రాయగలను కొత్త లోకము
రాయగలను కొత్త లోకము
రాయగలను అడవిలో ఆకును అడిగి
చెట్టుపై చేసే సవ్వడులు వింటూ
మట్టి మనిషి హృదయాన్ని శుభ్రం చేసుకుంటూ
కనపడని వేర్ల బలాన్ని కలంగా మార్చుకుంటాను...
రాయగలను కోకిల కూతల శబ్దాల మర్మం
లేత చిగుర్లు మరిగి కూసే స్వరాల విందులు
కాలుష్యపు మరకల్లో విషం సమ్మేళితమైతే
కూనిరాగాలు మూగబోయిన ఆక్రందనలు....
రాయగలను పచ్చని అడివిలో పరవశించే అందాలు
భూమాతకు చేసిన సింగారపు సిరుల సొగసులు
చెట్ల తలలు తెగిపోతుంటే ఆకాశపు అంచు కూలుతుంటే
కలంలో సిరా చుక్కలు కురుస్తున్నాయి బాధతో...
రాయగలను సముద్రపు ఘోషను వినిపిస్తూ
అలలై అక్షరాలను ఎగిరి వేస్తూ కదులుతూ
అడుగున పడ్డ ముత్యాలను ఏరుకొనేందుకు సాగుతూ
అభాగ్యుల చేతిలో మురిపెమై నిలిచేందుకు....
రాయగలను నొసటి రాతను మించి
శ్రమ శక్తికి సహకరించేందుకు మనసులో ధైర్యం నింపి
ఆత్మవిశ్వాసానికి అక్షరాన్ని బహుకరించి
చరిత్రలో కావ్యమై అమృతమైనా అక్షరంగా నిలిచేందుకు..
రాయగలను శాశ్వతమైన మాటలను
మూడు కాలాలను మనసు నేత్రముతో వీక్షిస్తూ
సూర్యుని మురిపిస్తూ చైతన్య పరుస్తూ
నవయుగానికి కొత్త లోకాలను సృష్టించేందుకు...

