సప్త వర్ణాలు
సప్త వర్ణాలు
జీవితమంటేనే సప్త వర్ణాల సమాహారం
చట్రంలో అన్నీ కలగలిపితే ఓ శ్వేత వర్ణం
మనిషి కలలు నలుపు తెలుపుల సంగమం
నిస్సారంగా జీవితం ఓసారి వివర్ణమయం
ప్రకృతిలో ఎన్నెన్నో వర్ణాల మిశ్రమాలు
ఒకదానికొకటి విడదీయలేని బంధాలు
మన కంటికి ఇంపుగా వర్ణాల వైవిధ్యం
మానసిక స్థితిని తెలిపే రంగుల విస్తృతి
ఆకాశాన మేఘం కార్చే చిరుజల్లులు
సూర్యుడు ఓదార్పుగా తాకే కిరణాలు
మేఘాల గుండెలపై విరిసే ఇంద్రధనుస్సు
అలా ప్రకృతి చిరునవ్వే ఈ సప్త వర్ణాలు
ఎరుపురంగు ఎదలోతుల్లో రుధిరం
అమ్మ గుండెలో ప్రవహించే ప్రేమ రక్తం
అభ్యుదయానికి అసలు సిసలు ఆనవాలు
దీపంగా వెలిగే త్యాగపు వర్ణమే అరుణారుణం
నారింజలో అస్తమించే సూర్యుని చివరి ఆశ
రేపు మళ్లీ వస్తాను అంటూ ఇచ్చే వాగ్దానం
పవిత్రకు, త్యాగానికి ప్రతీకగా నారింజ వర్ణం
మనిషి మనసుకు స్వాంతన నిచ్చే దైవత్వం
పసుపు ఓ శుభానికి వాడేటి సంకేతం
చెమట చుక్కలు, శ్రమైక జీవనానికి ఊతం
సాంప్రదాయాలకు, సౌందర్యానికి హితం
ఇంటి కలలకు అన్నం పెట్టే కష్టపు కాంతి
ఆకుపచ్చ హరిత భరిత జీవనానికి చిహ్నం
మట్టి గుండెలో మొలిచే నమ్మకమైన మొలక
కరువులు కాటేసినా చిగురించే రైతన్న ఆశ
పర్యావరణానికి, జీవావరణానికి ప్రతీక
నీలమంటే ఆకాశంలా విశాలమైన వర్ణం
కొలువలేని సముద్రములా అంతరంగం
నీలి కాంతి అనగారిన బతుకులకు ఆశాదీపం
కన్నీటి సముద్రంలో ఒడ్డుకు చేర్చే భరోసా వర్ణం
ఇండిగో అర్ధరాత్రిలా మనసులోని మౌనం
ఎవరికీ చెప్పుకోలేని గాయాలకు లేపనం
తన చీకటి ఒడిలో కష్టాలను దాచుకున్న వేదన
ఓ ప్రత్యేక వర్ణంగా మదిలో మెదిలే ఆవేదన
ఊదా జీవిత సంధ్యలో మిగిలిన జ్ఞాపకం
వేదనల మధ్య నవ్వుతూ కనిపించే వైనం
గడిచిన జీవితపు గంభీర సంతకంలా మజిలీ
కాచి వడబోసిన సారంలా చిక్కటి అనుభూతి
రక్తంలా ఎరుపు, త్యాగంలా నారింజ
సంతోషాల్లో పసుపు, ఆశల దారిలో ఆకుపచ్చ,
కన్నీటిలో నీలం, ఇండిగోలా ఓ మౌనం
వేదనల ఛాయల్లో ఊదా వర్ణపు జీవితం
సప్త వర్ణాలు కలిస్తేనే మెరిసే ఇంద్రధనుస్సు
చీకటిదాటి వెలుగుల ప్రకాశమే బతుకు ఉషస్సు
అన్ని అనుభవాలూ కలిస్తేనే వచ్చే యశస్సు
జీవితం పరిపూర్ణమవడమంటే అదో తపస్సు
