స్నేహితులం
స్నేహితులం
చింతమర్రి చెరువులోన..ఆడుకున్న స్నేహితులం..!
అబద్ధాలు వంతపాడి..నవ్వుకున్న స్నేహితులం..!
ఎంత మధురమని అడిగిన..ఏమి మాటలుండునులే..
పిచుకగూళ్ళు కట్టి భలే..చెరుపుకున్న స్నేహితులం..!
పుస్తకాలు పలకలన్ని..గున్నమావి గూటిలోన..
పదిలముగా కవరుచుట్టి..దాచుకున్న స్నేహితులం..!
గొంతు మార్చి అటెండెన్స్..రానివారి బదులిస్తిమి..
చింతబరికె పూజలెన్నొ..ఓర్చుకున్న స్నేహితులం..!
బడులైనా గుడులైనా..మా క్రీడా స్థలులేగా..
పులిహోరలు పొంగళ్ళను..పంచుకున్న స్నేహితులం..!
చెట్టునీడ క్లాసులెంత..ఆహ్లాదం గొలిపేవో..
ఇంటర్వెల్లు చిరుతిళ్ళకు..నోచుకున్న స్నేహితులం..!
వానాకాలం చదువుల..సారం పిండిన వాళ్ళం..
ఎండాకాలం సెలవులు..నంచుకున్న స్నేహితులం..!

