తప్పులను దిద్దుకొందాం
తప్పులను దిద్దుకొందాం
తప్పులను దిద్దుకుందాం!
( వచన కవిత)
***********************
బ్రూణహత్యలు చేసే దుర్మార్గం పూర్వకాలంలో లేదే!
ప్రాణాలు తీసే కసాయితనం భారతీయ సంస్కృతి కాదే!
ఆడమగ యనే వివక్షను చూపే వాళ్ళాకాలాన లేనే లేరు!
కూడదంటూ గొడవ చేసే కూళలీ యుగాన పుట్టుకొచ్చారు.
స్త్రీని దైవంగా చూసే సంప్రదాయమెక్కడో మాయమైంది.
మౌనంగా రోదిస్తూ మగువ బ్రతుకు మరుగున పడింది.
ఆడపిల్లల్ని కనడమే పాపమనే మనుజుల మూర్ఖత్వం
పాడుపడిన బుర్రలతో పసి కందుల్ని చిదిమి వేయటం.
నాశనమవుతున్న విలువలతో నయవంచకుల వీరంగం.
దేశ భవితను ఊహిస్తేనే నిరాశతో క్రుంగి పోవుట తధ్యం.
జనాభా నిష్పత్తిలో అసాధారణంగా కనిపించే వ్యత్యాసం.
కనీవినీ యెరుగని నష్టాన్ని భావితరానికి మనమే అందిస్తాం!
ఇప్పటికే జరిగిన అనర్ధాన్ని అడ్డుపెట్టే ప్రయత్నాన్ని చేద్దాం!
తప్పులను దిద్దుకుందాం!పిచ్చి తల్లుల్ని హాయిగా బ్రతక నిద్దాం!
ముద్దుగా పెంచుకుంటూ మురిపెంగా బుల్లెమ్మల్ని చదివిద్దాం!
హద్దు లేని అవకాశాలనెన్నింటినో ఆడపిల్లల కందించుదాం!
మహిళా విజయంలో మనమంతా భాగస్వాముల మవుదాం!
మహిని గెలిచే స్త్రీలను మనస్ఫూర్తిగా నభినందించుకొందాం!//
