పెద్ద పండుగ
పెద్ద పండుగ
పెద్ద పండుగ
( వచన కవిత)
**************************
సంబరాలు పంచుతూ సంక్రాంతి పండుగ వచ్చింది.
అంబుజమిత్రునికి భక్తిపూర్వకంగా నర్ఘ్య మిడమంది.
ముంగిళ్ల నంతంటిని చిత్ర వర్ణాల ముగ్గులతో నింపింది.
సంగతులు చెప్పండని బంధు మిత్రులతో తరలి వచ్చింది.
ఆయురారోగ్యములతో జనులను హాయిగా వర్థిల్లమంది.
కాయకష్టం చేసేవారికే కలిమి నిడతానని పట్టుబట్టింది.
రైతులే సీమ కంతటికి రారాజులని ధైర్యంగా ప్రకటించింది.
నీతి నియమాలతో నిలబడే వారింటిలో విలసిల్లుతానంది.
చిక్కుడాకులలో చేర్చి పొంగళ్ళను నైవేద్యంగా పెట్టాలంది.
చక్కగా నింటిల్లిపాదితో కలిసి సంతోషంగా జీవించమంది.
పిండి వంటలను చేయు మహిళలకు సాయం చేస్తానంది.
అండా దండగా నుండి యాపదలు తీర్చెదనని మాటిచ్చింది.
గాలిపటాల నెగరేయు కుర్రకారుతో జతకట్టి తా నాడింది.
కోలాహలంగా కోడి పందాలలో కోట్ల ఖర్చు పెట్టవద్దంది.
హరిదాసులంతరించకుండా చేయూత నిడమని చెప్పింది.
తరతరాల ఘనమౌ సంస్కృతిని వారసుల కందించాలంది.
దానధర్మాలు చేసి దైవాన్నారాధించి దయతో మెలగమంది.
ఏనాటికైనా సనాతన సంప్రదాయమే మనల రక్షిస్తుందంది.
అదిగదిగో పెద్ద పండుగ మనకు సుద్దులెన్నో చెప్పగా వచ్చింది.
ముదముగా మన జాతి కంతటికీ భోగ భాగ్యలను తెచ్చిపెట్టింది.//
**************************
