నిన్ను నీవు
నిన్ను నీవు
నిన్ను నీవు చదవకుండ..ఏమి వ్రాసి పడేస్తావు..!?
నీలో నువు చేరకుండ..ఏమి వ్రాసి పడేస్తావు..!?
రాగాలను రాల్చుకునే..సంగతింత పట్టేనా..
మనసుపట్టు వదలకుండ..ఏమి వ్రాసి పడేస్తావు..!?
యేఱు ఏది ఉంటున్నది..నదిదిశగా సాగకుండ..
సంద్రంలా పొంగకుండ..ఏమి వ్రాసి పడేస్తావు..!?
అలను అలయె తీరం..చేర్చేనని అనిపించును..
సత్యమేదొ అందకుండ..ఏమి వ్రాసి పడేస్తావు..!?
పైపై సోకుల కేమిటి..లోని మురికి వదిలిందా..
సాధనలో మునగకుండ..ఏమి వ్రాసి పడేస్తావు..!?
రుచులవెంట పరుగాగిన..దాఖలాలు ఏవోయీ..
జవాబుగా ఉండకుండ..ఏమి వ్రాసి పడేస్తావు..!?
