చెబుతున్నా
చెబుతున్నా
ఒక బంగరు మల్లెతీగ..ముచ్చటలే చెబుతున్నా..!
కనిపించని కోమలాంగి..జతలోనే ఉంటున్నా..!
మనోహరం తన నాట్యం..అందదోయి వర్ణించగ..
తెఱిపిలేని తన అందెల..రవళులనే వింటున్నా..!
నా నిద్దుర కాజేసిన..తన బొమ్మను గీయలేను..
అక్షరాల మాటునున్న..రూపసినే కంటున్నా..!
పలుకుతేనె వర్షించే..ఆ కన్నుల దాసుడనే..
ప్రతి'భావన సీమసాక్షి..ప్రతి అడుగూ వేస్తున్నా..!
ఎవరి మనసు వారిదేను..నీమనస్సు లాంటిదేను..
ప్రతి మనసుకు నిత్యం ఓ..స్నేహలేఖ వ్రాస్తున్నా..!
మాటసాక్షి మనసుంటే..లోటుండదు ప్రశాంతతకు..
సందేశం ఇవ్వలేను..ఓ సూచన చేస్తున్నా..!
