STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

సుమ సౌరభము

సుమ సౌరభము

1 min
376


పరిమళ భరిత మచ్చటి విరుల తోట

మరులు గొల్పుచు చిల్కెను మధురిమలను

తేటి గుంపులు ముదముగ తిరుగు చుండ

మనసు నిండగ వీచెను మారుతంబు.


మల్లె మాలతి విరిసెను తెల్ల వారి

మాట కలుపుచు మృదువుగా మనసు విప్పి

పూవు లన్నియు ముచ్చట్లు మొదలు పెట్టి

కులుకు చుండెను తలలూచి కొమ్మలందు.


గున్న మామిడి కొమ్మపై కోయిలమ్మ

గూటి లోనుండి మెల్లిగా కూయసాగె

కొలువుతీరెను కాకుల గుంపు యొకటి

ఱెక్కలల్లార్చి గోరింక నిక్కి చూచి

గొంతు సవరించి పాడెను గోము మీర.


కలకలంబులు వినినంత కనులు విప్పి

భానుడచ్చోట నరుదెంచె పఱుగు పెట్టి

సూర్య దేవుని గాంచిన సుమము లపుడు

సరస సల్లాప మాడుచు స్వాగతించె.


రహిని జల్లుచు నర్కుడు లలిని చూప

పూల బాలలు ముద్దుగ మురియు చుండి

స్నానమాడగ వెలుగుల వాన లోన

పూల వనమెల్ల తడిసెను పులకరించి//




Rate this content
Log in

Similar telugu poem from Classics