వాళ్ళూ స్వార్థపరులే !!
వాళ్ళూ స్వార్థపరులే !!
నిజమే కొందరికి, వాళ్ళూ స్వార్థపరులే
జీవుల్లో అత్యంత స్వార్థజీవులు మనుషులే
ఈ మనిషి ఉనికిలోనే స్వార్థపు పాలెక్కువ
తన మనుగడ ముసుగులో మరీ ఎక్కువ
ధనం మూలం మిధం జగత్తు అనే నానుడి
ప్రతి సంబంధం ఆర్థిక బంధాలతో ముడిపడి
సేవాభావాన్ని తుంగలో తొక్కే నయా జమానా
స్వార్థపు కోణంలోనే సాగి, నిండే తమ ఖజానా
అయితే స్వార్థానికి రెండు రూపాల్లో పోటి
తన స్వార్థమైతే ఒక రూల్, మందిదైతే మరోటి
స్వార్థపు బుద్ధి పరుల్లో కనపడొద్దనే తన స్వార్థం
ఆపన్నహస్తం ఓసారి దూరమైతే అంతా చిధ్రం
మన అవసరాలు తీర్చి, కన్నీళ్లు తుడిచే వారు
మన బాధను తమ బాధగా మోసేవారు
చేసి చేసి,ఒక్కరోజు చూడకపోతే వారు
వెంటనే మన దృష్టిలో వారు స్వార్థపరులే
మన మాటకు నిత్యం తలూపిన వారు
ఏది చేసినా మెచ్చుకుని మనకు నచ్చే వారు
అడుగులకు మడుగులు ఒత్తి నచ్చిన వారు
ఒక్కసారి కాదు, కూడదంటే వారు స్వార్థపరులే
జీవితంలో అమ్మ నాన్న అంటే తీపి కాదెవరికి
నేడు వారు చేసే మంచి బోధనలే చేదు మరి
ఆ సంఘర్షణలో నీ ఇష్టాన్ని కాదన్న పెద్దరికం
అపుడు నీ దృష్టిలో వారు ఒక స్వార్థపరులే
వందల సార్లు చేయూత నిచ్చే మిత్రుడు
వీలుకాక ఒక్కసారి చేయకుంటే చేదయ్యే మైత్రి
అర్థం కాని నీ మనసుకు తానొక్కడే శత్రువు
నేడు ఆ ఆప్త మిత్రుడు కాస్త స్వార్థపరుడే
భార్య అయినా, భర్త అయినా పరస్పర తోడు
ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా బంధం చెడు
అరమరికలు లేనంత వరకు అంతా సవ్యం
లేదంటే అనైతిక ముద్రతో వారు స్వార్థపరులే
ఎవరైనా ఎపుడూ పొందే లబ్ధితో కృతజ్ఞత
ఏ రోజైనా తేలికగా తేడా వస్తే తప్పుడు సంజ్ఞ
ప్రతిదీ భూతద్దంలో చూసేటి నేటి సమాజం
ఏకపక్షంగా అసహజమనిపిస్తే స్వార్థపరులే
మనకు ఉపయోగపడితే ఏదైనా మంచితనం
మన మాట వింటే నీకు అదొక మానవత్వం
మన వైపు నిలబడితే వారు నిజాయితీపరులు
మన నుండి దూరమైతే వాళ్ళూ స్వార్థపరులే
మన అవసరం తీరితే లోకమంతా మంచి
లేదంటే అనాదిగా వున్న బంధాలను తుంచి
మన సంకుచిత మనస్తత్వమే మనకు సంకెళ్లు
పరస్పర పరోపకారంతో బంధాలు దూసుకెళ్లు
