సలసలకాగుతూ
సలసలకాగుతూ
జగమంతా అందాలమయం
ప్రకృతి పంచే ఆహ్లాదం
జీవరాశులు ఆనందమయం
సోయగాల నడుమ
మది ఊయలలూగే ఆనంద నిలయం
అందాలెన్నైనా...
ఎద తొలిచే ప్రశ్నలకు
సమాధానం మౌనమే...!
ఈర్ష్య,ద్వేషాలు
నిజం, అబద్ధం
ధైర్యం, పిరికితనం
ఆశ, అత్యాశ
ప్రకృతి, ప్రళయం
దేవుడు, దానవుడు
మధ్య ఎదురయ్యే ప్రశ్నలకు
సమాధానం కూడా మౌనమే!
అన్యాయాలకు ,అక్రమాలకు
మనసు స్పందించడం మొదలుపెట్టింది
బాధ్యతలు మరచిన,
రాక్షసత్వం నింపుకున్న మనిషిని
నిగ్గదీసి ప్రశ్నిస్తోంది...
ఎన్నాళ్ళదో ఆక్రోశము
లావాలా ఉప్పొంగుతోంది
చినుకు పడినా
నదిలా ప్రవహించినా...చల్లారక...
జన జీవన స్రవంతిలో
సల సల కాగుతూ
ప్రవహిస్తోంది...
సమాధానం లేని
ప్రశ్నలు ఎదురైన ప్రతిసారి
తనకు తానే దహనమై
మళ్ళీ నిప్పురవ్వలా ఉదయిస్తోంది...
ఆది అంతం ఎరుగక
నిప్పులు రువ్వుతూ
పోరాడే కత్తిలా మారి
చెడుపై దండయాత్ర కొనసాగిస్తోంది..
