4.మౌన ప్రేమ
4.మౌన ప్రేమ
ప్రేమ చూపులంటే అవేనేమో....? కొన్నాళ్లుగా గాంధీ పార్కు కొస్తున్నారు వారిద్దరూ...! దూరం నుంచి వారినే గమనిస్తూ వుంటాను...
ఆమె అతన్ని చూస్తూ ఉంటుంది...
అతనూ ఆమెను చూస్తూ ఉంటాడు...
కానీ మాట్లాడుకోరు...నవ్వుకుంటూ వుంటారు.
ఒక చోట కలిపి కూర్చోరు....
ఓ ముప్పయి అడుగుల దూరంలో వుంటారు...
మొత్తానికి మౌనంగా ప్రేమించేసుకుంటూ వుంటారు...
చూడ్డానికి భలే ఇంటరెస్టింగ్ గా ఉంటుంది వారిద్దరినీ చూస్తుంటే...!
వారిద్దరూ కలిసేది ఎప్పుడో...?
ప్రేమ ఫలించేది ఎప్పుడో...?
వారిని గమనించడం కోసమే....ప్రతిరోజూ నేను పార్కుకి వెళ్తూ వుంటాను. అక్కడ ప్రేమ జంటలెన్ని కనిపించినా...ఇంకా జంట కాకుండా చూపుల్తోనే ప్రేమను వ్యక్తం చేస్తున్న వారి ప్రేమ చూపుల్నే గమనిస్తూ వుంటాను. మిగిలిన ప్రేమ జంటల్ని నేనంతగా పట్టించుకోను.
సరిగ్గా సాయంత్రం నాలుగయ్యేసరికి అక్కడికి చేరుకుంటారు. ఆరయ్యే వరకూ...అక్కడక్కడే కాలక్షేపం చేసేసి...ఎవరిదారిన వారెళ్లిపోతారు.
ఇలా...ఎంత కాలం...? నాకైతే అందరిలా వారెప్పుడు జంటగా కూర్చుని కబుర్లాడతారా అని కుతూహలంగా ఉంది.
ఓరోజు నేను వెళ్ళేసరికి...అతనొక్కడే కనిపించాడు. ఆమె కోసం చుట్టూ చూసాను. వచ్చిన జాడ కనిపించలేదు. అందుకేనేమో....ఏదో పోగొట్టుకున్నవాడిలా డల్ గా వున్నాడు . ఆమె వస్తుందేమో అని పదే పదే చూస్తున్నాడు.
కొంచెం సేపు అతని అవస్థ గమనించి...ఈరోజైనా అతన్ని పలకరిద్దామని దగ్గరకు వెళ్ళాను. నన్ను చూసి ఒక్కసారిగా తత్తరపడ్డాడు. లేచి నుంచున్నాడు. "పర్లేదు కూర్చో"...అంటూ అతని చేతిలోని పుస్తకంపై 'ఆకాష్' అనే అందమైన పేరు చూసాను.
ఆకాష్ నీపేరా...? అడిగాను.
తలాడించాడు...అవునన్నట్లు.
రోజూ వచ్చి అక్కడ కూర్చుని వెళ్లిపోయే ఆ అమ్మయంటే నీకిష్టమా...? అడిగాను.
సిగ్గుపడుతూ బుర్ర వంచుకున్నాడు.
&n
bsp;కొంచెంసేపు...అతని దగ్గరే గడిపి...మొత్తం అతని గురించి తెలుసుకున్నాను.
అయితే ...నేనే ఆమెతో మాట్లాడి...ఆమె అభిప్రాయం కూడా తేల్చేస్తాను....అన్నాను.
అతను చేతులు పట్టుకున్నాడు కృతఙతగా...!
* * *
మర్నాడు...
ఆమెను కూడా కలిసి మాట్లాడాను.
పేరు భూమిక.
ఆకాష్ కి సరైన పేరు.
ఆమెకి అతనీపై అభిప్రాయం తెలుసుకున్నాకా... వారిద్దరికీ సరైన జోడీ అనిపించింది.
మధ్యవర్తిగా...ఇద్దరి మధ్యా రాయభారం నడిపాను.
ఇరువర్గాల తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లికి ఒప్పించాను.
ఎందుకంటే...ఎందరో ప్రేమల్లా...వీరి ప్రేమ భగ్నమవ్వకూడదు. అలాంటి పరిస్థితి ఎదురైతే.... తట్టుకోలేని ప్రేమమూర్తులు వీరు.
వారి ఇష్టాన్ని ఒకరికొకరు చెప్పుకోలేక...ఒకరి గురించి ఒకరికి నిజాన్ని తెలిస్తే...ఆ ప్రేమ ఏమౌతుందోననే బిడియంతో...ఎవరికి వారే ఒకరికొకరు ప్రేమ చూపులు చూసుకుంటూ...మౌనంగా ప్రేమించుకుంటున్నారంటే....వారి మనసులు మూగవి కాకపోయినా...నోరు లేని మూగవారు కావడం వల్లే.
మౌనప్రేమతోనే...ఒకరి మనసుల్ని ఒకరు గెలుచుకుని....పెళ్లితో ఒకటయ్యారు..ఆకాష్ - భూమికలు.!*
వారిద్దరినీ ఒకటి చేసినందుకు...నాకాళ్లకు దండం పెట్టారు. వారిని ఆశీర్వదిస్తుంటే...నాకళ్ళెందుకో చెమర్చాయి.
బహుశా.. ఓ మూగ జంటను కలిపినందుకు నాకొచ్చిన ఆనంద భాష్పాలేమో....!!*
*** *** ***