ప్రతీకలే
ప్రతీకలే
ప్రకంపనా ప్రతీకలే..!
సంకేతాలైన అక్షరాలు..
అమాయికతకు సాక్షిగా
భావగగన వీధుల్లో పక్షులే..!
ఎవరెవరి ఆవేశకావేశాలకో
వలసవచ్చి పోతుంటాయి అలా..
కవితా కరదీపికల్లోకి..
మాటలకందని చిత్రాల్లోకి..
నాట్యకళా రీతుల్లోకి..
విప్లవకాంక్షల్లోకి..!
అనాచ్ఛాదిత కిరణప్రవాహాలై..
నిత్యమౌన వేదాల్లోకి..
వాదప్రతివాదాల్లోకి..
అనువాదాల్లోకి..అనునాదాల్లోకి..
ప్రమోదాల్లోకి..ప్రమాదాల్లోకి..
దు:ఖ సముద్రాల్లోకి..
ఆహ్లాదాల్లోకి..!
అప్రమేయప్రమేయాలై..
వాక్య సమూహాలై..
కావ్యసమాహారాలై..
పాటల గంధాలై..!
ఎన్నోసార్లు అర్థరహిత ప్రసంగాలై..
ఎన్ని భావచిత్రరూపాల్లోకి ఒదిగినా
ఎప్పటికీ మరణంలేని
అపురూప నిరాలయలు..!
మౌనామృతవాహినులు..!
ఎంతైనా వెనుక ఉన్న
తత్వాన్ని అనుభవంలో పండించాలనే
తహతహలకు సహాయంగా..!
చైతన్య తీర్థాలుగా..
ప్రక్రియాతీతంగా..
క్రియారహిత శక్తిపాతాలుగా..
క్రియాశీలక ప్రతిబింబాలుగా..
నిర్మోహ నిశ్శబ్ద సత్యప్రకటనలుగా..!
