జలాశయం
జలాశయం
తనకోసం ఆశపడదు..ఒక నిశ్చల జలాశయం..!
ఆవిరయే ప్రతి బొట్టూ..తీపి కలల జలాశయం..!
పరితపించు మట్టిపాల..తేనెధార తానగునే..
నవ్వుపూల రంగులింట..చెలిమికథల జలాశయం..!
ప్రేమాలయ వీధులలో..తిరుగాడే మేఘబాల..
నీలికనుల నీడలలో..పొంగు సుధల జలాశయం..!
రాజకీయమే ఎఱుగని..రామపాద తీర్థమదే..
ప్రాణనదుల పోషణలో..రసచరితల జలాశయం..!
బహుప్రయోగ కుశలతలకు..వెన్నుదన్ను తానేలే..
గాలిలోని తడినికాచు..నిజతపనల జలాశయం..!
ప్రతికణమున తానున్నది..ప్రజ్వలించు అగ్ని కూడి..
ఏ లెక్కల కందనిదే..రసనాంచల జలాశయం..!
