సమాజం
సమాజం
వేలెత్తి చూపిస్తుంది సమాజం
కాలంతో పరిగెత్తలేని అభాగ్యుడిని చూసి
ఆధునికత ఓర్వలేక పోతుంది
అజ్ఞానపు కప్పల సమూహాన్ని చూస్తూ...
విమర్శల ఈటలు ప్రతి చోటా ప్రదర్శం
మాసిన వస్త్రం ముళ్ళకంపపై వాలితే
సింగారపు మనిషి చీకట్లో దాక్కునే
అంటరానితనం నడిరోడ్డుపై తిరుగుతుంటే..
ప్రతిరోజు నిద్రలేని రాత్రుల్లో పీడ స్వప్నం
ఎడారిలో ఎండిన చెట్టుకు చేతబడిలా
సర్వస్వం కోల్పోయిన ఎముకల గూడు నడుస్తుంటే
రక్త మాంసాల జీవులకు ఆవాసం దొరక్క..
బాబాల మాయలో మరో ప్రపంచం పిలుస్తుంటే
జ్ఞానం చొక్కా లేని తనువు తిరుగుతుంది
మిడిమిడి జ్ఞానాలు మిడిసిపడుతూ
అమాయకపు ప్రజలను పీనుగల్లాగా మారుస్తుంది..
కొత్త చట్టం కోరికలకు చుట్టాల్లా ఉంటే
పాత శాస్త్రం ఊరగాయలా ఊరిస్తుంటే
చెట్టు కింద గుడిసెకు అర్థం కాని అయోమయం
పలకరించే నాధుడు లేక ఎటో ప్రయాణం..
మొండి ఘటాల చరిత్రలో నిలిచిపోయే
కొన్ని గుండెలు అలసి నిద్రపోయి
బండరాయిపై మొక్క భవిష్యత్తు కోసం చిగురిస్తే
కనికరం లేని కొడవలి పీక కోసి పోతుంది..
