కలవరింత
కలవరింత


ఏదన్నా కథ మొదలుపెట్టే ముందు అనగనగా అనటం పెద్దల కాలం నుండి ఆనవాయితీగా వస్తోంది కాబట్టి, నేను కూడా నా కథని ఆ పదం తోనే ఆరంభిస్తున్నా..
అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో పురిటి నుండి అప్పుడే బయటకొచ్చిన పసి ప్రాణం నుండి పాడె పడకకు రేపో మాపో అనుకుంటున్న ముసలి వాళ్ళ వరకు అన్ని వయస్కుల వారు ఆ గ్రామం లో ఉన్నారు..
అక్కడ ఒక 7 యేండ్ల కుర్రాడు తన తోటి స్నేహితులతో సరదాగా ఆనందంగా ఆడుకుంటూ ఉన్నాడు ఇంతలో అక్కడికి ఒక ఐస్క్రీమ్ బండి వచ్చింది అది చూసి వాడు ఇంటికి వెళ్లి తన అమ్మా నాన్నల దగ్గర మారాం చేసాడు ఐస్క్రీమ్ కోసం.. కానీ వాడికి ఉన్న జలుబు,దగ్గు కారణాల వల్ల తన తల్లిదండ్రులు వాడికి ఐస్క్రీమ్ కొనివ్వడం నిరాకరించారు.అలా నిరాకరించడంతో బాగా ఏడ్చి మారాం చేసాడు ఎందుకంటే ఆ వయసు వాళ్ళకి కోరుకున్నది అందే వరకు మనస్త్రుప్తి కలగదు, ఆ తర్వాత కాసేపు మొండికేసి ఐస్క్రీమ్ బండి వెళ్ళిపోయాక మళ్ళీ మిత్రులతో కలిసి ఆడుకోవడం కొనసాగించాడు అలా పొద్దు కూకి చీకటి అయ్యింది. అతని తల్లి కాచిన వేడినీళ్లతో స్నానం చేసి అతని అమ్మమ్మ చేతి గోరుముద్దలు తింటూ అలా నిద్రలోకి జారుకున్నాడు. కానీ రోజులో జరిగిన ఆ ఐస్ సంఘటన అతని మనసులోనే ఉంది అదే తలుచుకుంటూ పడుకున్నాడేమో కలలో వాడికి ఐస్క్రీమ్ బండి కనిపించి.. మా ఐస్క్రీమ్ మా ఐస్క్రీమ్ అని చేతులు చాచి కలవరిస్తున్నాడు..
అది అలా ఉండగా..
ఒక 24 యేండ్ల కుర్రాడు, అతనికి కళాశాల చివరి రోజు అలాగే ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు జరిగే రోజు..
అతను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న మగువకి తన మనసులో మాట చెప్పటానికి సిద్ధమయ్యాడు ఒక చిన్ని కవితని కూడా కంఠస్తం చేసుకున్నాడు, అలాగే ఇంటర్వ్యూ రీత్యా ప్రశ్నలకి సిద్ధమయ్యాడు..ఆ అమ్మాయి ఎదురుగా రానే వచ్చింది కానీ ఎప్పటి లాగే అతని గొంతు ఆమెను చూడగానే మూగపోయింది బహుశా అతని గుండె ధైర్యం అతని ప్రేమని వ్యక్త పరచడానికి సరిపోలేదనుకుంటా అలా ఆ అమ్మాయి వెళ్ళగానే లోలోపల నవ్వుకొని ఇంటర్వ్యూ గది దగ్గరికి వెళ్లి గది బయట అతని స్నేహితులతో కూర్చున్నాడు.అతని పేరు పిలిచారు, ప్రేమలో ఉన్న భయం,కంగారు ఇక్కడ లేవు అనుకుంటా చాలా ధైర్యంగా ఇంటర్వ్యూ ని ఎదుర్కుని ఉద్యోగం సంపాదించాడు. ఆ సంతోషాన్ని ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులతో పంచుక
ున్నాడు.ఆ ఆనందం లో అతని తండ్రి రాత్రికి మాంసం వండమని ఆ కుర్రాడి అమ్మకి చెప్పాడు, ఇక రాత్రి అయ్యింది అతని తల్లి వండిన మాంసం పుష్టిగా తిని పడుకున్నాడు..ఈ వయసు వారికి రోజులో మంచి జరిగినా చెడు జరిగినా రెండిటి గురించి ఆలోచిస్తూ పడుకుంటారు.అలా ఆలోచిస్తూ పడుకున్నాడేమో సరిగ్గా అర్ధరాత్రి..
ప్రియా ! నిను చూసిన ఆ క్షణం ఏదో తెలియని భారం నా గుండె మోసింది..నిను చేరువయ్యే ప్రక్రియలో ఆ గుండె యొక్క భావం నా మనసుకి తెలిసింది అది ప్రేమ అని..నిను చూసి తరించే నా మనసు నీ మనసు లో చోటుకోరుకుంది ఇస్తావా.? చెమట బొట్టు కారనివ్వకుండా నిను చూసుకుంటాను..
అని చెప్తూ నాకు ఉద్యోగం కూడా వచ్చింది ప్రియా అని కలవరిస్తున్నాడు..
అది అలా ఉండగా..
ఒక 50 యేండ్ల ఆవిడ, ఆ ఊరిలో జరిగిన చుట్టాల పేరంటానికి వెళ్ళింది, బంధుమిత్రులు అందరూ వచ్చారు, వచ్చినవాళ్ళతో ముచ్చట్లు పెట్టడంతో అక్కడ అందరూ మీ వాడి పెళ్లెప్పుడు అని అడగగా ఒక చిన్న నవ్వు నవ్వి వాడు ఇంకా కుదురుకోవాలి లే వదినా అని చెప్పి కార్యక్రమం చూడసాగింది..అలా ఆ పేరంటం ముగించుకొని ఇంటికి వచ్చింది.ఇక సాయంకాల సమయం కదా ఇల్లంతా ఊడ్చి పాత్రలు శుభ్రపరిచి రాత్రి భోజనం కోసం అంతా సన్నద్ధం చేసుకుంది ఇక చీకటి పడగానే భోజనం వండి అందరికీ వడ్డించి, అందరూ తిన్నాక తను తిని పాత్రలన్నీ శుభ్ర పరిచి ఇక పడకకు చేరుకుంది..ఈ వయసు వాళ్ళు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పడుకుంటారు.. అలా తన కొడుకు పెళ్లి గురించి ఆలోచిస్తూ పడుకుందేమో.. బాగా రాత్రి సమయంలో రేయ్ నాన్నా త్వరగా పెళ్లి చేసుకోరా, ఎప్పుడు చేసుకుంటావ్ రా అంటూ కలవరిస్తోంది..
ఇదంతా ఆ యేడేండ్ల పిల్లాడి తాత, ఇరవై నాలుగు యేండ్ల కుర్రాడి తండ్రి, యాభై యేండ్ల ఆవిడ భర్త, నిద్ర పట్టక లాంతరు వెలుగులో పుస్తకం చదువుతూ వారి కలవరింతలు గమనిస్తూ నవ్వుకోసాగడు..
ఒక మనిషికి రోజులో జరిగే ఒక సంఘటన మెదడుకి బాగా ఒత్తిడిని కలిగించడం వల్ల, లేదా ఒక సంఘటన వల్ల మెదడుకి భంగం కలగడం వల్ల గానీ ఆ సంఘటన మెదడు లో పాతుకుపోతుంది దాని వల్ల ఈ కలవరింతలు పుట్టుకొస్తాయి..మీకు ఇలాంటి కలవరింతలు వచ్చిఉంటే నవ్వడం మరవకండి..
✍️సుధీర్..