పెదవులు అలిగిన వేళ
పెదవులు అలిగిన వేళ
వామ్మో! ఆమె బుంగమూతి పెడితే
నేను ఆగ గలనా? సూదంటి రాయిలా
గుచ్చే ఆ కళ్ళుై గుచ్చి గుచ్చి
చంపుతుంటే నే తాళగలనా ?
గలగలపారే జలపాతాల ఆ హోరు మాటలు
తూటాల్లా ఇల్లంతా ధ్వనించేను,ఆ పెదవులు
అలిగినవేళ భూకంపం ముందు ప్రశాంతతే-
బాబోయ్! ఏడు కొండలవాడా వెంకటేశా !
ఆపద మొక్కులవాడా కాపాడగ రావా..?
విసుగూ విరామం ఎరగక అలపు సొలుపూ
లేనితనం ఎండా వానలకు అంకితం;
పగలంతా పనులు చేసిన తరుణి సందెపొద్దుకు
పతి తెచ్చే మూరెడు జాజులకై ఎదురు చూస్తుంది;
చిరు చిరు ఆశల మొలకై,
అవి తేకుంటే చిరుబుర్రు లాడదా?
పెదవులు అలిగిన వేళనే చూడాలి,
ఆ దొండపళ్ళు అలకబూనిన వేళ ,
మాటా మంతీ కరువైన ఆ గులాబీ రేకులకై
ఎన్ని మునకలు వెయ్యాలో! అలక పానుపును
దింపేటందుకు సిగలోకి నెల వంకను తేవాలో !
వెన్నెల జల్లు కురిపించాలో! పాలరాతి మందిరానికి
తీసుకు వెళ్ళాలో ఈ అలకల కొలికిని!
నీవు అలిగిన వేళ మౌనమైన వేళ కినుకు వహించిన వేళ
ఈ ముద్దు మోము సొగసరికి అలక తీర్చే ప్రతిక్షణం
నా ప్రేమకు కొత్త అర్డం ఇస్తుంది తనువుల తపనలు
తడిసి మురిసే వేళవుతుంది
ఆ రుసరుసలకు ఎన్ని మంతనాలు ఆడాలో!
ఆ ఊసుల సడిలేక ఉసూరుమంటున్నది ప్రాణం,
పాద దాసుడనై శరణ వేడుకుంటినే ,చెలీ!
కరుణించి దరిజేరి రావా!
