వాసన లేని పూవు
వాసన లేని పూవు
అక్కడుండేవి
చిక్కని చెట్ల గుంపులు
వృక్షాలపై
పక్షులూ పిట్టలూ
ఊహకందని రంగుల చిత్రాల్లా
అక్కడుండేవి
శుక పికముల
కీలకిలలూ కువ కువలూ
ఊరంతా సరిగమలు సవ్వడి
ఆ కొమ్మలపై
రెమ్మలు కొరుకుతూ
కుహూ కుహూ
కోకిల గానాలు
అక్కడ చూశాను
బరువుతో తలవాల్చిన
వరి కంకులు
నిండు గర్భిణిలా!
నింగిపై కోకొల్లలు
తెల్లని కొంగలు
గుంపులు గుంపులు
అక్కడుండేవి
గోవులూ గేదెలూ
గొర్రెలూ మేకలూ
మందలు మందలుగా
మనుషుల కన్నా ఎక్కువగా
అప్పుడు ఆఘ్రాణించాను
పేడ పరిమళం
పశు సుగంధం
ఆశువుగా వచ్చేవి కవితలు నా నోట
అక్కడే ఉండేవి
ఎక్కడా దొరకని
ఆప్యాయతానురాగాలు
ఎంత జుర్రుకున్నా తరగని సుధలు
అక్కడే చూశాను
చక్కని ఎంకిని
నుదుట రూపాయంత బొట్టు
కొప్పులో మల్లెలూ చేమంతులూ
చెంగావి కోకతో
చెంగు ముడివేసి
అక్కడుండే వారు
యాదవ కన్నెలు
పచ్చ పరికిణీల్లో
ఎర్రని పమిటల్లో
ఇప్పుడేవరూ లేరే!!
ఊరంతా ఈకలు పీకేసిన కోడిలా!
శుభ్ర ముండనం చేసిన శిరసులా !!
ఏమిటిలా ఉంది మా పల్లె?
మనసులు పొగుట్టుకున్న మనుషులు
కంకాళాల్లా తిరుగుతున్నారు
ఆ పక్షుల పాటలేవీ
నక్కల ఊళలు తప్ప
తిలకధారణలేని తరుణులు
విధవలో సధవలో!
ఊరంతా డీజెల్ కంపు
ఉసూరుమన్న నా ప్రాణం
పరిణామం అనివార్యమే
ఇదేమి పరిణామం
వాసన లేని పూవులా!!
... సిరి ✍️❤️
