Urs Sudheer AB

Fantasy

4.7  

Urs Sudheer AB

Fantasy

ఆమె అందం

ఆమె అందం

3 mins
643


ఏమైందో తెలీదు కనులు తెరిచి చూసే సరికి పొగ కమ్ముకున్న అరణ్యం లో పడి ఉన్నాను, పక్కకు తిరిగి చూస్తే నాలాగే వందలమంది పడి ఉన్నారు కుప్పలుగా..బహుశా మేము పయనించే విమానం కుప్పకూలినట్టుంది..


ఇక నా విషయానికి వస్తే తల నుండి నెత్తురు కారుతోంది జలపాతం లా, అంతా నిశ్శబ్దం ఎంతటి నిశ్శబ్దం అంటే పక్కన అన్ని అలజడులు, ఆర్తనాదాలు జరుగుతున్నా వినబడట్లేదు బహుశా నా చెవులు వినికిడి కోల్పోవడం వల్ల పుట్టిన నిశ్శబ్దం అనుకుంటా, ఒకటే దాహం ఆ దాహం వల్ల నా గొంతు గరళం మింగిన గాయకుడిలా మూగపోయింది అరవలేకున్నా..దాహం తీర్చుకోవడానికి అటువైపుగా శోధన సాగించా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంతలో కనుచూపు మేర లో చెంగు చెంగు న తుల్లుతూ ప్రవహించే సెలయేరు కనిపించింది..మెల్లగా నడుచుకుంటూ ఆ సెలయేరు ఒడ్డుకి చేరుకొని నీరు తగగానే ఒక్కసారిగా నా చెవులలో దాహం వల్ల ఏర్పడిన పొర విడిపోయింది, హోరున సెలయేటి శబ్దం ఆ శబ్దం నుండి ఒక మగువ పిలుపు వినిపించింది, ఆ పిలుపు వస్తున్న వైపు తిరిగి చూడగా తను తన చేతులతో సైగలు చేస్తోంది తన వద్దకు రమ్మని..ఆ నెత్తురు,మసి మరకల తో తనకి దగ్గరగా వెల్లసాగాను తనకి ఇరవై అడుగుల దూరం లో తనని చూసి నా అడుగులు అక్కడితో ఆగిపొయ్యాయి ఆశ్చర్యం తో..


ఆహా తన అందం..ఎంత అందం ఇన్ని నగరాలు, పట్టణాలు తిరిగినా అంతటి అందం నేను చూడలేదు..ఆ అందం పొగడగ మరణించి మళ్ళీ కవుల కాలం లో పుట్టాలనిపించింది ఆ క్షణం..ఆ అందాన్ని చూడగానే ఏదో తెలియని మైకం నాలో కలిగింది..ఆ మైకంలోనే తన వైపు అడుగులు వేసాను తననే చూస్తూ..నేల పై ఉన్న రాళ్ళ వల్ల అడుగులు తడబడుతున్నా, విరిగి పడిన చెట్టు కొమ్మలు కాళ్ళకి తడుముతున్నా నా కనులు దారి మల్లట్లేదు తననే చూస్తూ ఉన్నాయి.రెప్పలు వాల్చటానికి కూడా నా మనసు ఒప్పట్లేదు ఎందుకంటే రెప్పపాటు కాలం కూడా తన అందాన్ని వదులుకోవడం నా మనసుకి ఇష్టం లేదు..అలా తన వైపు సాగాను మనసులో ఏదో అలజడి..ఒక తియ్యటి భావన నాలో పొంగి ప్రవహిస్తోంది.ఇంతలో ఆమె బోరున ఏడవడం మొదలు పెట్టింది నా మీద ఉన్న రక్తపు మరకలు చూసి, తన పేరు కూడా నాకు తెలియదు కాని ఏ సంబంధం లేని నా గురించి తను అలా విలవిలలాడడం తన మానవత్వానికి నిదర్శనం అనిపించింది..ఎక్కడో నాగరిక సమాజానికి దూరంగా బ్రతుకుతున్నా ఒక మనిషిపట్ల ఇంతటి సహృదయ భావం ఉండటం తన సంస్కారానికి నిదర్శనం అనిపించింది..


మనం ఇంతటి సమాజం లో ఉంటూ, ఇంతటి జనాభా మధ్యన బ్రతుకుతున్నా మనకు మానవతా విలువలు ఒక నిర్ణిత మనుషుల మీదనే చూపుతున్నాం తప్ప పక్క మనిషి ఎటు పోతే ఏంటి లే అన్న భావనకు చేరువుగా బ్రతుకుతున్నాం, మనుషులకన్నా ఎక్కువ ప్రేమని జంతువుల మీద చూపుతున్నాం..ఇంతటి అభివృద్ధి చెందుతున్నా కూడా మానవతా దృక్పథం పట్ల సిగ్గుపడాల్సి వస్తోంది..


ఇక తన విషయానికి వస్తే..


ఎన్నో అందాలు..ఆ అందాలలో తన అందం మకరందం..

తన చూపు, మల్లెలు మనసుని తడుముతున్న తీరు..

తన నవ్వు, చల్లటి వెన్నెల చిరునవ్వు..

తన అధరాల రూపం, రాముడి విల్లు రూపం..

తన నడుంఒంపుల అందం, నది మలుపుల అనువాదం..

తన వాలు జడ సువాసనలు, మల్లె కు తెచ్చెను పరిమళాలు..

తన వయ్యారపు నడక, హంసల పోలిక..


అలా తనని వర్ణించేందుకు నా ఊహలు తహతహలాడుతున్నాయి..


ఇంతలో తను నన్ను గట్టిగా కదిపింది అంతే ఊహా లోకము నుండి యధార్ధానికి వచ్చి పడ్డాను..తనలో ఏదో తెలియని కంగారు బహుశా రక్తం చూడటం వల్ల కలిగిందేమో..ఆ కంగారులోనే నన్ను తన స్థావరానికి తీసుకెళ్లింది చికిత్స చెయ్యటానికి అనుకుంటా.. చిన్నటి నివాసం, చుట్టూ చూసినంత విశాల ప్రాంతం ఆ వాతావరణం నాకు చాలా బాగా నచ్చేసింది ఎటువంటి కాలుష్యం లేదు, ఎటువంటి అనవసరపు శబ్దాలు లేవు చాలా ప్రశాంతంగా అనిపించింది..తను ఏవో మూలికలు నూరి నా తలకి కట్టు గా కట్టి, ఒక మట్టి కుంపట్లో ఆహారం తీసుకొచ్చి నాకు తినిపించింది అంతే ఒక్కసారిగా నాకు నా చిన్నప్పుడే చనిపోయిన మా అమ్మా నాన్న గుర్తొచ్చారు, అప్పటి నుండి నా మీద ఇంతలా ప్రేమ ఎవరూ చూపలేదు..అంతే ఒక్కసారిగా కంట్లో నీరు వాటంతట అవే కారుతున్నాయి, ఆ కన్నీటిని చూసిన ఆమె తన ఇంకో చేతి తో తుడిచి తన యదకు నన్ను హత్తుకొని ఓదార్చి మళ్ళీ ఆహారం తినిపిస్తోంది, మధ్యలో నాకు కొంచెం మత్తుగా అనిపిస్తే తనకి చెప్పాను తను ఒక పడక చూపించింది అందులో పడుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నాను..


కొద్దిసేపటి తర్వాత ట్రింగ్....మని నేను 6:00 గంటలకి కుదిర్చిన అలారం మ్రోగింది అంతే ఉలిక్కి పడి లేచి ఇదంతా కల అని గ్రహించి,యధావిధిగా తయారయ్యి ఆఫీసుకు బయలుదేరాను..


ఇంతకీ తన పేరు మీకు చెప్పలేదు కదూ.. పార్వతి.



Rate this content
Log in

Similar telugu story from Fantasy