kottapalli udayababu

Romance Classics Inspirational

4  

kottapalli udayababu

Romance Classics Inspirational

అందమైన తీగకు.. (కథ )

అందమైన తీగకు.. (కథ )

7 mins
79


అందమైన తీగకు...( కధ )

 

‘’ఎక్స్ క్యూజ్ మీ!’’

ఆ మాట వింటూనే చివ్వున తల ఎత్తి చూశాడు వికాస్- చేతిలో ఉన్న పేపర్ ను ముఖానికి అడ్డు తొలగిస్తూ.

అరవిరిసిన పూరేకుల నేవళాన్నీ ఆపాదమస్తకం కలిగి ఉన్నట్టున్న ఆమెను చూస్తూనే పేపర్ పక్కన పెట్టి లేచి నిటారుగా అయ్యాడు.’

‘’ చెప్పండి మిస్. ఏం కావాలి ఇక్కడ కూర్చుంటారా లేక పేపర్ కావాలా?’’

‘’అది కాదండి... అదీ...’’

‘’ ఏమిటది?’’

‘’ అది... మీకు ఎలా చెప్పాలా అని... మిమ్మల్ని ఎలా అడగాలా అని...?’’ నసుగుతూ అంది.

‘’భయపడకండి.. చెప్పండి’’

 ‘’మీరూ కాంటాక్ట్ ప్రోగ్రాం కే వచ్చారా?’’ 

‘’అవును. మీరూ కాంటాక్ట్ ప్రోగ్రాం కే వచ్చారా?’’

‘’బై ది బై.. నా పేరు ప్రియాంక. మాది మహాబలిపురం. మధురై కామరాజ్ యూనివర్సిటీ వారు ఏర్పాటు చేసిన కాంటాక్ట్ ప్రోగ్రాంకు వచ్చాను. ఈ హోటల్ కాలేజీకి దగ్గర గా ఉంది. ఈ హోటల్ లో అన్నీ రూమ్స్ బుక్ అయిపోయాయి. ‘’

 ‘’అవునండి. నేను కూడా బ్రతిమలాడితే ఒక డబుల్ రూమ్ పది గంటలకు ఖాళీ అవుతుందన్నాడు. అందుకోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి?’’

“మీకు అభ్యంతరం లేకపోతే మీ డబుల్ రూమ్ ...?’’

‘’భలేవారే. ఎంత కష్టపడితే దొరికిందనుకున్నారు? అయాం వెరీ సారీ. నేను బుక్ చేసుకున్న రూమ్ ని మీకిచ్చేస్తే నేనెక్కడ ఉండాలి? అయినా... తనకు మాలిన ధర్మం తప్పు కదండీ’’ అన్నాడు వికాస్ నవ్వుతూ. ‘’అబ్బా! నేను అడిగేది అది కాదు కౌంటర్ లో ఉన్న అతన్ని అడిగితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాక మీరు ఒప్పుకుంటే తనకేమీ అభ్యంతరం లేదు- అన్నాడు అందుకని’’

‘’ఐ యాం సారీ... ఇవ్వలేనని చెప్పాను కదండీ?’’

‘’ అది కాదు మిస్టర్.......!’’ ఆమె అతని పేరు ఏమిటన్నట్లు చూసింది?

‘’వికాస్’’ అన్నాడు భావం గ్రహించిన వాడిలా.

 

 ‘’మీ డబుల్ రూంలో నేను కూడా ఉండేందుకు అనుమతిస్తే...’’

‘’ మీరు... నా రూమ్ లోనా...?’’ అన్నాడు వత్తి పలికి . ఆమె గుండెల మీద చూపు నిలుపుతూ...

 ‘’ఓ ఇదా...? ఓ పెళ్ళయిన ఆడపిల్ల అంటే జాలి కొద్దీ రైల్లో సీటు ఇస్తారని ఈ కలర్ ఇచ్చా. అనుకోకుండా బయల్దేరడంతో సీటు దొరకడం కష్టమైంది. ఇది ఉండబట్టే మీలాంటి మగవాడు ఇచ్చి పుణ్యం కట్టుకున్నారు. ఇంకా పెళ్లి కాలేదు.’’ అంటూ నల్లపూసలు తీసి హాండ్ బాగ్ లో పడేసింది. 

‘’మరి ఎవరైనా రైడింగ్ కి వస్తే?’’....

‘’మీ భార్య అని ధైర్యంగా చెప్పేయండి. నాకేమీ అభ్యంతరం లేదు’’ అందామె నిర్లక్ష్యంగా చూపు విసురుతూ.

 

ఈమధ్య కాలంలో ఇలా డాషింగ్ అండ్ డేరింగ్ గా మగవాళ్ళతో పరిచయాలు పెంచుకుని అతని డబ్బో, పెట్టో కొట్టేసే ప్రయత్నం చేస్తున్న మోసగత్తెల గురించి పేపర్లలో, పుస్తకాల్లో చదువుకున్నాం కదా... ఆ టైపు కాదు కదా అనుకుంటున్న వికాస్ ని అడిగింది ప్రియాంక.

‘’ మిస్టర్ వికాస్. నేను మీ కళ్ళకు మోసగాత్తేలా కనిపిస్తున్నానా? నేను M.Phil. (maths).మీకు అన్ని చూపిస్తాను’’ అంటూ ఆమె ఐడెంటిటీ కార్డులు, కాల్-లెటర్ ఉన్న కవరు తీసి కాంటాక్ట్ ప్రోగ్రామ్ పేపర్ అందించింది. అవి చూసి తిరిగి ఇచ్చేశాక ఆ కాగితం కవర్లో పెట్టి కవరు బ్యాగులో పెట్టబోటూ ‘’ మీ బ్రాంచ్ ఏమిటి?’’ అని అడిగింది ప్రియాంక.

‘’ఏం.ఫిల్. ఎడ్యుకేషన్’’

‘’ మీది ఏ ఊరు?’’

‘’బెంగుళూరు ‘’

‘’అలాగా! బెంగుళూరులో రోజ్ గార్డెన్ చాలా బాగుంటుందట కదా... మీరు చూశారా?’

 వికాస్ తడబడ్డాడు.

‘’ ఆ చూశాను . అద్భుతమైన గులాబీ రకాలనుకోండి. చూస్తుంటేనే పిచ్చెక్కిపోతుంది.’’

‘’ మీరు పిచ్చి ఎక్కకుండా బాగానే ఉన్నారు అంటే... మీరు చూడలేదు అన్నమాట’’ సూటిగా చూస్తూ ఆమె అడిగిన ప్రశ్నకు బదులుగా, ఆశ్చర్యపోయి విచిత్రంగా కళ్ళెగరేస్తూ ‘’వాట్ ఏ జోక్ ?’’అన్నాడు లేని నవ్వు  తెచ్చుకుంటూ.

‘’ మరి మీరు ఒప్పుకున్నట్టేనా?’’

‘’...............................’’

‘’ పెళ్ళికాని ఆడపిల్ల ని నేను భయపడాలి. ఈ ఒక్క రాత్రి కళ్ళు మూసుకుంటే రేపు మళ్లీ ఈ టైంకి రాయిలులో ఉంటాం. ఏమంటారు?’’ ప్రియాంక చనువు చూసి ఇంకా కాదనలేకపోయాడు వికాస్.

‘’ సరే మీ ఇష్టం’’ అంటున్నంతలో ఆ డబుల్ రూమ్ వాళ్ళు కిందకు రావడం, డబ్బు కౌంటర్ లో చెల్లించేసి వెళ్ళిపోవడం, వెంటనే డ్యూటీలో ఉన్న స్వీపర్ గదిని శుభ్రం చేసి అన్ని చెక్ చేసి, వారిద్దరి సామాను గదిలోకి చేర్చి గాడి వారికి అప్పగించడం అరగంటలో జరిగిపోయాయి.

 

******

 

‘’వికాస్. మీరు స్నానం చేసి రెడీగా ఉండండి. నేను అరగంటలో వస్తాను ,ప్లీజ్.’’ ’’ అని అతని సమాధానం కోసం ఎదురు చూడకుండానే వెళ్ళిపోయింది ప్రియాంక.

 టవల్ కట్టుకుని మంచం మీద వెల్లకిలా వాలిపోయాడు వికాస్ ర్యాలీ ఫ్యాను గాలి ఆస్వాదిస్తూ-

 గదికి కి రెండు వైపులా కిటికీలు ఉండటం. పైగా ఆ గడి పై అంతస్తులో ఉండడంవల్ల రివ్వున వీస్తున్న చల్లని గాలిని అంతటిని ఒక్కసారిగా పీల్చేయాలనే ఆత్రం తో అతను దీర్ఘ శ్వాసలు తీయసాగాడు. అలా చాలాసేపు ఉన్న తరువాత , బాత్రూం లో చేరి షవర్ కింద స్నానం చేశాడు. ప్రశాంతంగా ఉన్నాడు ఇప్పుడు .సరిగ్గా అప్పుడు గుర్తుకువచ్చింది అతనికి.

హుషారుగా లేచాడు. డ్రస్ చేసుకునే ప్రయత్నంలో తువ్వాలు తీసి విసిరెసి,  అలాగే అద్దం ముందు నిలబడి డ్రస్సు అందుకోబోయేటంతలో హఠాత్తుగా తలుపు తెరుచుకుని ‘వికాస్’ అంటూ ప్రియాంక లోపలికి రాబోయి అతన్ని’ అలా’ చూసి సర్పద్రష్ట లా ఒక్కక్షణం ఉండి పోయి, కెవ్వున అరవబోయి వెనుతిరిగి బయటికెళ్లి తలుపు మూసేయడం ఒకదాని వెంట ఒకటి అత్యంత వేగంగా జరిగిపోయాయి.

అతను అలాగే ఒళ్ళో కట్టుకునే డ్రస్ పెట్టుకుని మంచం మీద అలాగే కూర్చుండి పోయాడు. అసలు తను ఒక అమ్మాయికి ఆశ్రయం ఇచ్చాను అని గానీ, అది మద్రాసు అని గానీ అతనికి ప్రియాంకను చూసేంతవరకు ‘గుర్తు’కే రాలేదు. ఛా...వెధవ బుర్ర. అతను తన తలను చేత్తో కొట్టుకోవడంతో ఇందాక తను చేయాలనుకున్న పని గుర్తుకు వచ్చింది.

పది నిమిషాల్లో తయారై బయట కారిడార్లో నిలబడి అయోమయం చూపులు చూస్తున్న ప్రియాంకతో..’’ ప్రియాంక గారు! అరగంటలో వచ్చేస్తాను. అర్జెంటు పని ఉంది.’’ అంటూ సమాధానం కోసం చూడకుండా అదృశ్యమై పోయాడు.

 

వికాస్ వచ్చాక ఏమీ జరగనట్టుగా ఉండటంతో తను అలాగే నటించింది ప్రియాంక. టిఫిన్ తినడం కోసం బయలుదేరారు. నడుస్తూ కబుర్లు చెప్పుకొన్నారు. ప్రియాంక ఫాదర్ సివిల్ జడ్జి. ఒక తమ్ముడు ఉన్నాడు. ఎంబీఏ ప్రిపేర్ అవుతున్నాడు. తనకు తమ్ముడు బెస్ట్ ఫ్రెండ్ అయితే తండ్రి రియల్-గైడ్ అంది ప్రియాంక.

 

వికాస్ కు ఒక చెల్లి. సంబంధాలు చూస్తున్నారు. తన చెల్లిని ఆస్తమాను ఏడిపించీనా. ఆమెకు వికాస్ అంటే ఎంతో అభిమానమాట. ‘ఉద్యోగం ఎలాగూ వచ్చేసింది కాబట్టి ముందు కుదిరితే నీకు పెళ్లి చేస్తాం’ అంటూ ఉంటారట వాళ్ళ అమ్మగారు.

 

 దారిలో నాలుగు మూరల విరజాజులు కొంది ప్రియాంక. అక్కడే తలలో పెట్టేసుకుంది కూడా.

 ‘’పూలు ఎందుకండీ’’ అని అడగబోయి ఆపేసాడు అతను.

 

 ఆమె పక్కన అలా నడుస్తుంటే కలా నిజమా అన్న అంత వింతగా ఉంది అతనికి. ఆమె తలలోని విరజాజుల పరిమళాలు అతనిలోని కోరికల గుర్రాలను రెచ్చకొడుతుంటే , బలవంతంగా తల తిప్పుకుని ముందుకు అడుగు వేశాడు అతను.

**************

 

డ్రెస్ చేంజ్ చేసుకున్న వికాస్ దిండు తీసుకుని కారిడార్ లోకి వెళ్లబోతుంటే వెంటనే అడిగింది ప్రియాంక. ‘’అదేమిటండీ? ఎక్కడికి?’’

‘’నేను కారిడార్లో పడుకుందామని.’’

‘’భలేవారే! మనం ఇద్దరం ఈ రూమ్ లో ఈ బెడ్ మీద పడుకుంటున్నాం. మీ శీలానికి నేను గ్యారెంటీ. చూసారా. మీరు అనాల్సిన ప్రతి మాట నా నోట వస్తోంది. నేను వెళ్లి డ్రెస్ మార్చుకుని వస్తాను’’ అంటూ ప్రియాంక బాత్ రూంలోకి దారి తీసింది.

 

 ఆమె తిరిగి వచ్చేసరికి కాట్ మీద ఉన్న దుప్పటి తీసి కింద పక్క వేసుకుని అటు తిరిగి పడుకున్నాడు వికాస్. ‘’వికాస్ గారు!’’ అంటూ తన తలలో విరజాజులను కొన్ని తుంచి అతని మీద చల్లుతూ పిలిచింది ప్రియాంక.

 

అతను నెమ్మదిగా కళ్ళు విప్పాడు. ఎదురుగా ఉన్నది ఒక అభిసారిక! నిలువెల్ల లావణ్యాన్ని తనువు అణువణువులో నింపుకుని యవ్వనపు చంద్రోదయం కోసం ఎదురు చూస్తున్న కలువలా ఉంది ఆమె కనకాంబరం రంగు నైటీలో.

ఆమె చనువుగా అతని చెయ్యి పట్టి పైకి లేపింది. అతను మంత్రముగ్ధుడిలా అనుసరించాడు. ఆమె మెత్తని చేతి స్పర్శ అతనిని రోమాలలో విద్యుత్తుని నింపుతూ ఉత్తేజితుడిని చేస్తోంది.

‘’ మీరు ఇంత చొరవగా చనువుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవచ్చా?’’. అంత మత్తులోనూ సూటిగా అడిగిన అతని ప్రశ్నకు ప్రియాంక తొట్రుపడలేదు.

‘’ మీ నిగ్రహం తెలుసుకోవడం కోసం’’

‘’ ఒకవేళ నేను విజృంభిస్తే?’’

‘’ప్రాణాలతో బయటకు వెళ్లరు అంటా అనుకున్నారా! లేదు. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది.

 ఐదు నిమిషాల పరిచయంతోనే వెకిలి వేషాలు వేసి తమ కోరికను బయట పెట్టే పురుష పుంగవులున్న    సమాజం మనది. మీరు నా నుంచి ఏదైనా ఆశించే వారైతే ఈ గదిలో నాకు ఆశ్రయమిచ్చినప్పుడే కోరేవారు. అప్పుడు నటించారని అనుకుందాం. ఇప్పుడు నేను మీ దగ్గరే ఉన్నాను కదా. ఏం చేస్తారో చెయ్యండి. ఆ నమ్మకంతోనే మీ దగ్గర ఇంత ధైర్యంగా ఉన్నాను. మీరు ఎక్కడో కారిడార్ లో సోఫా మీద పడుకుని నిద్ర పట్టక దొర్లుతూ ఉంటే నాకసలు ఇక్కడ నిద్ర పట్టదు. మీ శీలానికి నేను గ్యారెంటీ అని చెప్పాను కదా!’’ ఆమె అతని చేతిలోని దుప్పటి తీసుకుని కాట్ మీద పరిచింది.  ఎవరి బ్యాగ్ వారి తలకింద పెట్టుకునే ప్లేస్ లో ఉంచి దిండు మధ్యలో అడ్డుగా పెట్టింది.

 

‘’మీరు అటు తిరిగి పడుకోండి. నేను ఇటు తిరిగి పడుకుంటా. అయితే ఒక చిన్న కండిషన్. నేను నిద్రపోయేంతవరకు మీతో కబుర్లు చెపుతూనే ఉండాలి. నేను ‘ఊ’ కొట్టడం ఆపేశానంటే మీరు నిశ్చింతగా నిద్ర పోవచ్చు. అన్నట్టు మీరు ముందుగా పడుకుంటే?’’

 

‘’నా గురకే మీకు సాక్ష్యం .’’

‘’ అమ్మో అయితే నన్ను ఈ రాత్రి నిద్ర పోనివ్వ రా?’’

‘’అంత భయంకరంగా గురక పెట్టనూలెండి. ఈ గదిలో మగాడు ఉన్నాడు అని అందరూ జాగ్రత్త పడేలా మాత్రమే పెడతాను. సరేనా నవ్వుతూ?’’ అన్న వికాస్ మంచం పై పడుకొని అటు తిరిగాడు.

 అతను పిచ్చాపాటీ కబుర్లు చెబుతూ పది వాక్యాలు పూర్తిచేశాడో లేదో ప్రియాంక ‘ఊ’కొట్టడం ఆపేసింది. మరో 5 నిముషాలు అలాగే మౌనంగా ఉన్న వికాస్ నెమ్మదిగా లేచి అటు తిరిగి గాఢ నిద్రలో మునిగిన ప్రియాంక వైపు వచ్చాడు. ‘’ నన్ను క్షమించండి ప్రియాంక- ఈ ఒక్క విషయంలో మీ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నందుకు’’ అనుకుంటూ చిక్క పట్టుకున్న ధైర్యంతో తన మీసాలు ఆమెకు ఎక్కడ గుచ్చుకుంటాయో అన్నంత భయంగా ఆమె యాపిల్ బుగ్గపై సుతీ మెత్తగా చుంబించాడు.

 

ఒక మెరుపు కాంతి తనలో ప్రవేశించినట్టయిన అతను ఒక్క ఉదుటున తన గుండె కొట్టుకుంటున్న శబ్దం తనకే వినబడుతున్నంత ఉద్వేగానికి లోనై నెమ్మదిగా పక్కమీద వాలాడు.ఆ ఒత్తిడికి వెల్లకిలా నిదురలో తిరిగిన ప్రియాంకను చూస్తే మరి ఏం జరుగుతుందో అన్న భయంతో కళ్ళు మూసుకున్నాడు వికాస్.

 

మరో పది నిమిషాలలో అతని గురక విన్న ఆమె కళ్ళు తెరిచి నవ్వుకొని ‘’నాటీ బాయ్’’ అనుకుంది మనసులో! తను కొత్తగా నేర్చుకున్న నేత్రావధానం అతని వ్యక్తిత్వంలో ఏ చెడూ లేదని చెబుతోంది.

*****************

 

మరుసటి రోజు సాయంత్రం అటెండెన్స్ సర్టిఫికెట్ అందడంతో వెంటనే హోటల్ రూమ్ కి వచ్చారు ప్రియాంక, వికాస్. మనీ మేటర్స్ అన్ని సెటిల్ అయ్యాక ఇద్దరూ హోటల్ కారిడార్లో సోఫాలో కూర్చున్నారు.

 

‘’మిస్టర్ వికాస్! నా జీవితంలో నిన్నటి రాత్రి జన్మలో మర్చిపోను. అంత ధైర్యంగా ఒక పరాయి మగాడితో దేశం కాని దేశంలో అన్నట్టుగా ఒకే బెడ్ మీద పడుకున్న నేనేనా అని ఆశ్చర్యపోతున్నాను. ఒకవేళ నిన్న రాత్రి మీరు నన్ను ఏమైనా చేసి ఉంటే...?’’

‘’చేసి ఉంటే?’’

‘’మిమ్మల్ని పొడిచి నన్ను నేను పొడుచుకుని చనిపోయి ఉండేదాన్ని’’ అంటూ తన బ్యాగ్ లోంచి పళ్ళు కోసుకునే పదునైన చాకు తీసి చూపించి మళ్ళీ అందులోనే  వేసేసింది.

‘’అవును వికాస్. ఆడపిల్లకు ధైర్యం ఉండడం మంచిదే. మొండి ధైర్యం ప్రమాదాన్ని ఆపదు సరికదా- తన ప్రాణానికే ముప్పు తేవచ్చు. మళ్లీ ఈ జన్మకు మనం కాలమేమో! నెక్స్ట్ ఇయర్ కలవచ్చు, కలగకపోవచ్చు. ఏదిఏమైనా మీలాంటి అబ్బాయిలు ఈ రోజుల్లో అరుదు. పెళ్లి అయ్యే లోపల ఎన్ని బాటిల్స్ ఓపెన్ చేసామా అని ఆలోచించే తరం లో పుట్టవలసిన వారు కాదు మీరు. ఎనీ హౌ థాంక్యూ వెరీ మచ్ ఫర్ యువర్ కంపెనీ.’’ ఆందామే ఆర్ద్రత నిండిన మనసుతో.

 

‘’మిస్ ప్రియ. మీరు నన్ను మొదటి నుంచి చాలా అయోమయంలో పడవేశారు. ఆ అయోమయంలో నేను ఎలా ప్రవర్తిస్తున్నారో నాకే అర్థం కాలేదు. నన్ను నా అవతారం చూసి ఏవగించుకుంటారేమో అని అనుకున్నాను. నన్ను రెచ్చగొడుతూనే నా నిగ్రహానికి మంత్రం వేశారు మీ మాటలతో. నా జీవితంలో ఇంతటి అద్భుతమైన రోజు ఎప్పటికీ మరువను. మీకు అభ్యంతరం లేకుంటే మీతో స్నేహం చేయవచ్చా- అది మీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే.’’

 

‘’షూర్ . మీలాంటి మంచి స్నేహితుడు నాకు ఉన్నాడు అని చెప్పుకోవడానికి గర్వపడతాను .’’అంటూ తన కార్డ్ తీసి అతనికి ఇచ్చింది. అది చూసి ఆమెను అతను ప్రశ్నించి ఉంటే ఆమె నిజంగా ఇబ్బంది పడేది. దానిని అతడు బ్యాగ్ సైడ్ జిప్ లాగి అందులో పడేసాదు.

‘’మరి మీ వివరాలు?’’ అంది ప్రియాంక.

 వికాస్ తన వాలెట్లోంచి విజిటింగ్ కార్డు తీసి ఆమెకిచ్చాడు. ఆమె దానిని అతని లాగే సైడ్ జిప్ లాగి బ్యాగ్ లో పడేసింది.

ఇద్దరూ తమ ఆప్తుదిని విడిచి పోతున్న బాధ ముఖాలలో ప్రస్ఫుటిస్తుండగా చివరిగా కరచాలనం చేసుకుని బయటకు వచ్చారు.

ఆటోను పిలిచి ఆమె కూర్చున్నాక ‘టాటా’ చెప్పి ఆటో కనుమరుగు అయ్యేంతవరకు చూస్తూ ఉండిపోయిన వికాస్ మరో ఆటోను పిలిచి ‘సెంట్రల్ స్టేషన్’ అన్నాడు.

 

*******

 

 ‘’ఎక్స్ క్యూజ్ మీ. ఈ లోయర్ బెర్త్ నాకు ఇచ్చి అప్పర్ బెర్త్ మీరు తీసుకుంటారా?’’ అన్న మాటతో వికాస్ ఇటు తిరిగే సరికి ఎదురుగా ప్రియాంక,

‘’మీరా? మీది మహాబలిపురం అన్నారుగా?’’ అడిగాడు వికాస్.

 ‘’అవును. మహాబలిపురం మాది - మీది కూడా.. అది మన భారతదేశంలోనే ఉంది కదండీ’’

 ప్రియాంక అన్న తీరుకు కంపార్ట్మెంట్ అడిరేలా నవ్వాడు వికాస్.

 ‘’మరి మీది బెంగుళూరు అన్నారు?’’

అవును. మన మహాబలిపురం లాగానే మన బెంగళూరు’’ అన్నాడు నవ్వు ఆపుకుంటూ.

‘’ఇంతకు ఎక్కడికి ప్రయాణం?’’ అడిగింది ప్రియాంక.

 ‘’ముందుగా విజయవాడ. అక్కడి నుండి ఇంటికి. మరి మీరు?’’

‘’సేమ్ టు సేమ్. ‘అమ్మ’ను చూసి అప్పుడు ఇంటికి వెళ్తాను.

‘’మీ మదర్ అక్కడ జాబ్ చేస్తున్నారా?’’

 ‘’అబ్బా! మీరింత జీడిమామిడి పండు ఏంటండి బాబు? అమ్మంటే- కనకదుర్గమ్మ. ఇంతకీ మీదసలు ఏ ఊరు?’’

‘’నేను కొవ్వూరులో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. ఇది మాత్రం నిజంగా మా ఊరే. !’’

‘’రియల్లీ? మాది రాజమండ్రి. నాన్నగారి ఉద్యోగరీత్యా అక్కడ ఉంటున్నామ్. బహుశా అక్కడే స్థిరపడవచ్చు. కూడా. అన్నట్లు స్నానం చేశాక పరిగెత్తిండీ....’’

‘’ఈ రిజర్వేషన్ కోసమే. మరి మీరు.. నాకన్నా ముందు పరిగెత్తిందీ?’’

 ‘’ఆ దీని కోసమే. అది సరే గానీ ఊరు పేరు ఎందుకు అబద్ధం చెప్పారు?’’

‘’ మన పరిచయం అయ్యాక మొదట్లో అనుకున్న మాటలు అవి. అందులో ఆడపిల్లను కదా. నిజం చెప్పడానికి భయం వేసింది’’ అంది ప్రియాంక భయం నటిస్తూనే.

‘’అమ్మో! మీరు ఆడపిల్లా..?’’

‘’ అమ్మో! మీరు మాత్రం మగవాళ్ళా?’’ ఇలాంటి చాకులాంటి పిల్ల పక్కలో పడుకుని కూడా ఏం చేయకుండా బుగ్గ మీద ముద్దు పెడితే సరిపోయిందా?’’

‘’అమ్మ దొంగా.. అయితే దొంగ నిద్ర అన్నమాట ‘’అన్నాడు అతను చిలిపిగా.

‘’ చెప్పాను కదండీ... మొండి ధైర్యం అన్నివేళలా పనికిరాదని.’’ అంది ప్రియాంక సీరియస్ గా,

 

******

 

 కోవెల ఖాళీగా ఉంది. కళకళలాడే నిత్య సౌభాగ్యంతో జగాలనేలే చల్లని తల్లి దర్శనం చేసుకుని మనసారా ఐదు నిమిషాలపాటు నమస్కరించుకున్నారు ప్రియాంక, వికాస్.

‘’ దైవ దర్శనం పూర్తయింది. ఇక మన ఊరు వెళ్లే ప్రయత్నంలో మళ్ళీ విడిపోవాలి కదూ!’’ అన్నాడు వికాస్. ‘’అది సరే గానీ దేవుడిని ఏం కోరుకున్నారు?’’

‘’నేను తర్వాత చెబుతాను. ముందు లేడీస్ ఫస్ట్!’’ 

‘’వికాస్! అందమైన తీగకు... పందిరుంటే అది పైకి చక్కగా పాకుతుంది. ఆ ఆలంబన ఉన్నంతకాలం సగర్వంగా ఎదుగుతూ ఎన్నెన్నో పూలను ఇస్తుంది. జగతికి ప్రతి నిత్యం మొక్క యొక్క ఆవశ్యకతను తెలియచేస్తుంది. ఆడపిల్ల ఎంత చదువు చదివినా ఎన్ని పెద్ద ఉద్యోగాలు చేసినా వివాహం చేసి తమ బాధ్యత తీర్చుకుందామనే తల్లిదండ్రుల తాపత్రయంలో నాకు తోటమాలి ఒక అందమైన తీగకు చేసినంత సేవాతత్పరత కనిపిస్తుంది. అందులో ఆ వివాహమాడబోయే వ్యక్తి మంచి వ్యక్తిత్వంతో పాటు మంచి మనసును, భార్యకు విలువ ఇచ్చే విచక్షణాశక్తిని కలిగి ఉంటే ఆ ఆడ జన్మ అంత అదృష్టం మరొకటి లేదు. అటువంటి పందిరి లాంటి భర్తని నాకు ప్రసాదించమని మనసా, వాచా, కర్మణా కోరుకున్నాను. మరి మీరు?’’

 

‘’అమ్మ సన్నిధిలో నిజం చెబుతున్నాను ప్రియా!ఆ అందమైన తీగకు పందిరి అవ్వాలని కోరుకున్నాను. మరి నీ అభిప్రాయం?’’

 సమాధానంగా ఆమె అతని చేతికి తీగలా తన చేతిని పెనవేస్తూ ముందుకు నడిచింది.

వారిద్దరి నిర్ణయం సారి అయినదే అన్నట్టు ఆశీర్వదిస్తున్నట్లుగా గుడిగంటలు మోగసాగాయి.

 

 

సమాప్తం

 

 



Rate this content
Log in

Similar telugu story from Romance