సృష్టిస్తూ
సృష్టిస్తూ
నవ్వేవా గలగలమను..సెలయేళ్ళను సృష్టిస్తూ..!
యము'నా'నది వెన్నెలనే..సరికొత్తగ చూపిస్తూ..!
కావ్యమేదొ వ్రాయాలను..సంకల్పం దేనికిలే..
హృదిలోయల దాచుకోగ..పదాలేల వర్ణిస్తూ..!?
ఆకలిదప్పులు మాయం..చేసే జాదూ నీదే..
ఊహకు అందని భావన..ఒకలీలగ వర్షిస్తూ..!
బృందావని కొకరూపం..ఇవ్వాల్సిన పనేమిటిక..
ఉండనిమ్ము ప్రతితలపూ..నీపూజకు అర్పిస్తూ..!
ఇరుకుదారు లెట్లుండును..గోడలడ్డు లేనప్పుడు..
విశాలతకు ఉదాహరణ..మౌనంగా అందిస్తూ..!
ఎన్ని ఊహలో లోలో..గగనాలకు ఆవలనే..
జన్మకథా వీధులన్ని..అలవోకగ దాటిస్తూ..!
