాహానికి నేను రాలేదు. మిమ్మల్ని ఫోటోలో చూశాను అన్నానుగా. నన్ను ఏం చేయమంటారు?''

''ఈ మాటలన్నీ నేను అడగాలి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?''

బస్సు కాంప్లెక్ ఎస్..టి.డి బూత్ నుంచి. ''

''నేను వచ్చి పిక్ అప్ చేసుకుంటాను. మీరు అక్కడే వెయిట్ చేయండి'' నేను ఇంకా సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేసాను.

****

 నేను డ్రెస్ చేసుకుని ఇంటికి తాళం వేసి స్కూటర్ తీసుకుని కాంప్లెక్స్ కి వచ్చాను.

నల్లగా బక్కగా ఒక ఆవిడ అపుడే ఎస్.టి.డీ. బూత్ నుంచి బయటికి వచ్చి ఆత్రుతగా ఎదురుచూస్తోంది.

ఆలోచించకుండా ఆమె దగ్గరకు వెళ్ళాను. స్కూటర్ స్టాండ్ వేసి -

''అమలాపురం నుంచి వచ్చిన మాళవిక మీరేనా?''

''నేనా అమలాపురం నుంచి కాదె?''

''ఐ యాం సారీ'' అన్నాను .

''ఏం? కావాలా ...ఇప్పుడే ఫోన్ చేసి ఒకడు బుక్ చేసుకున్నాడు. మీరు ఇంకో రెండువందలు ఎక్కువిస్తే మీ స్కూటర్ ఎక్కేస్తా...''

అంతే. ఒక్క గంతులో స్కూటర్ మీద నేను... స్కూటర్ రోడ్డుమీద... పరుగో పరుగు.

కాంప్లెక్స్ గేటు బయటకు వస్తుంటే అప్పుడు కనిపించింది ఆమె వెదకబోయిన 'బంగారు తీగ' కాలికి తగిలినట్టు గా.

''మీరు...అమలాపురం నుంచి ...''స్కూటర్ ఆపి అడిగాను .

''అవును. నా పేరు మాళవిక.''

''అమ్మయ్య!బ్రతికించారు రండి'' ఆమె లగేజీ స్కూటర్ కి తగిలించాను.

ఆమె స్కూటర్ వెనక్కు వచ్చి ఎక్కబోయింది.

''మన్నించండి. మీరు రిక్షా ఎక్కండి.నేను ఫాలో అవుతాను''

"బాగుండదేమో'' అందామె అనుమానంగా.

''పోనీ నేనే ముందు స్కూటర్ నెమ్మదిగా పోనిస్తాను. నన్ను ఫాలో అవ్వండి. ఈసారి బాగుంటుందేమో.''

''మీరు రచయిత ఎలా అయ్యారో ఎప్పటికీ అర్థం అయింది''

'' చెప్పానుగా నా అనుభవం ఇతరులకు గుణపాఠం కావాలి అంత కావాలన్నదే నా ధ్యేయమని'' ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా రిక్షా పిలిచాను.

*******

ఇంటికి వచ్చాక ఆమెకు పిల్లల గది చూపించాను. ఆమె స్నానం చేసి వచ్చేసరికి వేడివేడిగా ఉప్పుడు పిండి చేశాను.

''ఇంత త్వరగానా ?''ఆమె సంభ్రమాశ్చర్యాలతో అడిగింది.

''చాలా ఆకలి మీద ఉన్నట్టున్నారు. తినండి.''

''నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు''

'' ప్రశ్న లోనే జవాబు ఉన్నప్పుడు సమాధానం అనవసరం అనుకుంటాను'' అన్నాను. ఆమెకు అర్థం అయినట్టుంది.

''రియల్లీ మార్వలెస్. మా ప్రతిమ చాలా అదృష్టవంతురాలు.''

థాంక్యూ !మీరు నా కథలు రెగ్యులర్ గా చదువుతారా?'' అడిగాను.

''మీరు రచన పడిన వెంటనే ప్రతిమ నాకు ఫోన్ చేస్తుంది. వెంటనే దాన్ని కలెక్ట్ చేసుకోవడం నా హాబీ.

''మీ వంటి మంచి విమర్శకురాలు నాకు అభిమానిగా ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు.''

''అదేంటి ?ప్రతిమ మీకు ఏనాడూ నా గురించి?''

'' మీ గురించి చెప్పింది. అయితే మీకీ హాబీ ఉన్నట్లు చెప్పలేదు''

తను తింటున్న అంత సేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. లస్సి చేసి ఇచ్చాను. తాగింది.

''మీ పిల్లలని తీసుకురాలేదా?''

''లేదండీ పిల్లలను కూడా తీసుకు వస్తే ఆయన భోజనానికి ఇబ్బంది పడతారు. పైగా ఆయనకు హోటల్ భోజనం పడదు. అన్నట్టు ఆయనకు ఫోన్ చేసుకోవచ్చా? నేను ఇక్కడ చిక్కు పడిపోయానని తెలియక కంగారు పడతారు.''

సరేనన్నాను. ఆమె తన భర్తతో ఫోన్లో మాట్లాడింది. తర్వాత తిన్న ప్లేటు కిచెన్లో పడేసి వచ్చింది.

అప్పుడు చూసింది.

నా టేబుల్ మీద వ్రాస్తూ ఆపేసిన కాగితాల్ని.  యధాలాపంగా ఆమెకి టేబుల్ పై కనబడిన పెయింటింగ్ కార్డుని నన్ను మార్చి మార్చి వింత గా చూసింది.

''ఇది ఎదురుగా పెట్టుకొని కథలు రాస్తున్నారా ? పైగా ఏదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం కధలు రాస్తున్నట్టు లెక్చర్ ఇచ్చారు ఇందాకా?'' ఆమె దానిని నా మొహం పైకి విసురుతూ అంది.

నేను కింద పడిన ఆ పెయింట్ కార్డు తీసి చూశాను. ఆ కార్డు మీద గల వర్ణచిత్రం నాకు చాలా చాలా ఇష్టం.

అది రాజా రవివర్మ తైల వర్ణ చిత్రం ''ది సకింగ్ చైల్డ్''. మైసూర్ ఆర్ట్ గ్యాలరీలోది.

"ఇందులో మీకు తప్పేం కనిపించింది?'''' ఆశ్చర్యంగా అడిగాను నేను.

''ఇంకా తప్పేం కనిపించింది అని అడుగుతున్నారా- సిగ్గు లేకుండా? ఒక స్త్రీ తన బాబుకి పాలిస్తుంటే దాంట్లో కూడా కామాన్ని వెదుక్కుని, మీరు రాసే కథలకు శృంగారకథలు అని పేరు పెట్టు కుంటూ 'మేలి ముసుగు' వేసుకునే కుసంస్కారులు మీరు. ఛీ..ఛీ...మీరంటేనే...?''

''ప్లీజ్ స్టాప్ మిస్ మాళవికా... ప్లీజ్ స్టాప్ .ఈ చిత్రంలో తన బిడ్డకు పాలు ఇస్తూ మాతృత్వాన్ని అనుభవిస్తున్న భావాన్ని సాటి ఆడదానిగా చూడాల్సింది పోయి, అలాంటి అద్భుత దృశ్యాన్ని కనుల ముందు సజీవంగా ఉంచగలిగిన రవి వర్మ లాంటి మహా కళాకారుడి కళానైపుణ్యాన్ని కళ్ళకు అద్దుకోవడం పోయి ఇలా మాట్లాడుతున్నారు అంటే మీరు ...మీరు అసలు పిల్లల్ని కన్నతల్లేనా?  అతిధి గా మా ఇంటికి వచ్చారు. అదీ నా భార్య లేని సమయంలో. మీ మర్యాద మీరు కాపాడుకుని ఉదయమే వెళ్ళిపొండి. దయచేసి మీరు ఎప్పుడూ ఇక్కడికి రాకండి. ఉంటాను. గుడ్ నైట్.'' 

కాగితాలు అన్నీ తీసేసుకుని కోపం బలవంతంగా నిగ్రహించుకుంటూ నా బెడ్రూమ్ లోకి వచ్చేసి ఠపీమని తలుపు వేసుకున్నాను. ''మాతృత్వం'' అనే అంశం పై నేను రాస్తున్న కథ మధ్యలోనే ఆగిపోయింది. ఆ రాత్రంతా నాకు నిద్దర పట్టలేదు ఆమె మాటలకి.ఆమె మాటలు గుండెల్లో గాయం రేపుతూనే ఉన్నాయి.

******

 మరుసటి రోజు ఉదయం ఏడు గంటలు దాటాక మెలకువవచ్చింది. కళ్ళు విపరీతంగా మండిపోసాగాయి. లేచి హాల్ లోకి వచ్చాను.

రూమ్ తలుపు దగ్గరగా వేసి ఉంది. మెల్లగా తట్టాను . తలుపులు కొద్దిగా తెరుచుకున్నాయి .

ఆమె, ఆమె లగేజి గదిలో లేదు. ఎక్కడ వస్తువులు అక్కడ అలాగే ఉన్నాయి .

మళ్ళీ హాల్ లోకి వచ్చిన నాకు ఎదురుగా టేబుల్ మీద రెపరెపలాడుతున్న ఉత్తరం కనిపించింది. ఆతృతగా చేతుల్లోకి తీసుకొని చదివాను.

''శ్రీకాంత్ అన్న గారికి,

మాళవిక హృదయ పూర్వక నమస్కృతులు. నేను యాదృశ్చికంగా మీ ఇంటికి వచ్చి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మిమ్మల్ని అవమానించబోయిన నా అజ్ఞానానికి మన్నించండి.

మీరు నన్ను ఎప్పుడూ చూడలేదు. అయినా మీరు నన్ను ఎంతో ఆప్యాయంగా గౌరవించారు. నా అభిప్రాయాలకు ఎంతో విలువ ఇచ్చారు. ముందుగా పరిచయం లేని ఒక వ్యక్తికి, అందులోనూ - స్త్రీకి మీరు రాత్రిపూట ఆశ్రయం ఇవ్వడం - మీ సంస్కారం. స్త్రీ ఒంటరిగా దొరికితే అభ్యంతరకరమైన ప్రవర్తన ప్రదర్శించని మీ ఆత్మ విశ్వాసం ఆత్మ సౌందర్యాన్ని మరింతగా పెంచింది. మీ భార్య పట్ల మీకున్న ప్రేమ కు ఇంతకంటే తార్కాణం ఏం కావాలి? అందుకే అది అదృష్టవంతురాలు.

మీ మీద ఎంతో నమ్మకం, అచంచలమైన ప్రేమ ఉన్న ప్రతిమకి కేవలం నా మాటల ప్రభావం వలన మీ మీద 'మేలిముసుగు' లాంటి ఒక చిన్న అనుమానం ఏర్పడింది. అది ఏమిటంటే 'ఎన్నో రకాల అనుభవాలు వివాహానికి ముందు ఉంటే గానీ ఏ రచయిత అంత అద్భుతమైన శృంగార కథలు రాయలేడు' అన్నది నా వాదన. 'మేలిముసుగు' లాంటి ఆ అనుమానాన్ని తొలగించి మీరు అత్యుత్తమ వ్యక్తి మాత్రమే కాదు, అత్యుత్తమ రచయిత అని కూడా నిరూపించుకున్నారు. మీకు ముఖం చూపించలేక ఇలా వ్రాతపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను. నా అవివేకాన్ని మన్నించమని కోరుతూ

సదా మీ అభిమాని

మాళవిక"

 ''తనమీద తనకు ఆత్మవిశ్వాసం లేనివాడు రచయిత కాలేడు .. అసలు ఏ పని చేయలేడు మాళవికా... నీ తప్పు తెలుసుకున్న నీవు అభినందనీయురాలవు''

నేను ఆ ఉత్తరాన్ని భద్రంగా దాచుకున్నాను.

*************

మరో రెండు రోజుల్లో ప్రతిమ ఊరు నుంచి వచ్చేసింది. మాళవిక విషయం చెప్పే సరికి ఆశ్చర్య పోయింది . 'తను వచ్చేసరికి లేకుండా పోయానే' అని చాలా బాధపడింది. ఆ సాయంత్రం తను పక్కింటి పార్వతమ్మ గారితో గుడికి వెళ్ళింది.

వీధి లో ఇస్త్రీ బండి వెంకటేశు ఇస్త్రీ చీరలు తీసుకొనివచ్చి ''అబ్బాయిగారు,,, అమ్మాయిగారు గుడికి వెళ్తూ ఇచ్చారు'' అన్నాడు.

వ్రాసుకుంటున్న నేను లేచి వెళ్లక తప్పింది కాదు, వాటిని తీసుకుని చీరల బీరువా తెరిచి చీరలన్నీ అందంగా సర్దుదామని అక్కడ లోపల చీరలు తీస్తోంటే అప్పుడు బయట పడింది - వాటిమధ్య ఉన్న ఉత్తరం.

అది మాళవిక రాసింది. అందులో ఇలా ఉంది,

''ప్రతిమా...

పిచ్చి మొహమా! 'అనుమానం' అనే మేలిముసుగులో దాక్కుని బాధపడుతూ నువ్వెంతో సుఖపడతున్నావో నాకు అర్థమైంది.

అందుకే నిన్ను మన మన మన ప్లాన్ ప్రకారం రెండు రోజులు మీ అమ్మ గారి ఇంటికి వెళ్ళమన్నాను. నీ భర్త నిజంగా దేవుడు. రచయిత అయిన ప్రతి వారికి సిగరెట్టు, తాగుడు, వ్యభిచారం అలవాట్లే ఉండవలసిన అవసరం లేదు.

 ఆత్మ విశ్వాసం, విషయ సంగ్రహణా శక్తి ఉంటే చాలు అని రుజువు చేసిన ఉదాత్త వ్యక్తి మీ శ్రీవారు. నీ అనుమానం 'మేలి ముసుగు'ను నేనే నీకు వేసినట్టు మీ ఆయనతో అబద్ధం చెప్పాను. నాకు తెలిసి నీ అంత అదృష్టవంతురాలైన  భార్య నా పరిచయస్తులలో ఇంకొకరు లేరు.  నీ 'అనుమానం' అనే మేలి ముసుగును అంటించేసి హాయిగా సంసారం చేసుకో. నా ప్రయాణం అనుకోకుండా కలిసి రావడంతో వెంటనే నీ సమస్యకు పరిష్కారం చూపగలిగాను. మనం అనుకున్న విధంగా నేను గ్రహించిన విషయం ఈ ఉత్తరం రూపంలో వ్రాసి నీ చీర లో పెడుతున్నాను, విష్ యు హ్యాపీ ఎంజాయింగ్ ఫ్యూచర్.

నీ ప్రాణ స్నేహితురాలు - మాళవిక.''

నవ్వుకున్న నేను నా కొత్త కథకు చక్కని ఆలోచన వచ్చి 'మేలిముసుగు ' అన్న మకుటం తో వ్రాయడం ప్రారంభించాను.

సమాప్తమ్. 



Rate this content
Log in

Similar telugu story from Drama