బాగున్నావి
బాగున్నావి
మదిని కాల్చు జ్ఞాపకాల..మల్లెలెంతొ బాగున్నవి..!
ప్రాణదీప ధారగ నీ..చూపులెంతొ బాగున్నవి..!
రాలిపోవు పూలకొరకు..చెట్టు ఏది శోకించును..
జవాబుగా మిగిలే నీ..నవ్వులెంతొ బాగున్నవి..!
నరకాసురు లెవరన్నది..ఎవరికెవరు చెప్పాలిక..
చెలిమిదారి పరచిన నీ..పిలుపులెంతొ బాగున్నవి..!
నువ్వెట్లా ఉన్నావని..పలకరించు నేస్తమెవరు..
మెల్లగ తల నిమిరే నీ..గాలులెంతొ బాగున్నవి..!
వ్రాతబల్ల ఎదుట అలా..మౌనముగా నిలిచేవా..
నా రచనను నడిపే నీ..ఊసులెంతొ బాగున్నవి..!
ప్రేమన్నది హృదయనిధిగ..తెలుసుకున్న వారెవరో..
కలం గుండె మీటే నీ..మెఱుపులెంతొ బాగున్నవి..!
