మంచి దారి
మంచి దారి
మంచిదారి.
చలికి వణికిన జనులకు సాంత్వనీయ
వచ్చె ధరణిపై శిశిరమ్ము బంధువగుచు.
పసుపు వర్ణంపు శోభతో పరిఢవిల్లు
పత్రములతోడ వృక్షముల్ పలుకరించె./
ప్రాత వర్షము వీడ్కోలు పలుకుచుండ
నాకులన్ రాల్చి వృక్షము లందముగను
క్రొత్త చివురులు వేయగా సత్తువ మెయి
తలల నూపుచు నున్నవీ ధరణి పైన./
మాఘఫాల్గుణ మను రెండు మాసములను
పుణ్య మంచు తలంచుచు పుడమి పైన
దేవదేవుని సేవలన్ తెల్లవార్లు
జనులు బారులు తీరుచు సల్పుచుంద్రు./
హరిహరాదుల దేవాలయంబులందు
నిత్యమొక యుత్సవంబుల నెఱపుచుండి
భక్త జనులెల్ల కూర్మితో వరలు చుంద్రు.
భారతీయుల యాధ్యాత్మ వైభవమిది./
మాసమేదైన కానిండు మంచిదారి
యందు మరలుటే జనులకు నవసరము.
ఋతువు లెల్లను తిరుగునీ లోక మందు.
సత్వ గుణముతో సాగుటే జనహితంబు.//
