తావెక్కడ
తావెక్కడ
ఆలోచన ఆగిపోతె..రాగానికి తావెక్కడ..!
నాలోనే నీవుంటే..విరహానికి తావెక్కడ..!
తపమేదో సలుపుశక్తి..లేదు నాకు ప్రియతమా..
నీ పేరే జపమైతే..తాపానికి తావెక్కడ..!
మరపన్నది వరమైతే..మనసుకెంత శాంతమో..
స్మరణకాస్త మాయమైతె..స్వప్నానికి తావెక్కడ..!
నిదురకెంత వెరపోయీ..నా రెప్పలు తాకేందుకు..
తమాషాల నాటకమున..మోహానికి తావెక్కడ..!
పిలుపువినని గాలికున్న..చిలిపితనం చిత్రములే..
పరిమళించు వసంతాన..జగడానికి తావెక్కడ..!
కులాసాలు వర్షించే..యోగమధువు నీ చూపే..
ప్రతికణమొక విశ్వమైన..స్వార్థానికి తావెక్కడ..!

