గమ్మత్తుగ
గమ్మత్తుగ
హరివిల్లుల నగరినడుమ..నిలిచినావు గమ్మత్తుగ..!
నెలవంకల మాల సిగన..తురిమినావు గమ్మత్తుగ..!
మాయపట్టు వదిలించే..సౌందర్యపు నిధి నీవే..
గంధాలను రాల్చు సిరిగ..అందినావు గమ్మత్తుగ..!
ప్రేమ తడిని నీ అందెల..రవళితోడ బ్రతికింతువు..
ప్రాణాలకు ప్రాణముగా..చేరినావు గమ్మత్తుగ..!
ప్రశాంతతా గృహమేదో..చూపితివే చూపకనే..
ఈ హృదిలో దేవతవై..నిండినావు గమ్మత్తుగ..!
నీ జతలో చెలిమి వీణ..శృతిపండెను దివ్యముగా..
బంగరు మల్లెల వానన..నిలిపినావు గమ్మత్తుగ..!
ఏ మాటల మిఠాయిలో..ఇమడదులే నీ రూపం..
నాలో వెన్నెల నదివై..పొంగినావు గమ్మత్తుగ..!
