శివమూర్తి
శివమూర్తి
శివమూర్తి
(కంద పద్యములు)
శివుడే దైవంబనుచును
భవ జలధిని దాట గోరి ప్రార్థింతు మదిన్
దివిజేంద్రనుతుని గాంచుచు
శివరాత్రి దినమున నిల్చి సేవింతు వెసన్.//
నరకంబున ద్రోయకు మని
కరిచర్మాంబర ధరునికి కైమోడ్చుచు నే
పరిచారికనై నిత్యము
విరిమాలలతోడ కొల్తు వేడుక మీరన్.//
జయమంచు మా కపర్ధిని
నియతిగ కీర్తించు చుండి నిర్మల మతితోన్
దయగొని కాచెడి శంభుని
భయహారిగ తల్తు నెపుడు భావనలోనన్.//
గిరిజాపతి యని పిల్వగ
పరుగున వచ్చుచు పినాకి పరమాప్తుడిగన్
జరియించును నా తోడుగ
పురహరుడే దిక్కటంచు మ్రొక్కెద ప్రణతిన్.//
పలుమారులు నామంబును
పలుకుచు నుండెద తొలగగ పాపపుటూహల్.
నలుదిక్కుల తేజముతోన్
వెలిగెడి శివ మూర్తిని గన వేడెద వినతిన్.//
