kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన న్యాయం (6 వ భాగం)

మనసు చేసిన న్యాయం (6 వ భాగం)

3 mins
19


మనసు చేసిన న్యాయం (6 వ భాగం)

ఆరోజు అత్తయ్యగారు కట్టుకు వచ్చిన చీర అన్నయ్య కొన్నది. వేసుకున్న చెప్పులు కూడా అన్నయ్య కొన్నవే.దానికి తోడు బాబ్డ్-హెయిర్, స్లీవ్-లెస్ జాకెట్, లైట్ మేకప్, లిప్స్టిక్ ...వీటితో ఆవిడ రూపం మొదటిసారి చూసి నిజంగానే మాకు అందరికీ మతిపోయింది.

సాంప్రదాయక మర్యాదలు పూర్తి అయ్యాకా అమ్మ అడిగింది.దూరపు బంధువే కావడంతో మొదటినుంచి ఏకవచనంతో సంభోదించుకోవడం వాళ్లకి అలవాటే. 

మగవాళ్ళం హాల్లో టీవీ చూస్తుంటే అత్తయ్యగారు కూతురుతో అన్నయ్యగదిలో తన ముగ్గురు పిల్లలతో వదినతో గుసగుసగా మాట్లాడుతోంది. అమ్మకూడా వంట గాడి శుభ్రం చేసుకుని ఆ గదిలోకి వెళ్ళింది. వాళ్ళు మాట్లాడుకునే మాటలు హాల్లో మాకు వినిపిస్తూనే ఉన్నాయి. 

''అన్నయ్యగారు కూడావస్తే బాగుండేది వదినా...ఆ పదహారురోజుల పండుగలో చూడటమే...మళ్ళీచూడనేలేదు. అన్నట్టు ఇది అబ్బాయి కోడలికి కొన్నకొత్త చీరేమో...నీ కెప్పుడిచ్చింది కోడలు?'' అనిఅడిగింది అమ్మ ఏమీ తెలియనట్టుగానే. 

''క్రితంసారి వచ్చినప్పుడు అల్లుడు కొన్నాడని చూపించింది. బాగుంది కదా 'మొదటిసారి నేను కట్టుకుని ఇస్తానమ్మా' అని తీసుకెళ్ళాను. అసలు నా కూతురు చీరలు కట్టుకోవడం మొదలెట్టినప్పటినుంచి ఏది కొన్నా మొదటిసారి నేను కట్టుకుని దానికి ఇచ్చేస్తాను. దాని ఒంటిమీద చీర నలగదంటే నమ్ము వదినా...అంత ఒబ్బిడిగా కట్టుకుంటుంది. నామొహం మండా ..నేను ఏ చీర కట్టినా సాయంత్రానికే తోలుగుడ్డ అయిపోతుందనుకో.'' అంది ఆవిడ.

''అంటే కోడలికి ఏ కొత్తచీర కొన్నా తొలిసారి కట్టుకునే యోగం లేదన్నమాట.మీ ఇంట్లో ఉండగా ఆలా చేసావేమో...ఇంకెప్పుడు అలా చెయ్యకు.అసలు అబ్బాయి కోడలికి కొన్న చీర పట్టుకెళ్ళడమే తప్పు. పైగా దాన్ని కట్టుకుని ఇక్కడకు రావడం నువ్వేమన్నా అనుకో మరీ తప్పు.''

''అబ్బబ్బా...ఏం వేసవి కాలమో ఇంకా ఎండలు ముదరనే లేదు...కానీ మండిపోతున్నాయి అని జుట్టు బాబ్డ్ హెయిర్ చేయించుకున్నా వదినా...దానికి తోడు ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ డిజైన్ చీరలు కట్టడం నాకు చాలా ఇష్టం. అందుకని తీసుకెళ్ళాను.ఇందులో తప్పేముంది వదినా? '' అందావిడ కూల్ గా సాగదీసుకుంటూ.

''నీకు కొత్త చీర మొదటిసారి కట్టుకోవడం అంత ముచ్చట అయితే అన్నయ్యగారి చేత రోజుకు నాలుగు చీరకు కొనిపించుకుని కట్టుకో...అంటే గానీ అబ్బాయి కోడలికి ముచ్చటపడికొన్న చీర నువ్వు పట్టుకెళ్లి ఇలా మా ఇంటికే కట్టుకురావడం నాకైతే నచ్చలేదు.వయసొచ్చాకా ఆ వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తే బాగుంది వదినా.'' అంది అమ్మ సలహా ఇస్తున్నట్టు.

''అదేంటి వదినా నా కన్నా పెద్దదానిని నువ్వు కూడా అలా అంటావ్? నేను ఏంచేసినా మా ఆయన నన్ను పల్లెత్తు మాట అనే సాహసం చేయడు. ఆయనకీ నేనేమిటో తెలుసు. అయినా నేను నాకూతురితో చెప్పే చీర తీసుకెళ్లానే...ఏమే విజయా...మీ అత్తగారితో నేను నిన్నడిగి తీసికెళ్ళినట్టు చెప్పలేదా?'' అని కూతుర్ని గదమాయించింది.

'' ఆయన నాకోసం కొన్న చీర చూసి సంతోషిస్తావని నీకు చూపించాను. నువ్వేమో చాలా బాగుంది అని బ్యాగ్లో పెట్టేసుకున్నావు.అది నన్ను అడిగినట్టు ఎలా అవుతుందమ్మా.. అత్తయ్యగారు అన్నట్టు నాన్న నీకు ఎన్ని కావాలంటే అన్ని కొంటారు కదా ...ఆయన చేత కొనిపించుకోవచ్చుగా... ఇంతకాలం నీ దగ్గర ఉన్నాను కాబట్టి నువ్వు ఏది ఇచ్చినా కట్టుకున్నాను. ఇప్పుడు అత్తవారింటిలో వారి పద్దతి ప్రకారం నడుచుకోవడం పద్దతి కదమ్మా...'' అంది వదిన.

అంతే . ఆవిడ కంఠం పెంచింది. 

''ఏమిటే? నువ్వు..నువ్వూ నన్ను వేలెత్తి చూపిస్తున్నావా? మీ నాన్నకి ఆరోజునే చెప్పానే...'ఆ పల్లెటూర్లో మీ అమ్మదగ్గర దాన్ని వదలద్దు. ఆ పాత చింతకాయ పెంపకం దానికి వద్దయ్యా..'అని. అక్కడ మీ నాన్నమ్మ చెప్పినవన్నీ ఇక్కడ నాకు పాఠాలుగా నేర్పుతున్నావు. కూతురిగా నీ దగ్గర చీర తీసుకునే అధికారం లేదా నాకు? కనీ పెంచి పెద్ద చేసిన తల్లిని నన్ను ...నన్ను అంతమాటా అంటావా? మన ఇంట్లో ఏనాడూ నోరువిప్పి మాట్లాడని నువ్వు నా తప్పు ఎత్తి చూపిస్తావా? అసలు నిన్ను కాదు. అల్లుడినే అడుగుతాను.నేను చేసింది తప్పా అని?'' అని హాల్లోకి రైమని దూసుకొచ్చేసింది ఆవిడ వెనుక వదిన ''అమ్మ...అమ్మా..'' అని వారిస్తున్నా వినకుండా అమ్మ, వదినా వెనకే హాల్లోకి వచ్చేసారు.

''ఏమయ్యా..నువ్వు మీ ఆవిడకు కొన్న చీరల్లో ఒక చీర నాకు నచ్చి తీసుకుని వెళ్లాను. దానిని అడిగి తీసుకువెళ్ళలేదు.అది తప్పా రైటా? నువ్వు చెప్పు?''అని అన్నయ్య సోఫా పక్కన నిలబడి అడిగేసింది.

అన్నయ్య వెంటనే టక్కున లేచి నిలబడ్డాడు. 

''నేను కొన్న చీర కట్టుకున్నారుగా...సినిమాకెల్దామా మనమిద్దరం?'' సూటిగా అడిగేశాడు అన్నయ్య. అక్కడున్న అందరమూ నిర్ఘాంతపోయాం అన్నయ్య మాటలకి.

''ఏమిటీ నన్ను...అత్తగారు అనే గౌరవం లేకుండా... నువ్వు నాకూతురికి కొన్న ముష్టి చీర కట్టుకుని వచ్చానని మంచీ మర్యాదా లేకుండా 'సినిమాకి వెళదామా అంటావా? నీకసలు మతి ఉండే మాట్లాడుతున్నావా? ఏమన్నయ్యా? మీ కళ్ళముందు మీ వియ్యపురాలిని నన్ను మీ అబ్బాయి అంత మాట అంటే నిమ్మకు నీరెత్తి కూర్చుంటారా? మీకుటుంబానికి అసలు మాన మర్యాదలు ఉన్నాయా? ఎవడితో పడితే వాడితో సినిమాకు షికారుకు పోవడానికి నేను బజారుదాన్ని అనుకున్నారా?'' అని పెద్ద కంఠంపెట్టుకుని అరిచేసింది. 

నాన్నగారు సమాధానం చెప్పబోయారు. అన్నయ్య...''నాన్నగారు..మీరు ఆగండి. నేను సమాధానం చెబుతాను.''అన్నాడు.వెంటనే అమ్మ అడ్డుకుంది 

''ఒరేయ్..పెద్దవాడా...నీకు అసలే ఆవేశం ఎక్కువ.నువ్వు మాట్లాడకు. ఎదురుగా మీ నాన్నగారున్నారు. ఆయనని అడిగిందిగా ఆవిడ న్యాయం? ఆయనే చెబుతారు సమాధానం.''అని జబ్బ పుచుకుని ఆపింది.

దానికి నాన్నగారు లేచి కూల్ గా ''ఆవిడ ఎంత మాన మర్యాదలు గల మనిషో కనిపిస్తోందిగా...ఆవిడకి సమాధానం నేను చెప్పక్కరలేదు. ఈ సమస్య వాడిది. వాడు వాడి భార్యకి కొన్న చీర కట్టుకుని మన ఇంటికి వచ్చి మనకు మాన మర్యాదలు నేర్పుతోంది. నువ్వే తగిన సమాధానం చెప్పుకోరా..." అని తన పడక గదిలోకి వెళ్లిపోయారు ఆయన. 

(మిగతా 7 వ భాగంలో)



Rate this content
Log in

Similar telugu story from Drama