యుద్దపు మరమ్మత్తు
యుద్దపు మరమ్మత్తు
ఎన్ని కన్నీటి కావ్యాలు రాసింది కాలం
నేల వస్త్రాల పొరలను చీల్చుకుంటూ
యుగ సందులను యుద్ధాలతో ముగిస్తూ
ధరణి క్షేత్రములో జెండాలను ఎగరేసింది..
ఆత్మ రక్షణకు పుట్టిన ఆయుధం
యుద్దపు మంటల్లో పదునెక్కి వస్తుంది
ఆదిలో వేటకు సృష్టించిన అస్త్రం
జాతులకు అహంకారపు ఆభరణంగా నిలిచింది..
సరిహద్దులు గీయడం నేర్చుకున్న మనిషి
తోటి మనిషి పై యుద్ధం ప్రకటించే
జాతుల మధ్య వైరం పుట్టి సంగ్రామం సాగించే
అర్థము తెలియని సమరానికి ఆజ్యం పోసే....
యుద్ధం పరమార్థం తెలియని జాతులు ఎన్నో
మారణహోమం జరిగేందుకు పునాదిలేసిరి
నేల తల్లి విలయానికి కారకులు అయ్యారు
సృష్టిలో నిప్పుల వర్షాలు కురుస్తున్నారు నేడు...
కాలపు మధ్యలో ఖడ్గపు ర
ుధిర ప్రవాహం
అంగములు కోల్పోయిన తనువుల ఏడుపులు
వైతరణి నదిలో స్నానం చేసే శవాలు
యుద్దానికి పరాకాష్టగా నిలిచిన జ్ఞాపకాలే కదా..
రాజ్యాలు ఏన్నో ఏర్పడే రాక్షసత్వంతో
ఆయుధాలు ఎన్నో సమకూర్చి పెట్టుబడిగా
రక్తపు ఏరులు లో పిశాచాల జలగలు
తలలు తెగిన మండెంలు నేలపై ప్రాకుతున్నాయి..
విశ్వవిజేతలు కావాలని ఎందరో కలలు కన్నారు
యుద్దపు మహమ్మారిని వెంటేసుకొని తిరుగుతూ
అడుగడుగున రక్తపాతపు దారులు సృష్టించి
రిక్తహస్తులై భూమిలో కలిసిపోయారు రారాజులా
అణు అస్త్రాల విస్ఫోటనంతో భూమికి గాయం
పచ్చని నేలలో విషం నిండుతుంటే
విజ్ఞానపు పోకడల్లో అజ్ఞానం నింపుకుంటూ
అనాగరికంగా యుద్ధపు మరమ్మత్తులు చేస్తున్నారు.