పండుగ
పండుగ
పండుగ పసిడి సిరుల పండుగ
(తేటగీతిమాలిక )
మకరరాశికి భానుండు మరలి నపుడు
వసుధ యందున నడుగిడె పౌష్యలక్ష్మి
పల్లె పల్లెలో పండంగ పంటలిపుడు
గాదె లన్నియు నిండంగ కళ కళనుచు.
మిహిక బిందువుల్జారగా మిలమిలయని
పుడమి తల్లి తాన్ దడిసెను మురిసి మురిసి
బంతి పూవుల విరియంగ పరవశించి
పాల ధారలు కురిసె నీ పల్లెలందు.
వర్ణ వర్ణాల ముగ్గులు పలుకరించ
పరుగు పెట్టెడి కోడెలు బలము చూప
గాలి పటములు ముద్దాడె గగన తలము
కోడిపందెంపు జోరులో కుర్రకారు
మునిగి తేలుచు నిప్పుడు పొరలు చుండ
భోగభాగ్యాలు కురిపించు భోగి వచ్చె.
చలిని తరుమంగ జనులిప్డు సంతసము
భోగి మంటలు వేసిరి ప్రొద్దు ప్రొద్దు
గంగి రెద్దుల మేళాలు గడప గడప
తిరుగు చుండగ నీభువి దివిని మించ
నరుగు దెంచెనీ సంక్రాంతి యవని కిడగ
నాయురారోగ్య సంపద లాదరముగ.
పసుల సంపద ధరణికి వరము లనుచు
కనుమ దినమున పశువులన్ గాపుగాచి
పూజ సల్పిరి సైరికుల్ పుణ్యమలర.
పిల్ల పాపల నవ్వులు వెల్లి విరియ
మూడు దినముల పండుగ వేడుకలను
జరుపు కొనుచుండిరివ్విధి జనులు కలిసి.//
