హరివిల్లు
హరివిల్లు
నీ నవ్వుల హరివిల్లే..పొదరిల్లుగ దక్కింది..!
ఈ జన్మకు నీ తలపే..ఒక ముద్దుగ మిగిలింది..!
నీ పలుకులు దీపాలై..తరిమేనా చీకట్లను..
పాడుకోను నవరాగం..ఒక తోడుగ దొరికింది..!
విరహమెంత అల్లరిదో..చేరెను జత చెప్పకే..
ఓ తియ్యని భావనమే..ఒక మధువుగ మారింది..!
ఎవరికి వ్రాయను లేఖను..వెర్రితనం గాకేమి..
గుండెసడికి సందేహం..ఒక నవ్వుగ వెలిగింది..!
నీకోసం పరితపించు..బుద్ధికన్న సంపదా..
ప్రశ్నించే తత్వమదే..నిజ ధనముగ అందింది..!
ప్రేమంటే వీచుగాలి..సాక్షియైన మౌనమే..
విశ్వాలను ఏలుతోంది..నీ వలపుగ తెలిసింది..!
