తల్లి ప్రేమ
తల్లి ప్రేమ
*తల్లి ప్రేమ*
(తేటగీతి పద్యమాలిక.)
అమ్మ కోసమై వచ్చె నా హరి ధరణికి
గోపబాలుడై పల్లెలో కొలువు చేసె
నమ్మయను నా పిలుపు పంచు నమృతంబు
తల్లి మహిమను గొనియాడ తరమె మనకు?
రక్తమాంసాదు లన్నియు రంగరించి
చదువు సంధ్యలు నేర్పించి సాకుచుండి
బిడ్డలన్ బాధ్యతగ తాను బెంచు తల్లి
తల్లి ప్రేమను తూచెడి త్రాసు కలదె?
జీవితంబున తల్లికి సేవచేసి
తనరు చుండెడి పిల్లలే ధన్యులనుచు
శాస్త్రముల్ తెల్పు చుండగా జగతి యందు
తల్లి కరమును వీడుట తప్పు!తప్పు!
పరుల సంస్కృతిన్ గైకొని వరలు చుండి
పెద్దవారిని దూషించు బిడ్డలిపుడు
వెఱ్ఱితనముతో వసుధలో పెరిగిరకట!
దేవతగు తల్లి విలువను తెలియ జెప్పి
దురిత గుణముతో చెలరేగు దుష్టమతులఁ
మార్చవలయును విబుధులు మానితముగ.//
