ఆ వెన్నెల
ఆ వెన్నెల
అనువాదం చేయలేను..నీ చూపుల ఆ వెన్నెల..!
ఓ లేఖన నింపలేను..నీ చూపుల ఆ వెన్నెల..!
అనురాగపు రుచి తెలిపే..రాగమేదొ ఏమోలే..
స్వరం కట్టి పాడలేను..నీ చూపుల ఆ వెన్నెల..!
సిగ్గుపడే మల్లెలతో..చెప్పనులే నేర్చుకోగ..
మొగ్గలపై ఒంపలేను..నీ చూపుల ఆ వెన్నెల..!
సడిచేయక నిలిచినదే..అచ్చెరువున మానసమే..
మరి ఎవరికి చూపలేను..నీ చూపుల ఆ వెన్నెల..!
నవ్వుతుంది నా డైరీ..తన ఖాళీ పుటల సాక్షి..
వర్ణించగ తలచలేను..నీ చూపుల ఆ వెన్నెల..!
అమృతవర్షిణి బొమ్మనెలా..చిత్రించను కాగితాన..
పలుకులతో తూచలేను..నీ చూపుల ఆ వెన్నెల..!
