ప్రకృతికి ప్రతి రూపములు
ప్రకృతికి ప్రతి రూపములు
ప్రకృతికి ప్రతి రూపములు
(కవిత)
రతీ మన్మథులు రమణీయమైన ప్రకృతికి ప్రతి రూపములు
జతకూడి చరియించి సృష్టి ని నడిపించు ప్రాణ బీజములు.
ప్రేమ భావనతో ప్రకృతిని మురిపించు విలాసవంతులు.
కామితంబులు తీర్చు లలిత శృంగార లావణ్య దీపికలు.
మానసము నందుద్భవించెడి మధుర సంగీత గీతికలు
గానమై వినిపించు పంచమ స్వర రాగ రంజితములు.
చైతన్య భావ స్రవంతిలో విహరించు శ్వేత రాజహంసలు.
భాతిగా జగజ్జేతలై పరిపాలించు ప్రేమ సామ్రాజ్య నేతలు.
సకల జీవరాశులలో వలపు వసంతాలు విరజిమ్ముతారు.
వికల్పముల నెదుర్కొను శక్తిని ప్రసాదించు దేవతలు వీరు.
దైవ కార్యముకై హరుని క్రోధాగ్నిలో భస్మమైన విష్ణుసుతుడు.
దైవ బలముచే పునరుజ్జీవితుడైనట్టి కాముడు భావజుడు.
శ్రీవిద్యోపాసకుడై మన్మథుడు గురువై భాసించిన ఘనుడు
దేవిని ప్రార్థించి రతీదేవితో కూడి యనంగుడై జీవించినాడు.
ఆ మన్మథుడే ద్వాపరమున కృష్ణ సుతుడైన ప్రద్యుమ్నుడు.
ఆ రతీదేవి ప్రభావతిగా జన్మించ తన సతిగా చేపట్టినవాడు.
ధీవరుడైన మన్మథుని చరితము పఠించుటే పుణ్యప్రదము.
భావి తరముకు పౌరాణిక సాహితీ సంపద నందించుదాము!//
**************************
